iDreamPost

నిర్మాతకు ఎగ్జిబిటర్ కు మధ్య డిజిటల్ చీలిక

నిర్మాతకు ఎగ్జిబిటర్ కు మధ్య డిజిటల్ చీలిక

సినిమా పరిశ్రమకు లాక్ డౌన్ వల్ల వచ్చిన ఇబ్బందులు అన్ని ఇన్ని కావు. ఈ రంగం మీద ఆధారపడిన ప్రతి ఒక్కరిపైన ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రభావం చూపుతూనే ఉంది. ఇప్పటికే షూటింగులు, థియేటర్లు మూతబడి రెండు నెలలు దాటింది. వీటి ద్వారా ఉపాధి పొందుతున్న వాళ్లందరికీ సకాలంలో అవసరాలు తీరుతున్నాయో లేదో కూడా అర్థం కానీ పరిస్థితి నెలకొంది. ప్రభుత్వాలు మాత్రం ఇప్పటికిప్పుడు సినిమా అనేది ప్రాధాన్యత ఇవ్వాల్సిన అంశం కాదన్న తరహాలో వ్యవహరిస్తుండటంతో ఇదంతా ఎప్పటికి సద్దుమణుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది.

మరోవైపు హాళ్లలో విడుదల కానీ సినిమాల ఓటిటి రిలీజ్ ప్రకటనలు ఊపందుకున్నాయి. నిన్న అమితాబ్ బచ్చన్ కొత్త మూవీ గులాబో సితాబో తాలూకు అమెజాన్ ప్రైమ్ ప్రకటన వచ్చాక లీడింగ్ మల్టీ ప్లెక్స్ ఐనాక్స్ యాజమాన్యం దాని గురించి అసంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రకటన విడుదల చేసింది. సంప్రదాయ ప్రదర్శనకు విరుద్ధంగా ఇలా డిజిటల్ బాట పట్టడం పట్ల విచారం వ్యక్తం చేసింది. ఇవాళ ప్రొడ్యూసర్స్ గిల్డ్ అఫ్ ఇండియా సైతం ఓ సుదీర్ఘ వివరణతో కూడిన లేఖను రిలీజ్ చేసింది. కోట్ల రూపాయల పెట్టుబడితో నిర్మాతలు సినిమాలు తీసి వాటి రూపంలో పెట్టుబడులు చిక్కుకున్నప్పుడు ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవచ్చని ఇలాంటి విపత్కర పరిస్థితిలో ఇంతకు మించి వేరే మార్గం లేదని స్పష్టం చేసింది.

అయితే ఓటిటి రిలీజ్ అనేది కొందరు మాత్రమే ఎంచుకున్న ఆప్షన్ కాబట్టి భవిష్యత్తులో ఎలాంటి ఆందోళన లేకుండా కరోనా ఉదృతి తగ్గాక జనం యధావిధిగా థియేటర్లకే వస్తారని పేర్కొంది. ఒకరకంగా ఐనాక్స్ నిరసనకు బదులుగానే ఇది సమాధానంగా చెప్పుకోవచ్చు. ఇలాంటి ధోరణి మంచిది కాదని చెబుతూనే పరస్పర సహకారం అవసరమంటూ తమ మద్దతు మాత్రం నిర్మాతలకే అని చెప్పింది. ఒకవైపు తమిళనాడులో సూర్య సినిమాలు ఇకపై బ్యాన్ చేస్తామనే డిస్ట్రిబ్యూటర్ల బెదిరింపు ఒక కొలిక్కి రాకముందే ఇప్పుడు ప్రొఫెషనల్ గా ఐనాక్స్ విడుదల చేసిన లేఖకు అంతే మోతాదులో ప్రొడ్యూసర్స్ గిల్డ్ బదులు ఇవ్వడం గమనార్హం. మొత్తానికి ఓటిటి వ్యవహారం నిర్మాతలకు, ఎగ్జిబిటర్లకు మధ్య సన్నని చీలిక తెచ్చిన మాట వాస్తవం. అయితే ఏది ఎలా ఉన్నా కరోనా సద్దుమణిగాక అంతా మాములుగానే ఉంటుందని సీనియర్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి