iDreamPost

జగన్‌ బాటలో కేసీఆర్‌.. మన బడికి భారీగా నిధులు

జగన్‌ బాటలో కేసీఆర్‌.. మన బడికి భారీగా నిధులు

మంచి ఎక్కడిదైనా తీసుకుని పాటించాలంటారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఇప్పుడు అదే చేశారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసేలా ఏపీలో విజయవంతమైన మన బడి, నాడు–నేడు, ఇంగ్లీష్‌ మీడియం విద్యను తెలంగాణలోనూ అమలు చేసేందుకు నిర్ణయించిన కేసీఆర్‌ సర్కార్‌.. ఆ దిశగా తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌లోనూ భారీగా నిధులు కేటాయించింది. ఏపీ తరహాలోనే ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకు తెలంగాణ సర్కార్‌ మన బడి – మన ఊరు, మన బస్తి – మన బడి పేర్లతో అమలు చేయబోయే కార్యక్రమానికి 7,289 కోట్ల రూపాయలను కేటాయించింది. ఈ నిధులతో ప్రభుత్వ విద్యాసంస్థల రూపురేఖలను పూర్తిగా మార్చివేయనున్నారు.

ఏపీలో దాదాపు 43 వేల ప్రభుత్వ పాఠశాలల్లో మన బడి నాడు-నేడు పేరుతో 9 రకాల మౌలిక వసతులను కల్పిస్తున్నారు. మూడుదశల్లో చేపట్టిన ఈ కార్యక్రమంలో మొదటిదశ పూర్తయింది. రెండోదశ పనులు జరుగుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్‌ స్కూళ్లను తలదన్నేలా రూపుదిద్దుకోవడంతో.. తెలంగాణ సర్కార్‌ దృష్టి ఈ కార్యక్రమంపై పడింది. వెంటనే ఉన్నతాధికారులతో కూడిన బృందాన్ని ఏపీకి పంపి మన బడి, నాడు-నేడు కార్యక్రమంపై అధ్యయనం చేయించిన కేసీఆర్‌.. తెలంగాణలోనూ అమలుచేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 2.56 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్‌ను సోమవారం ఆర్థికమంత్రి హరీష్‌రావు ప్రవేశపెట్టారు. ఈ మొత్తంలో మన బడి – మన ఊరు, మన బస్తి – మన బడి కార్యక్రమానికి 7,289 కోట్ల రూపాయలు కేటాయించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడమే కాదు.. వచ్చే ఏడాది నుంచి ఇంగ్లీష్‌ మీడియం కూడా అమలు చేయబోతున్నట్లు ఆర్థికమంత్రి హరీష్‌ రావు అసెంబ్లీలో ప్రకటించారు. ఈ నిర్ణయం వల్ల పేద, మధ్య తరగతి పిల్లలకు నాణ్యమైన విద్య అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ఏపీలో ఈ విధానం అమలు జరుగుతోంది. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియంను అమలు చేస్తున్నారు.

2014 ఎన్నికల్లో జగన్‌కు పరిపాలనా అనుభవం లేదంటూ టీడీపీ, ఆ పార్టీ అనుకూలమీడియా ప్రచారంచేసింది.విభజన తర్వాత రాజధాని కూడా లేని ఏపీని పాలించాలంటే అనుభవం ఉన్న చంద్రబాబు అయితే బాగుంటుందంటూ చెప్పుకొచ్చాయి. అయితే ప్రజలకు మంచి చేయడానికి, విప్లవాత్మకమైన సంస్కరణల ద్వారా ప్రభుత్వాన్ని ప్రజలవద్దకు తీసుకెళ్లడానికి పరిపాలన అనుభవం అవసరంలేదని, మంచి చేయాలనే తపన, ఆలోచన ఉంటే చాలని సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తొలి ఏడాదే నిరూపించారు. గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్‌ వ్యవస్థ, రైతు భరోసా కేంద్రాలు, ఇంటింటికి రేషన్‌ బియ్యం డెలివరీ, వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం.. ఇలానే అనేక సంస్కరణలు చేపట్టారు. ఇవి విజయవంతం అయి, మంచి ఫలితాలు ఇస్తుండడంతో పశ్చిమ బెంగాల్, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక సహా పలు రాష్ట్రాలు ఏపీలో అమలు అవుతున్న పథకాలు, కార్యక్రమాలను తమ తమ రాష్ట్రాలలోనూ అమలు చేసేందుకు అధ్యయనం చేశాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి