iDreamPost

మరి ప్రత్యేక హోదా హామీ సంగతేంటి వెంకయ్య గారు?

మరి ప్రత్యేక హోదా హామీ సంగతేంటి వెంకయ్య గారు?

ధారాళంగా ఎన్నికల హామీలు ఇవ్వడం సమంజసం కాదు. ఆచరణ సాధ్యమైన హామీలే ఇవ్వాలి. ఇచ్చిన వాగ్దానాలను తప్పనిసరిగా అమలు చేయాలని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు రాజకీయ పార్టీలకు సూచించారు. రెండు రోజులుగా ఏపీలో పర్యటిస్తున్న ఆయన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.ఇటీవలి కాలంలో ఎన్నికల హామీలు గుప్పించడంలో పార్టీలు పోటీపడుతున్నాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవో కొన్నింటిని అమలుచేసి.. మిగతావాటిని విస్మరిస్తున్నాయి. ఈ ధోరణి పట్ల వెంకయ్య ఆవేదన సమంజసమే. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. బీజేపీ కూడా తాను అధికారంలో ఉన్న రాష్ట్రాలతోపాటు కేంద్ర ప్రభుత్వపరంగా గతంలో ఇచ్చిన అనేకానేక హామీలకు నీళ్లు వదిలేస్తోంది. వాటి సంగతి ఎలా ఉన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎనిమిదేళ్ల క్రితం ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని బీజేపీ తుంగలో తొక్కేసింది. ఆచరణ సాధ్యమైన హామీయే అయినప్పటికీ దాన్ని ముగిసిన అధ్యాయంగా కేంద్ర సర్కారు పరిగణిస్తుండటంతో ఇచ్చిన హామీల అమలులో బీజేపీ సైతం చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని తేటతెల్లం అవుతోంది. ప్రస్తుతం ఉప రాష్ట్రపతి పదవిలో ఉన్న వెంకయ్యనాయుడు ఆనాడు బీజేపీ నేతగా ఈ హామీకి ప్రత్యక్ష సాక్షిగా ఉండటం విశేషం.

మోడీ హామీ.. వెంకయ్య సాక్షి

రాష్ట్ర విభజన అనంతరం 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ పొత్తుతో పోటీ చేశాయి. ఆ ఎన్నికల్లో తొలిసారి ఎన్డీయే ప్రధానమంత్రి అభ్యర్థిగా బరిలోకి దిగిన నరేంద్ర మోడీ తిరుపతి ప్రచారసభలో ప్రసంగిస్తూ కేంద్రంలో బీజేపీని, రాష్ట్రంలో టీడీపీని గెలిపిస్తే విభజనతో గాయపడిన ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి ఆదుకుంటామని టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలోనే హామీ ఇచ్చారు. బీజేపీ నేత హోదాలో ప్రధాని ప్రసంగాలను తెలుగులోకి అనువదించిన వెంకయ్య నాయుడు.. తర్వాత తను ప్రసంగించిన పలు ప్రచార సభల్లో తానే స్వయంగా అదే హామీ పునరుద్ఘాటించారు. ఐదేళ్లు కాదు పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. వారి మాటలను విశ్వసించిన ప్రజలు ఓట్లు వేసి అధికారం కట్టబెట్టారు. కానీ అటు బీజేపీ, ఇటు టీడీపీ తమ ఎన్నికల హామీని మాత్రం విస్మరించి విశ్వాస ఘాతకానికి పాల్పడ్డాయి. అధికారంలోకి వచ్చిన రెండేళ్లకే మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మడమ తిప్పేసింది. ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని తేల్చేసింది.ఇకముందు ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇవ్వరాదని14వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసిందన్న సాకుతో ఆ సిఫార్సులకు ముందే పార్లమెంటులో ఆమోదించిన ఏపీ పునర్విభజన చట్టంలో పొందుపరిచిన ప్రత్యేక హోదాను ముగిసిన అధ్యాయమంటూ మూలన పడేసింది.

స్వరాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా..

విభజన చట్టంపై పార్లమెంటులో చర్చ సందర్భంగా నాడు బీజేపీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న వెంకయ్య నాయుడు మాట్లాడుతూ ఏపీకి ఐదేళ్లు కాకుండా పదేళ్లు ప్రత్యేక హోదా ఇవ్వాలని యూపీఏ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తర్వాత జరిగిన ఎన్నికల్లో తమ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. అనుకున్నట్టే కేంద్రంలో మోడీ ప్రభుత్వం కొలువుదీరింది. ఆ తర్వాత వెంకయ్యనాయుడు ఉప రాష్ట్రపతిగా ప్రమోషన్ పొందారు. కానీ వారిని నమ్మిన పాపానికి ఆంధ్ర ప్రజలు మాత్రం ప్రత్యేక హోదాకు ఇప్పటికీ నోచుకోలేకపోతున్నారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల కారణంగా ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని, దానికి బదులు ప్రత్యేక ప్యాకేజి ఇస్తామని 2016లో కేంద్రం ప్రకటించగా.. గత సీఎం చంద్రబాబు కేంద్రంతో కుమ్మక్కై అంగీకరించడం ద్వారా ప్రత్యేక హోదా పీక నొక్కేశారు. ఆనాడు కేంద్ర మంత్రిగా ఉన్న వెంకయ్య నాయుడు కూడా సొంత రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై తమ పార్టీ, కేంద్ర ప్రభుత్వ పెద్దలను ప్రశ్నించే సాహసం చేయలేకపోయారు. తర్వాత ఉప రాష్ట్రపతిగా వెళ్లిపోయారు. పార్టీతోనూ, ప్రభుత్వ వ్యవహారాలతోనూ తనకు సంబంధం లేనట్లు వ్యవహరిస్తున్నారు. నిజమే.. ఉన్నతమైన రాజ్యాంగ పదవిలో ఉన్నవారు రాజకీయాలకు అతీతంగా ఉండాల్సి ఉంటుంది. కానీ సొంత రాష్ట్ర ప్రజలకు అపరిమితమైన మేలు చేసే ప్రత్యేక హోదా అమలు విషయంలో కేంద్ర పెద్దలను ఒప్పించడం తప్పేమీ కాదు. పైగా అది పార్లమెంటు ఆమోదించిన చట్టంలోని కీలక హామీయే. ఆయినా వెంకయ్య ఆ విషయంలో చొరవ తీసుకోకుండా, ఇచ్చిన హామీలను తప్పనిసరిగా అమలు చేయాలని సలహా ఇవ్వడం విడ్డూరంగా ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి