ఏదో ఓ రకంగా సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఆరోపణలు చేయాలని, విమర్శించాలనే ఆరాటంతో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంపార్టీ జనాల్లో పలుచనైపోతోందా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వస్తోంది. ప్రతిపక్షమంటే నిజంగా ప్రజాపక్షం వహించాల్సిందే. ప్రభుత్వపరంగా ఏవైనా తప్పులుంటే నిలదీయటంలో తప్పేలేదు. అదే సమయంలో తప్పుని తప్పుగాను ఒప్పుని ఒప్పుగాను అంగీకరించేదే నిజమైన ప్రతిపక్షం. కానీ రాష్ట్రంలో ప్రతిపక్షాల వైఖరి మాత్రం విచిత్రంగా ఉంది. కచ్చితంగా జగన్ పై ఆరోపణలు, విమర్శలు చేసి తీరాల్సిందే అన్న ఆలోచనతో నోటికొచ్చిన ఆరోపణలు చేస్తున్నాయి.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే జగన్ పాలనపై మెజారిటి జనాల్లో సంతృప్తి కనబడుతోంది. ఎందుకంటే ఎన్నికలకు ముందు, పాదయాత్ర సమయంలో ఏవైతే హామీలిచ్చారో అధికారంలోకి రాగానే వాటిని నెరవేర్చటానికి టైం టేబుల్ ప్రకారం పనిచేస్తున్నారు. మొదటి ఏడాదిలోనే ప్రణాళికాబద్దంగా నవరత్నాల్లోని హామీలన్నింటినీ అమలు చేసేస్తున్నారు. దాంతో ప్రతిపక్షాలకు ప్రధానంగా చంద్రబాబునాయుడుకు షాక్ తగిలిందనే అనుకోవాలి.
ఎందుకంటే తాము అధికారంలో నుండి దిగిపోయేటపుడు ఖజానాలో కేవలం రూ. 100 కోట్లు మాత్రమే ఉంచారు. కాబట్టి తానిచ్చిన హామీలను ఎట్టి పరిస్ధితుల్లోను అమలు చేసే అవకాశం లేదని అనుకున్నారు చంద్రబాబు అండ్ కో. అయితే అధికారంలోకి వచ్చిన మొదటి రెండు నెలల్లోనే తన హామీల అమలుకు షెడ్యూల్ కూడా ప్రకటించేశారు. హామీల అమలుకు షెడ్యూల్ ప్రకటించిన ముఖ్యమంత్రి బహుశా దేశం మొత్తం మీద జగనే మొదటివారేమొ. నాలుగైదు మాసాలయ్యేటప్పటికి షెడ్యూల్ దశను కూడా దాటేసి అమలుకు శ్రీకారం చుట్టేయటంతో ప్రతిపక్షాలకు నోటమాట రాలేదు.
చంద్రబాబు హయాంలో పెండింగ్ లో ఉంచిన సుమారు రూ. 60 వేల కోట్ల బిల్లుల్లో ఇప్పటికి దాదాపు రూ. 25 వేల కోట్లు చెల్లించారు. పెండింగ్ బిల్లుల చెల్లింపుతో పాటు పిల్లల ఫీజు రీఎంబర్స్ మెంటు రూ. 1800 కోట్లు, డిస్కంలకు రూ. 7 వేల కోట్లు చెల్లించారు. అంటే ఒకవైపు తన హామీలైన సంక్షేమపథకాలను అమలు చేస్తూనే మరోవైపు చంద్రబాబు నెత్తిన పెట్టిన అప్పుల భారాన్ని కూడా తగ్గించుకుంటున్నారు. దీన్ని జీర్ణించుకోలేని చంద్రబాబు జగన్ ప్రభుత్వంపై మండిపోతున్నారు.
ఏదో ఒకటి మాట్లాడి తనకు మద్దతుగా ఉండే ఎల్లోమీడియాలో హైలైట్ అయ్యేందుకని నోటికొచ్చినట్లు మాట్లాడేస్తున్నారు. సరే చంద్రబాబు మాట్లాడుతున్నారు కాబట్టి బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, జనసేన అధినేత పవన్ కల్యాణ్, సిపిఐ కార్యదర్శి రామకృష్ణ కూడా ఫాలో అయిపోతున్నారు. ఒకవైపు మెజారిటి జనాలేమో జగన్ పరిపాలన బ్రహ్మాండమంటుంటే దానికి విరుద్ధంగా చంద్రబాబు అండ్ కో ఆరోపణలు, విమర్శలు చేస్తుండటంతో జనాల్లో పలుచనైపోతున్నారు.
8569