iDreamPost

స్థానిక సంస్థల ఎన్నికలు.. ఉలుకు పలుకు లేదు..

స్థానిక సంస్థల ఎన్నికలు.. ఉలుకు పలుకు లేదు..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారం ఒకడుగు ముందుకు మూడడుగులు వెనక్కి అన్న చందంగా మారింది. ఈ నెల 17వ తేదీ నాటికి రిజర్వేషన్ల వివాదం తేల్చాలని సుప్రిం కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే ఈ దిశగా రాష్ట్ర హైకోర్టులో ఎలాంటి ముందడుగు పడలేదు. మరో పక్క మార్చి 15 నాటికి రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేస్తామని ఈ నెల 12 జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. కానీ రిజర్వేషన్ల అంశం ఇంకా కొలిక్కి రాకపోవడంతో ప్రభుత్వం అనుకున్న సమయంలో ఎన్నికలు పూర్తి కావడంపై నీలినీడలు కమ్ముకున్నాయి.

రాష్ట్రంలో పంచాయతీ పాలక వర్గాల గడువు 2018 ఆగస్టులో, మండల, జిల్లా పరిషత్‌ పాలక మండళ్ల గడవు గతేడాది జూన్‌లో, మున్సిపల్‌ పాలక వర్గాల గడువు గతేడాది జూలైలో ముగిసింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతుండగా.. ఆ ఎన్నికలను వెంటనే నిర్వహించేలా ఆదేశించాలంటూ.. హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. హైకోర్టు ఆదేశాలతో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు రిజర్వేషన్లు ఖరారు చేసింది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్టీలకు 6.77 శాతం, ఎస్సీలకు 19.08 శాతం, బీసీలకు 34 శాతం చొప్పున మొత్తం 59.85 శాతం రిజర్వేషన్లు కల్పించారు. ఎన్నికల నోటిపికేషన్‌కు అవసరమైన షెడ్యూల్‌ కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం రూపొందించి హైకోర్టుకు అదజేసింది.

ఇదే సమయంలో రిజర్వేషన్లు 50 శాతం దాటడంపై సవాల్‌ చేస్తూ కర్నూలుకు చెందిన టీడీపీ నేత బిర్రు ప్రతాప్‌ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. వాదోపవాదాలు విన్న తర్వాత రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో గత నెల 17వ తేదీన మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల చేయాలనుకున్నారు. అయితే బిర్రు ప్రతాప్‌ రెడ్డి హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రింను ఆశ్రయించారు.

59.85 శాతం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమంటూ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ విషయంపై విచారించిన దేశ అత్యున్నత న్యాయస్థానం ఎన్నికల నోటిఫికేషన్‌పై స్టే విధించింది. రిజర్వేషన్ల వివాదాన్ని పరిష్కరించాలంటూ తిరిగి రాష్ట్ర హైకోర్టుకే బాధ్యతలు అప్పజెప్పింది. నెల రోజుల్లోపు ఈ సమస్యను పరిష్కరించాలని గడువు విధించింది.

సుప్రిం ఆదేశాలతో రాష్ట్ర హైకోర్టు రిజర్వేషన్ల అంశంపై మళ్లీ విచారణ ప్రారంభించింది. ఇరు వర్గాలు ఎప్పటిలాగే తమ వాదనలను సమర్థించుకున్నాయి. విద్య, ఉద్యోగాల్లో మాత్రమే 50 శాతం రిజర్వేషన్లు అమలవుతాయని, రాజకీయ ప్రక్రియలో 50 శాతం లోపు అనే నిబంధన వర్తించదని, గతంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు 50 శాతానికి మించి రాజకీయ రిజర్వేషన్లు ఇచ్చాయంటూ ప్రభుత్వం అఫిడవిట్‌ దాఖలు చేసింది.

హైకోర్టు తీర్పు ఎలా ఉన్నా ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 50 శాతం మాత్రమే రిజర్వేషన్లు ఉండాలని హైకోర్టు ఆదేశిస్తే.. ఆ మేరకు రిజర్వేషన్లలో మళ్లీ మార్పులు చేసి నోటిపికేషన్‌ విడుదల చేస్తామని ఈ నెల 12వ తేదీన జరిగిన మంత్రివర్గ సమావేశం అనంతరం సమాచార శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. 50 శాతం మాత్రమే ఉండాలంటే.. ఆ మేరకు బీసీలకు కల్పించిన 34 శాతంలో 9.85 శాతం కోత పడుతుంది. ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ల శాతంలో ఎలాంటి మార్పు ఉండదు.

ఈ నెల 17వ తేదీలోపు రిజర్వేషన్ల అంశం కొలిక్కి వస్తుందనుకున్న ప్రభుత్వ, రాజకీయ పార్టీల అంచనాలు పటాపంచలయ్యాయి. మార్చి నెలాఖరులోపు ఎన్నికలు నిర్వహించకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు ఆగిపోతాయని రాష్ట్ర ప్రభుత్వం ఆందోళనలో ఉంది. ఈ నేపథ్యంలో రిజర్వేషన్లపై హైకోర్టు విచారణ ఎప్పటిలోపు ముగిస్తుందనేది ఎవరికీ అంతుబట్టడం లేదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి