iDreamPost

కరోనా మృత్యుహేళ – అగ్రరాజ్యం అతలాకుతలం

కరోనా మృత్యుహేళ – అగ్రరాజ్యం అతలాకుతలం

కరోనా(కోవిడ్-19) కారణంగా ప్రపంచవ్యాప్తంగా మరణాల సంఖ్య పెరుగుతుంది. ఇప్పటికే పలు దేశాలు కరోనా కారణంగా వణుకుతున్నాయి. ముఖ్యంగా అగ్రరాజ్యమైన అమెరికా, స్పెయిన్,బ్రిటన్, ఇటలీల పరిస్థితి రోజు రోజుకు దిగజరుతుంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ బాధితుల సంఖ్య 10,98,848కి చేరగా మరణాల సంఖ్య 58,871కు చేరుకొంది.

శుక్రవారం స్పెయిన్‌లో 900 మందికిపైగా కరోనా కారణంగా మృత్యువాతపడ్డారు. బ్రిటన్‌లో ఒక్కరోజులోనే 569 మంది మృతి చెందారు. ఈ నేపథ్యంలో బ్రిటన్ ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన 4వేల పడకల ఫీల్డ్‌ ఆసుపత్రిని ప్రారంభించింది.

అగ్రరాజ్యం ఇప్పుడు కరోనా వల్ల చిగురుటాకులా వణుకుతుంది. ఇప్పటికే వైరస్ సోకిన బాధితుల సంఖ్య 2,77,828 మంది కాగా 7,406 మంది కరోనా కారణంగా అమెరికాలో మృతి చెందారు. కాగా ఒక్కరోజులోనే1480 మంది మరణించినట్లు జాన్స్‌ హాప్‌కిన్స్‌ యూనివర్శిటి ట్రాకర్‌ వెల్లడించింది. ఇదిలా ఉండగా న్యూయార్క్‌ నగరంలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఇప్పటికే కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 50 వేలకు పైగా చేరగా, 1500మందికి పైగా మృత్యు వాత పడ్డారు. మరణాల సంఖ్య పెరగడం వల్ల శ్మశానవాటికల వద్ద రద్దీ బాగా పెరిగిపోయింది. దీంతో మృతదేహాల ఖననానికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. మృతుల సంఖ్య పెరగడంతో శ్మశానవాటికల నిర్వాహకులపై బాగా ఒత్తిడి పెరుగుతోంది. డిమాండ్‌ను తట్టుకోలేక నిర్వాహకులు చేతులెత్తేస్తున్నారు.

కాగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కి రెండోసారి నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగెటివ్ గా నిర్ధారణ అయ్యింది. అయితే కరోనా కారణంగా అమెరికాలో నిరుద్యోగం పెరిగే అవకాశం ఉందని, దాదాపు 1.5 కోట్లమందికి ఉపాధి అవకాశాలు కోల్పోతారని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఆర్థిక మాంద్యానికి దారి తీస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి