Dharani
Dharani
ప్రస్తుతం దేశవ్యాప్తంగా స్కామ్‌లు, కుంభకోణాలకు సంబంధించిన వార్తలు ప్రముఖంగా వెలుగులోకి వస్తున్నాయి. ఇక ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక.. దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇదిలా ఉండగా తాజాగా వెయ్యి కోట్ల రూపాయల కుంభకోణం కేసులో.. స్టార్ హీరో పేరు తెర మీదకు రావడం సంచలనంగా మారింది. ఆ వివరాలు..
దాదాపు వెయ్యి కోట్ల రూపాయల ఆన్లైన్ పోంజీ కుంభకోణం కేసులో.. బాలీవుడ్ నటుడు గోవిందా పేరు తెర మీదకు వచ్చింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా.. నటుడు గోవిందాను ప్రశ్నించనున్నట్లు ఒడిశా ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ (ఈవోడబ్ల్యూ) బుధవారం అనగా సెప్టెంబర్ 13 ఓ ప్రకటనలో తెలిపింది. పాన్-ఇండియా స్కామ్‌లో దోషిగా తేలిన కంపెనీకి సంబంధించిన ఓ ప్రకటనలో నటుడు గోవిందా యాక్ట్ చేసినందుకుగాను.. ఆయనను విచారించనున్నట్లు ఈవోడబ్ల్యూ ఒక ప్రకటనలో పేర్కొంది.
ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో వ్యాపారం సాగిస్తోన్న సోలార్ టెక్నో అలయన్స్ అనే కంపెనీ క్రిప్టోకరెన్సీ పెట్టుబడి పేరుతో ఆన్లైన్ పోంజీ స్కీంను నిర్వహిస్తోంది. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అనుమతి లేకుండానే.. దేశవ్యాప్తంగా సుమారు 2 లక్షల మందికి పైగా కస్టమర్ల నుంచి ఈ కంపెనీ భారీ మొత్తంలో డిపాజిట్లను సేకరించింది. ఇలా దాదాపు రూ. 1,000 కోట్లు సమీకరించినట్లు సమాచారం.
ఈ ఆన్లైన్ పోంజీ స్కామ్‌లో బాలీవుడ్ నటుడు గోవిందా పేరు తెరపైకి రావడం.. ప్రస్తుతం సంచలనంగా మారింది. ఆ కంపెనీకి సంబంధించి కొన్ని ప్రచార కార్యక్రమాలు నిర్వహించినందుకు గాను.. ఈఓడబ్ల్యూ.. నటుడు గోవిందాను ప్రశ్నించనుంది. ఐతే ఈ కుంభకోణంలో నటుడు గోవిందా ప్రస్తుతానికి అనుమానితుడు మాత్రమేనని.. నిందితుడు కారని సదరు సంస్థ స్పష్టం చేసింది.