iDreamPost

ఇది ‘జెంటిల్ మెన్’ బంధం – Nostalgia

ఇది ‘జెంటిల్ మెన్’ బంధం – Nostalgia

బాలీవుడ్ దర్శకుడిగా మహేష్ భట్ కున్న పేరు తెలియంది కాదు. 90వ దశకంలో ఈయన సినిమాలు సృష్టించిన సంచలనం అప్పట్లో ఒక చరిత్ర. నామ్, కబ్జా, డాడీ లాంటి సూపర్ హిట్స్ తో పాటు ఆషీకీ, సడక్, దిల్ హై కి మాన్తా నహీ లాంటి బ్లాక్ బస్టర్స్ కూడా ఎన్నో ఉన్నాయి. పోస్టర్లో ఈయన పేరు ఉందంటే ఖచ్చితంగా మ్యూజికల్ గా అద్భుతమైన పాటలు ఉంటాయన్న నమ్మకం అప్పటి ప్రేక్షకుల్లో ఉండేది. అలాంటి మహేష్ భట్ తెలుగులో కేవలం ఇద్దరు హీరోలతోనే పనిచేశారు. ఒకరు మెగాస్టార్ చిరంజీవి కాగా మరొకరు కింగ్ నాగార్జున. ఇక్కడ చూస్తున్న పిక్ 1994లో విడుదలైన జెంటిల్ మెన్ హిందీ వెర్షన్ రీమేక్ ది.

అర్జున్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తమిళంలో రూపొంది అంతకు ముందు ఏడాది సౌత్ లో విజయ దుందుభి మ్రోగించిన జెంటిల్ మెన్ ని హిందీలో తీయాలని చిరంజీవి సంకల్పం. అప్పటికే ప్రతిబంధ్, ఆజ్ కా గూండారాజ్ లు మంచి విజయం సాధించి ఉండటంతో దీని మీద మనసు పడ్డారు. ఉత్తరాది దర్శకుడైతే ఇంకా బాగా డీల్ చేయగలరని మహేష్ భట్ ని సంప్రదిస్తే ఆయన సంతోషంగా ఒప్పుకున్నారు. అప్పటికే కెరీర్ పరంగా మెగాస్టార్ పీక్స్ లో ఉన్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ దీన్ని భారీగా నిర్మించారు. అను మలిక్ సంగీతం అందించారు. అయినా మూడు బాణీలు ఒరిజినల్ వి వాడుకోక తప్పలేదు. హీరోయిన్ గా జుహీ చావ్లా, తమిళ్ లో చరణ్ రాజ్ చేసిన పోలీస్ ఆఫీసర్ పాత్రకు పరేష్ రావల్ ని తీసుకున్నారు. మెయిన్ మూవీలో ప్రభుదేవా చేసిన చికుచికుబుకు రైలే పాటను ఇందులో చిరంజీవే చేశారు.

స్పెషల్ అప్పీయరెన్స్ గా రోజా ఈ ఒక్క పాట కోసం కాలు కదిపారు. ఇక మిగిలిన క్యాస్టింగ్ అంతా హిందీ నటీనటులనే తీసుకున్నారు. భారీ అంచనాల మధ్య ది జెంటిల్ మెన్ అత్యధిక ప్రింట్లతో విడుదలై ఆశించిన విజయం సాధించలేకపోయింది. అయినప్పటికీ చిరు డాన్సులు, ఫైట్స్ తో మాస్ ప్రేక్షకులను అలరించారు. అప్పటికే చూసేసిన సినిమా కావడంతో తెలుగు రాష్ట్రాల్లో ది జెంటిల్ మెన్ ఆడలేదు. దీని తర్వాత చిరంజీవి మరో స్ట్రెయిట్ హిందీ మూవీ చేయలేకపోయారు. కాకపోతే మహేష్ భట్ కు ఈ సినిమా రూపంలో మెగాస్టార్ తో చేసిన అనుభవం మిగిలింది. ఇంకో ఏడాది గ్యాప్ తర్వాత అక్కినేని నాగార్జునతో మహేష్ భట్ రెండు భాషల్లోనూ క్రిమినల్ తీశారు. దాని ఫలితమూ అంతే. కాకపోతే పాటల పరంగా మంచి ఆల్బమ్ గా నిలిచిపోయింది. ఆపై ఆయన ఇంకో తెలుసు సినిమా చేయలేకపోయారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి