ఎంపీగా గెలిపించినా… ఎమ్మెల్యేగా అయినా.. ముఖ్యమంత్రిని చేసినా… ఆయన ముఖ్యమంత్రిగా సాగించిన ఏడాది పాలన విషయంలో అయినా.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై ప్రజలు చూపుతున్న ఆదరణ రికార్డు స్థాయిలో ఉంటోంది. ఇప్పటి వరకూ ఏ రాజకీయ నేతా సాధించని ఘనత జగన్ సొంతం అవుతోంది.
2009 మేలో కడప పార్లమెంట్ నియోజకవర్గం నుంచి లోకసభ సభ్యుడుగా తొలి సారి జగన్ గెలిచారు. 1,78,846 మెజారిటీ సాధించి చిన్న వయసులోనే అత్యధిక ఆదరణ పొందిన నాయకుడిగా గుర్తింపు పొందారు. తన తండ్రి, ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖరరెడ్డి 2009 సెప్టెంబరు 9 న ఆకస్మికంగా మృతితో ఆ వార్త విని కొందరు వైఎస్ఆర్ అభిమానులు గుండె పగిలి మృతిచెందారు. ఆ కుటుంబాలను కలుసుకోవడానికి తలపెట్టిన ఓదార్పుయాత్రకు అనుమతి ఇవ్వని కారణంగా కాంగ్రెస్ పార్టీతో విభేదించారు. లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీని వదిలేశారు.
అనంతరం 2011 మార్చి 11 న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించారు. జగన్ రాజీనామా ఫలితంగా 2011 మేలో జరిగిన ఉపఎన్నికలలో మళ్లీ కడప నుంచి పోటీ చేసిన జగన్ కు ప్రజలు 5,45,672 అత్యధిక మెజారిటీ ఇచ్చి చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా ఆయనకు పట్టం కట్టారు. 2014 సార్వత్రిక ఎన్నికలలో కేవలం 1.25 శాతం ఓట్ల తేడాతో ఆయన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయినా.. ఆయనకు అప్పుడు కూడా ప్రజలు 75,243 మెజారిటీ ఇచ్చారు. ఆ తర్వాత 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్ లోని 175 స్థానాలకుగాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 స్థానాల్లో విజయ కేతనం ఎగురవేసింది. ఈ సారి ప్రజలు పులివెందుల ఎమ్మెల్యేగా జగన్ కు 90000కు పైగా మెజార్టీ అందించి రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక ఓట్లు పొందిన నేతగా ఆయన గుర్తింపు పొందారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి పట్టం కట్టారు.
ఏడాది పాలనపై కూడా…
మే 30న నవ్యాంధ్ర ప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జగన్మోహన్ రెడ్డి తొలి నాటి నుంచే.. సంక్షేమ పథకాలను చక చకా అమలు చేస్తూ ప్రజల దృష్టిని ఆకర్షించారు. దాని ఫలితంగానే ఆయన ఏడాది పాలనను ముక్త కంఠంతో ప్రజలందరూ శభాష్ అని మెచ్చుకున్నారు. గతంలో సీ ఓటర్ దేశ వ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో మోస్ట్ పాపులర్ సీఎంల జాబితాలో నాలుగో స్థానం సాధించి టాప్ 5లో నిలిచిన విషయం తెలిసిందే. దీంతో పాటు జగన్ పాలనపై ఎన్టీవీ నిర్వహించిన సర్వేలోనూ.. ప్రజల్లో ఆయనకున్న అభిమానం చెక్కు చెదర లేదని తేలింది. మరో సంస్థ నిర్వహించిన సర్వేలో 5 లక్షల 50 వేల మంది పాల్గొనగా.. 3, 04, 574 మంది జగన్ పాలనకు పట్టం కట్టారు. అంటే సుమారు 56 శాతానికి పైగా ప్రజలు జగన్ పాలన బాగుందని కితాబు ఇచ్చారు.
తాజా సర్వే నివేదికలో…
ఇప్పుడు తాజాగా.. జగన్ ఏడాది పాలనపై ఈ నెల 2 నుంచి 8 వరకూ ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాలు.. 44 నియోజకవర్గాల్లో ‘సెంటర్ ఫర్ సెఫాలజీ స్టడీస్’ నిర్వహించిన సర్వేలో కూడా ప్రజలు జగన్ ప్రభుత్వానికి జేజేలు పలికారు. 55.2 శాతం గ్రామీణ, 44.8 శాతం మంది పట్టణ ప్రాంత ఓటర్లు జగన్ పాలన భేష్ అన్నారు. 55.8 శాతం మంది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే మళ్లీ అధికారంలోకి రావాలని కోరుకున్నట్లు తెలిసింది. తెలుగుదేశానికి 38.3 శాతం మంది, బీజేపీ, జనసేన పార్టీలకు కలిపి 5.3 శాతం మంది ఓటేశారు. ఈ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తమ మద్దతుకు కారణమని ప్రజలు తెలిపినట్టు సర్వే సంస్థ పేర్కొంది. జగన్ సంక్షేమ పథకాలు బాగున్నాయని రాష్ట్రంలో 65.3 శాతం ప్రజలు అభిప్రాయపడుతుండగా.. 33.7 శాతం మంది బాగోలేవన్నారు.
అమరావతి ప్రాంతంలో సైతం సంక్షేమ పథకాలు బాగున్నాయని 59.5 శాతం మంది అభిప్రాయపడ్డారు. జగన్ పనితీరు బాగుందని 62.6% మంది ప్రజలు అభిప్రాయపడగా 36.1 శాతం మంది బాగోలేదన్నారు.
ఏడాదిలోనే 3,57,51,612 మందికి జగన్ ప్రభుత్వం లబ్ది చేకూర్చడం.. రూ.40,139 కోట్లు ప్రజల సంక్షేమానికి ఖర్చు చేయడం ఆయనకు ఈ స్థాయిలో ఆదరణ లభించడానికి కారణాలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఏ ముఖ్యమంత్రికీ తొలి ఏడాదిలోనే ఈ స్థాయిలో ప్రజల అదరణ లభించడం అసాధ్యమని వివరిస్తున్నారు. ప్రతీ ఎన్నికల్లోనూ జగన్ కు వచ్చిన ఓట్లను, మెజార్టీ శాతాన్ని పరిశీలిస్తే.. ప్రతి అంశంలోనూ జగన్ కు మంచి స్థానమే లభించినట్లు స్పష్టం అవుతుందని చెబుతున్నారు.
9061