iDreamPost

Gharana Bullodu : ఘరానా ఫార్ములాతో నాగార్జున అల్లరి – Nostalgia

Gharana Bullodu : ఘరానా ఫార్ములాతో నాగార్జున అల్లరి – Nostalgia

1992లో చిరంజీవి రాఘవేంద్రరావు కాంబినేషన్ లో వచ్చిన ‘ఘరానా మొగుడు’ ఇండస్ట్రీ హిట్ దెబ్బకు ఘరానా పదం మాస్ కు త్వరగా రీచ్ అయిపోయే తారక మంత్రంగా మారింది. అంతటి సూపర్ స్టార్ కృష్ణ సైతం ‘ఘరానా అల్లుడు’ అనే సినిమా చేశారు. నాగార్జునకు ఆ టైంలో మాస్ మార్కెట్ బాగా పెరుగుతోంది. ‘శివ’ మేనియాలో చేసిన ప్రయోగాలన్నీ బెడిసి కొట్టడంతో కమర్షియల్ ఫార్ములాని నమ్ముకుని యువసామ్రాట్ చేసిన అల్లరి అల్లుడు, ప్రెసిడెంట్ గారి పెళ్ళాం, వారసుడు, హలో బ్రదర్ అద్భుత విజయాలు అందుకున్నాయి. కాస్త డిఫరెంట్ టచ్ ఇద్దామని ట్రై చేసిన ‘క్రిమినల్’ వర్కౌట్ కాకపోవడంతో తిరిగి పాత రూట్ కే వచ్చారు.

సోదరుడు కృష్ణమోహన్ రావుతో కలిసి ఆర్కె ఫిలిం అసోసియేట్స్ సంస్థను స్థాపించిన రాఘవేంద్రరావు అందులోనూ ఎన్నో సూపర్ హిట్స్ అందుకున్నారు. అపూర్వ సహోదరులు, అల్లరి ప్రియుడు, అల్లరి ప్రేమికుడు లాంటి సక్సెస్ లు అందులో వచ్చినవే. ఆ టైంలో నాగార్జునతో ఓ మాస్ ఎంటర్ టైనర్ తీయాలనే ఉద్దేశంతో రాజమౌళి తండ్రి ఇప్పటి బాహుబలి ఆర్ఆర్ఆర్ కథకులు కె విజయేంద్ర ప్రసాద్ అందించిన స్క్రిప్ట్ తో ఘరానా మొగుడుని ప్రకటించారు. అప్పట్లో సిటీ పట్టణం అనే తేడా లేకుండా గుర్రాలతో నడిచే జట్కా బళ్ళు బాగా ఫేమస్. హీరో పాత్రను దాన్ని నడిపే వాడిగా డిజైన్ చేసిన తీరు అభిమానులను సైతం ఆశ్చర్యపరిచింది.

మెయిన్ హీరోయిన్ గా రమ్యకృష్ణ రెండో కథానాయికగా ఆమనిని ఎంపిక చేసిన దర్శకేంద్రులు ఈ సినిమాను సగటు అత్తా అల్లుళ్ళ ట్రీట్మెంట్ లోనే తీసినప్పటికీ వినోదాత్మకంగా మలిచిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా ఎంఎం కీరవాణి పాటలు మ్యూజికల్ గా దీని స్థాయిని పెంచాయి. పొగరుబోతులైన అత్తా భార్యకు బుద్ది చెప్పే అల్లుడిగా నాగ్ నటన మాస్ కి బాగా ఎక్కేసింది. భీమవరం బుల్లోడా పాట అన్నిటికంటే పెద్ద హిట్టు. 27 ఏప్రిల్ 1995 విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఒక్క రోజు గ్యాప్ తో వచ్చిన జురాసిక్ పార్క్ వరల్డ్ వైడ్ సునామిని తట్టుకుని మరీ ఘనవిజయం అందుకుంది. కింగ్ ను మాస్ కు మరింత దగ్గర చేసింది

Also Read : Mechanic Mavayya : హంగులు మిన్న విషయం సున్నా – Nostalgia 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి