iDreamPost
android-app
ios-app

మేధావి నంబర్ వన్

మేధావి నంబర్ వన్

రాష్ట్రంలో, ఆమాటకొస్తే దేశంలోనే తనకన్నా మేధావి లేడని చంద్రబాబు నాయుడు ప్రగాఢ నమ్మకం. అందుకే రాష్ట్రానికి కానీ దేశానికి కానీ ఏది మంచిదో ఆయన నిర్ణయించి చెప్తే అందరూ దానికి తగ్గట్టుగా ముందుకు పోవాలని ఆయన భావిస్తుంటారు. చంద్రబాబు రాజకీయ ప్రస్థానం చూసిన వారికి ఇది నిజం అని తెలుస్తుంది.

ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచిన అపప్రధతో 1999లో ఎన్నికలకు పోయినప్పుడు దేశంలో వాజ్ పేయికి అనుకూల పవనాలు వీస్తున్న విషయం గమనించి, బీజేపీతో పొత్తు పెట్టుకున్నా, తనమీద జరిగిన బాంబు దాడివల్ల తనకు అనుకూలంగా సానుభూతి పవనాలు వీస్తున్నాయని, తనతో పాటు బీజేపీని కూడా ముందస్తు ఎన్నికలకు తీసుకెళ్లి ఇద్దరి ఓటమికి కారణమై, అప్పుడు బీజేపీ మతతత్వ పార్టీ అని తెలుసుకుని “ఈ పార్టీతో మరెప్పటికీ కలవను” అని చెప్పినా తన మేధావితనం మీద ఆయనకున్న నమ్మకమే కారణం.

Read Also: అమరావతి సమరం.. బాబు పర్యటన వాయిదా..

ఉప ఎన్నికల్లో వరుసగా దారుణ పరాజయాలు ఎదుర్కొంటూ, చావోరేవో తేల్చుకోవలసిన 2014 ఎన్నికల్లో దేశంలో నరేంద్ర మోడీ అనుకూల పవనాలు గమనించి, ఆ పార్టీ నాయకులు సానుకూలంగా లేకపోయినా, ఆ పార్టీలోని తన అనుకూల నాయకుల ద్వారా ప్రయత్నించి పొత్తు పెట్టుకున్నారు. అప్పుడే కొత్తగా పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ కి, “ఇద్దరం విడిగా పోటీ చేస్తే ఓట్లు చీలి జగన్ లాభపడుతాడు. కాబట్టి నువ్వు పోటీ చేయకుండా, నాకు మద్దతు ఇచ్చి, నన్ను ముఖ్యమంత్రి చేయాలి” అని చెప్పి అందుకు పవన్ ఒప్పుకునేలా చేశారు.

ఆ తరువాత ప్రజలందరూ ప్రత్యేక హోదా అంటూ ఉంటే, “హోదాలో ఏముంది? అంతకు మించిన ప్యాకేజీ తెస్తాం”అని, తరువాత కొన్నాళ్ళకు హోదా కావలసిందే అని కేంద్ర ప్రభుత్వం నుంచి బయటకొచ్చి, బీజేపీతో తెగతెంపులు చేసుకున్నారు.

Read Also: చెప్పింది బాగుంది బాబు.. అదే అసెంబ్లీ లో చెప్పలేకపోయారా..?

2019 ఎన్నికల నాటికి బిజెపి వ్యతిరేక సెంటిమెంట్ దేశంలో బలంగా ఉందని దేశంలో చిన్నాచితకా పార్టీలను కూడగట్టే ప్రయత్నం చేసి, కాంగ్రెస్ పార్టీ వైపు జరిగారు. తనతో కలవని తెరాస, వైసీపీ పార్టీలు మోడీ వైపు ఉన్నట్టే అని ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ కూడా చేశారు. తీరా ఎన్నికల్లో బిజెపి పార్టీ ఘనవిజయం సాధించాక, “తప్పయిపోయింది” అని లెంపలేసుకుని, మళ్లీ బీజేపీకి దగ్గరవుతానని సంకేతాలు పంపిస్తున్నారు.

రాష్ట్ర రాజధాని విషయంలో కూలంకషంగా అధ్యయనం చేసి, శివరామకృష్ణ కమిటీ నివేదిక ఇస్తే దాన్ని తుంగలో తొక్కి, తన మనసులో ఉన్న అమరావతిని రాజధానిగా ప్రకటించారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం రాజధాని వికేంద్రీకరణ ప్రతిపాదిస్తే, “మీకు రాజధానిని మార్చే హక్కు లేదు” అని దబాయిస్తూ, ప్రతిపక్షంలో ఉన్నా తన మాటే చెల్లుబాటు కావాలని వాదిస్తున్నారు.

Read Also: జగన్ చెప్పినట్లు మండలి రద్దుకు రామోజీ రావే కారణమా?

అలాగే 2004లో నాటి వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం శాసనమండలి పునరుద్ధరణ చేసినప్పుడు, మండలి వేస్ట్ అని, ఇప్పుడు జగన్ ప్రభుత్వం శాసనమండలి రద్దు ప్రతిపాదన చేస్తే, ప్రజాస్వామ్యంలో శాసనమండలి చాలా ముఖ్యం అని వాదిస్తున్నారు అంటే తన మేధావితనం మీద చంద్రబాబుకి ఉన్న నమ్మకమే కారణం!!