iDreamPost

దాసు తీరు – అంతా తారుమారు

దాసు తీరు – అంతా తారుమారు

ఒకప్పుడు మురుగదాస్ అంటే బ్రాండ్. గజని సినిమా చూసి అమీర్ ఖాన్ అంతటి వాడే ఫ్లాట్ అయిపోయి రీమేక్ చేసే దాకా వదల్లేదు. చిరంజీవిని ఒప్పించడం మహామహా దర్శకులకే కష్టమైపోతున్న టైంలో స్టాలిన్ ఆఫర్ ఏరికోరి మరీ తనవద్దకు వచ్చేలా చేసుకున్న డైరెక్టర్ అతను. ఇక తెలుగులో వివి వినాయక్ టాగోర్ గా రీమేక్ చేసుకున్న తమిళ రమణ గురించి చెప్పుకుంటూ పోతే చాలా చరిత్రే ఉంది. విజయ్ కాంత్ సెకండ్ ఇన్నింగ్స్ కు ఇది హౌరా బ్రిడ్జ్ అంత పునాది వేసింది. కానీ ఇదంతా గత చరిత్ర.

మురుగదాస్ తన బ్రాండ్ ని క్రమంగా తగ్గించుకుంటున్నాడు. మహేష్ బాబుతో చేసిన బై లింగ్వల్ మూవీ స్పైడర్ ఎప్పుడైతే దారుణమైన డిజాస్టర్ గా మిగిలిందో అప్పటి నుంచే మన స్టార్లు దాస్ కు ఆఫర్ ఇవ్వడం గురించి ఆలోచించే పరిస్థితి వచ్చింది. విజయ్ సర్కార్ కమర్షియల్ గా పాస్ అయినా అదీ దాస్ స్టాండర్డ్ లో ఆశించిన సినిమా కాదు. ఇక రజనీకాంత్ దర్బార్ గురించి చెప్పదేముంది. తలైవా ఇమేజ్ కూడా కాపాడలేకపోయింది. అక్కడా తీవ్ర నష్టాలు మిగిల్చి ఏకంగా వివాదాల దాకా పోయింది. ఇప్పుడు దెబ్బకు మురుగదాస్ నెక్స్ట్ మూవీ ఏంటి అంటే వెంటనే చెప్పలేని పరిస్థితి నెలకొంది. నిజానికి అల్లు అర్జున్ తో సినిమా చేసే ప్లాన్ మురుగదాస్ కు ఎప్పటి నుంచో ఉంది.

కాని అల వైకుంఠపురములో ఇండస్ట్రీ హిట్ దెబ్బకు బన్నీ ఇప్పుడు ఎలాంటి రిస్క్ చేసే స్థితిలో లేడు. అందుకే దాస్ ప్రాజెక్ట్ గురించి పునరాలోచనలో పడ్డట్టు ఇన్ సైడ్ టాక్. ఇప్పటికైతే సుకుమార్ మూవీలో బిజీగా ఉన్నాడు బన్నీ. అది ఎంత లేదన్నా వచ్చే ఏడాదికి రిలీజవుతుంది. ఇంకా వేణు శ్రీరామ్ తో ప్లాన్ చేసిన ఐకాన్ లైన్ లో ఉంది. అది ఉంటుందా లేదా అనే క్లారిటీ ప్రస్తుతానికి లేదు. ఇవి కాకుండా బన్నీ తనకు రేస్ గుర్రం లాంటి సూపర్ హిట్ ఇచ్చిన సురేందర్ రెడ్డి వైపు కూడా చూస్తున్నట్టు టాక్ ఉంది. ఇవన్ని పక్కన పెడితే మురుగుదాస్ మాత్రం తన ఒరిజినల్ స్టైల్ లో తిరిగి వెళ్ళడం గురించి సీరియస్ గా ఆలోచించాల్సిన టైం వచ్చింది. స్టార్ హీరోల ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని కథలు రాసుకుంటూ సగటు దర్శకుడిలా మారిపోవడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. దాస్ నుంచి నెక్స్ట్ వచ్చే సినిమా గజినీ, రమణ స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి