iDreamPost

ఆపద సమయంలో అన్నార్ధుల ఆకలి తీర్చడానికి ముందుకొచ్చిన టీటీడీ

ఆపద సమయంలో అన్నార్ధుల ఆకలి తీర్చడానికి ముందుకొచ్చిన టీటీడీ

కరొనా కల్లోలంలో ప్రజలను ఆడుకోవడంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటుందని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. కరొనా వైరస్ మహమ్మారి నుండి ప్రజలను కాపాడేందుకు కెంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తోడుగా టీటీడీ అందించనున్న సహాయ సహాకారాల గురించి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శనివారం మీడియా ప్రకటన ద్వారా వెల్లడించారు.

లాక్ డౌన్ కారణంగా పనులు లేక అలమటిస్తున్న పేదలకు, అనాధలకు, ఈ లాక్ డౌన్ కాలంలో ప్రజలకు నిరంతరాయంగా సేవలందిస్తున్న ప్రభుత్వ సిబ్బందికీ టీటీడీ తరుపున రోజుకు 50 వేల ఆహార పొట్లాలు ఉచితంగా అందిస్తామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. దానిలో భాగంగా తొలిగా శనివారం 15 వేల ఆహార పొట్లాలను పంపిణీ చేశామని, ఈ ఆదివారం నుండి 50 వేల ఆహార పొట్లాల పంపిణీకి అంతా సిద్దం చేశామని ఆయన తెలిపారు.

తిరుపతి పద్మావతి మహిళా కళాశాల లో ప్రత్యేక కరొనా ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేశామని, కరొనా పేషంట్ల చికిత్స కోసం అవసరమైన వెండిలేటర్లు, ఇతర వైద్య పరికరాలను స్విమ్స్ నుండి అందిస్తామని, స్విమ్స్ లో కూడా అవసరమైన వెండిలెటర్లు అందుబాటులో ఉంచామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఇప్పటికే టీటీడీ ఆధ్వర్యంలోని తిరచానూరు పద్మావతి నిలయాన్ని క్వారంటైన్ వార్డు కింద ప్రభుత్వానికి అందజేశారు. ఈమేరకు టీటీడీ, ప్రభుత్వ అధికారులు శనివారం ఏర్పాట్లను పరిశీలించారు.

అదే సమయంలో విశ్వ మానవ శ్రేయస్సు కోసం కరొనా వ్యాధిని అరికట్టేందుకు తిరుమల తిరుపతి ధర్మగిరి వేద విజ్నాన పీఠంలో ఈనెల 26 నుంచి నిర్వహించిన శ్రీ శ్రీనివాస శాంత్యోత్సవ సహిత ధన్వంతరి మహాయాగం శనివారం మహా పూర్ణాహుతి తో ఘనంగా ముగిసినట్టు టిటిడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. ఈ ఆపత్కాలంలో ప్రజలను ఆడుకొనేందుకు టీటీడీ రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాలా సహకారం అందిస్తామని ఆయన తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి