iDreamPost

సుప్రీం, హైకోర్టు జడ్జీలలో వారే అత్యధికం..

సుప్రీం, హైకోర్టు జడ్జీలలో వారే అత్యధికం..

దేశంలో న్యాయవ్యవస్థ పనితీరు మీద చాలాకాలంగా విమర్శలున్నాయి. చివరకు న్యాయమూర్తులే ముందుకు వచ్చి వ్యవస్థలో లోపాల మీద తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన అనుభవం కూడా అత్యున్నత న్యాయస్థానంలో అందరూ చూశారు. అలాంటి సుప్రీంకోర్టు తో పాటుగా హైకోర్టులో కూడా బంధుప్రీతి ఎక్కువగా ఉందనే వాదన బయటకు వచ్చింది. దాంతోపాటుగా నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్ మెంట్ కమిషన్ ని కూడా సవాల్ చేసే పరిస్థితి వచ్చింది. ముంబైకి చెందిన న్యాయ నిపుణుడు మాథ్యూస్ ఏ నెడుంపర ఈ మేరకు సుప్రీంకోర్టులో ఓ పిటీషన్ కూడా దాఖలు చేశారు. వలస పాలన నాటి ఇలాంటి కమిషన్ రద్దు చేయాలని ఆయన కోరుతున్నారు.

తన పిటీషన్ లో భాగంగా నెడుంపర చేస్తున్న వాదనలు ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి. ఏకంగా 33 శాతం మంది సుప్రీంకోర్ట్ న్యాయమూర్తులు గతంలో పనిచేసిన వారికి సమీప బంధువులేనని చెబుతున్నారు. ఇక దేశంలోని హైకోర్ట్ జడ్జీలలో అయితే ఏకంగా సగం మంది అలాంటి వారేనని చెబుతున్నారు. ఈ మేరకు సుప్రీంకోర్ట్, హైకోర్టులలో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించిన నివేదికను 5 జడ్జీల బెంచ్ ముందు సమర్పించినట్టు ఆయన మీడియాకు తెలిపారు.

జడ్జీల నియామకంలో ఉన్న నిబంధనల కారణంగానే ఇలాంటి పరిస్థితి ఉత్పన్నం అవుతోందని ఆయన వాపోతున్నారు. సిట్టింగ్ జడ్జీలు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, న్యాయ శాఖ మంత్రులు , న్యాయ రంగంలో ఉన్న ప్రముఖులు కూడా ఈ నియామకాల్లో ప్రభావితం చేసే పరిస్థితి ఉందంటున్నారాయన. ఆయన చెబుతున్న లెక్కల ప్రకారం ప్రస్తుతం 31 మంది సుప్రీంకోర్ట్ జడ్జీలలో ఏకంగా ఆరుగురు జడ్జీలు మాజీ జడ్జీల కుమారులుగా నివేదించారు. 13 హైకోర్టు జడ్జీలలో 88 మంది నేరుగా మాజీలకు బంధువులు గానీ, న్యాయ రంగంలో నిపుణులకు సమీప బంధువులుగా గానీ ఉన్నట్టు ఆయన చెబుతున్నారు. 3014 సెప్టెంబర్ నుంచి అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ లెక్కలు సేకరించినట్టు వివరించారు.

జడ్జీల నియామకం వివరాలు వెల్లడించడకుండా , దాదాపుగా రహస్యంగా ఈ ప్రక్రియ జరుగుతుందడడం దానికో ఓ కారణంగా చెబుతున్నారు. ఇక సుప్రీంకోర్ట్ బార్ అసోసియేషన్ తరుపున వాదిస్తున్న దుష్యంత్ దేవ్ కూడా ఇలాంటి వాదన చేస్తున్నారు. ప్రస్తుత విధానం కారణంగా సమర్థులకు అవకాశం రావడం లేదంటున్నారు. అదే సమయంలో ప్రజల సమస్యలను అర్థం చేసుకోలేని స్థితిలో న్యాయమూర్తులు ఉంటున్నారని అభిప్రాయపడుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి