iDreamPost

‘మా’ వింత గాధలు.. ఈ కొరుకుళ్లు ఏంటి?

‘మా’ వింత గాధలు.. ఈ కొరుకుళ్లు ఏంటి?

900 మంది పైగా సభ్యులు ఉన్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలకు తెలుగు మీడియా ఇచ్చిన ప్రాధాన్యత మామూలుగా లేదు. ఎన్నికల ప్రకటన రాకముందే నుంచి ఈ ఎన్నికలకు సంబంధించి చిన్న పరిణామాన్ని కూడా పెద్దగా చేసి చూపిస్తూ వచ్చింది. అలాగే ఈ ఎన్నికల ప్రకటన మొదలు అన్ని సంఘటనలు కూడా సాధారణ ఎన్నికలను తలపిస్తూ సాగాయి. నిజానికి ఈ రోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఈ ఎన్నికలు జరగాల్సి ఉంది.. ముందు బాగానే ఎన్నికలు మొదలైనా సరే తర్వాత తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ ఇద్దరూ అధ్యక్ష పదవికి పోటీ చేస్తుండగా తమకు మద్దతు ఇచ్చే వారితో చెరొక ప్యానల్ ను కూడా ప్రకటించారు. ఇప్పుడు ఈ రెండు బృందాలు ఒకరిమీద ఒకరు వ్యక్తిగత దాడులు చేసుకునే వరకు వెళ్ళింది పరిస్థితి.

కొద్దిసేపటి క్రితం రిగ్గింగ్ చేస్తున్నారు అనే ఉద్దేశంతో ఓటింగ్ నిలిపివేశారు. అసోసియేషన్ సభ్యులు కాకుండా బయట వ్యక్తులు లోపలికి రావడంతో విష్ణు మద్దతుదారుల బృందం అభ్యంతరం వ్యక్తం చేసింది.. మాస్కు పెట్టుకున్న ఒక వ్యక్తిని అడ్డుకోగా తర్వాత విష్ణు వదిలేయమనడంతో వదిలేశారు. అయితే ఎన్నికల బృందం అతనిని బయటకీ పంపేసింది. అయితే రిగ్గింగ్ ఆరోపణలు వెల్లువెత్తడంతో వెంటనే రంగంలోకి దిగిన ఎన్నికల అధికారి ప్రకాష్ రాజ్ విష్ణు బృందాలను తన ఆఫీసుకు పిలిపించుకున్నారు. ప్రకాష్ రాజ్ తరపున ఒకరు దొంగ ఓటు వేశారని మా ఎన్నికల అధికారి పేర్కొని, సీసీ ఫుటేజ్ పరిశీలిస్తానని తనకు తేడా అనిపిస్తే కోర్టుకు సైతం వెళ్తానని హెచ్చరించారు.

ఇక ఆ సంగతి పక్కన పెడితే ‘మా’ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా ఇరు ప్యానెల్‌ సభ్యుల మధ్య జరిగిన వాగ్వాదం గురించి సినీ నటుడు నరేశ్‌ స్పందించారు.‘‘గొడవేమీ లేదన్న ఆయన, చాలా చిన్న గొడవ అని, ఎవరో ప్రకాశ్‌రాజ్‌ బ్యాడ్జ్‌ వేసుకుని రిగ్గింగ్‌ చేయడానికి ప్రయత్నిస్తే ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశామని అన్నారు. నేను, ప్రకాశ్‌రాజ్‌ కౌగిలించుకున్నాం. ‘నో ఫైటింగ్‌.. ఓన్లీ ఓటింగ్‌’ అని చెప్పుకొన్నాం. శివబాలాజీని హేమగారు కొరికారు’’ అని నరేశ్‌ చెప్పుకొచ్చారు. అలాగే శివ బాలాజీ చేతికి ఉన్న పంటి గాట్లను కూడా చూపించారు. ఇక రిగ్గింగ్ చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకోవడంతో మళ్ళీ పోలింగ్‌ మొదలయింది. అయితే హేమ వ్యవహారం మీద పెద్ద చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. ఎన్నికలకు ముందు కూడా హేమ నరేష్ మధ్య కొన్ని వివాదాలు రాగా మా క్రమశిక్షణా కమిటీ ఆమెకు షో కాజ్ నోటీసులు కూడా ఇచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఈ కొరికిన అంశం హైలైట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Also Read : మా ఎన్నికల పోలింగ్ లో ఉద్రిక్తత

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి