iDreamPost

iPhone తన కాపురం కూల్చిందంటూ.. Appleపై 53 కోట్లకు వ్యాపారి దావా!

  • Published Jun 18, 2024 | 9:26 AMUpdated Jun 18, 2024 | 9:26 AM

ఐఫోన్‌ తన కాపురంలో నిప్పులు పోసిందని.. దాని వల్ల తన భార్య తన నుంచి విడిపోయింది.. ఇందుకు యాపిల్‌ కంపెనీనే కారణం అంటూ దావా వేశాడు ఓ వ్యక్తి. ఆ వివరాలు..

ఐఫోన్‌ తన కాపురంలో నిప్పులు పోసిందని.. దాని వల్ల తన భార్య తన నుంచి విడిపోయింది.. ఇందుకు యాపిల్‌ కంపెనీనే కారణం అంటూ దావా వేశాడు ఓ వ్యక్తి. ఆ వివరాలు..

  • Published Jun 18, 2024 | 9:26 AMUpdated Jun 18, 2024 | 9:26 AM
iPhone తన కాపురం కూల్చిందంటూ.. Appleపై 53 కోట్లకు వ్యాపారి దావా!

మొబైల్‌ ఫోన్ల వినియోగం, సోషల్‌ మీడియా వల్ల మనిషి జీవితంలో వ్యక్తిగతం అంటూ లేకుండా పోయింది. మరీ ముఖ్యంగా సోషల్‌ మీడియా వినియోగం వల్ల.. చాలా మంది జీవితాల్లో పర్సనల్‌ లైఫ్‌ అంటూ లేకుండా పోతుంది. తమ జీవితాల్లో జరిగే ప్రతి దాన్ని నెట్టింట పెట్టి రచ్చకెక్కుతున్నారు. ఇక సోషల్‌ మీడియా వల్ల జీవితాలు నాశనం కావడం మాత్రమే కాక.. వైవాహిక బంధాలు కూడా చిక్కుల్లో పడుతున్నాయి. చాలా మంది విడాకులకు మొబైల్‌ వినియోగం, సోషల్‌ మీడియా కారణం అవుతున్నాయి అంటే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఈ క్రమంలో ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన యాపిల్‌ ఫోన్‌.. తన కాపురం కూల్చింది అంటూ ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. యాపిల్‌ కంపెనీ మీద 53 కోట్ల రూపాయలు దావా వేశాడు. ఆ వివరాలు..

ఐఫోన్‌ వల్ల తన కాపురం కూలిపోయిందంటూ లండన్‌కు చెందిన ఓ వ్యక్తి .. యాపిల్‌ కంపెనీ మీద కోట్ల రూపాయలకు దావా వేశాడు. అసలేం జరిగిందంటే.. లండన్‌కు చెందని ఓ వ్యాపారవేత్త.. యాపిల్‌ ఐమ్యాక్‌లో వేశ్యలతో చాట్‌ చేశాడు. తర్వాత వాటిని డిలీట్‌ చేశాడు. అయినా సరే కొన్నాళ్లకు ఆ మెసేజ్‌లు అతడి భార్య కంట పడ్డాయి. అవే అతడి కొంప ముంచాయి. భర్త చేసే పనుల గురించి తెలుసుకున్న ఆ మహిళ.. అతడికి విడాకులు ఇచ్చింది. సదరు వ్యాపారవేత్త.. తన భార్యకు తెలియకుండా వేశ్యలతో ఫోన్‌లోనే రాసలీలలు సాగించాడు. ఇక ఆ వ్యవహారం బయటపడకుండా ఉండేందుకు మెసేజ్‌లన్నీ డిలీట్‌ చేశాడు.

అయితే ఇదే యాపిల్‌ ఐడీని తన ఐమ్యాక్‌లోనూ ఉపయోగించాడు. దీంతో ఐఫోన్‌లో మెసేజ్‌లు డిలీట్ చేసినా ఐమ్యాక్‌లో మాత్రం అలాగే ఉండిపోయాయి. అదే అతడి కొంప ముంచింది. ఐఫోన్‌లో డిలీట్‌ చేసిన మెసేజ్‌లు.. ఐమ్యాక్‌లో కూడా కనిపించాయి. ఒక రోజు అతడి భార్య.. ఆ మెసేజ్‌లను చూసేసింది. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన భార్య.. భర్తతో గొడవపడింది. ఇక భర్తతో తెగదెంపులు చేసుకునేందుకు సిద్ధమై.. చివరికి విడాకులకు దరఖాస్తు చేసింది. కోర్టు విడాకులు మంజూరు చేయడంతో.. వారిద్దరూ విడిపోయారు.

అయితే తన కాపురం ఇలా కూలిపోవడానికి కారణం యాపిల్‌ సంస్థ అని అనుమానించిన ఆ వ్యాపారవేత్త.. ఆ కంపెనీపై దావా వేశాడు. ఫోన్‌లో మెసేజ్‌లు డిలీట్‌ చేశాం అంటే.. అవి పూర్తిగా డిలీట్‌ అయిపోవాలి కదా.. అంతేకానీ.. లింక్‌ చేసిన అన్ని పరికరాల్లో.. ఆ మెసేజ్‌లు ఉండిపోతాయనే విషయాన్ని యాపిల్‌ సంస్థ యూజర్లకు స్పష్టంగా తెలియజేయలేదు అని ఆరోపించాడు. ఒక్క డివైజ్‌లోనే మెసేజ్‌లు డిలీట్‌ అవుతాయని చెబితే.. యూజర్లు జాగ్రత్తగా ఉంటారు కదా.. ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటారు కదా అని పేర్కొన్నాడు. కానీ యాపిల్‌ కంపెనీ ఈ విషయాలను కస్టమర్లకు తెలపలేదని.. దాని వల్లే తాను డిలీట్‌ చేసిన మెసేజ్‌లు వేరే డివైజ్‌లో తన భార్యకు కనిపించి.. అవి తన విడాకులకు కారణం అయ్యిందని వాపోయాడు.

యాపిల్‌ నిర్లక్ష్యం వల్ల తాను 5 మిలియన్‌ పౌండ్లు అంటే ఇండియన్‌ కరెన్సీలో చెప్పాలంటే.. దాదాపు రూ.53 కోట్లు నష్టపోయినట్లు వెల్లడించాడు. తన భార్య మెసేజ్‌లు చూడటం వల్లే విడాకులు ఇచ్చిందని పేర్కొన్న ఆ వ్యక్తి.. ఇందుకు గాను యాపిల్‌ సంస్థ తనకు రూ. 53 కోట్లు చెల్లించాలని కోర్టులో దావా వేశాడు. ఈ పిటిషన్‌ను కోర్టు త్వరలోనే విచారణ జరపనుంది. మరి తీర్పు ఏం ఇస్తుందో వేచి చూడాల్సిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి