iDreamPost

థియేటర్ల ఓపెనింగ్ కి ఎన్ని గండాలో

థియేటర్ల ఓపెనింగ్ కి ఎన్ని గండాలో

సినిమా ప్రేమికుల ఎదురు చూపులు ఎంతకీ తీరడం లేదు. థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో అర్థం కావడం లేదు. లాక్ డౌన్ నిబంధనలు దాదాపు సడలించిన వేళ ఒక్క మాల్స్, సినిమా హాల్స్ కు మాత్రమే ఇంకా ఆంక్షలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లాంటి నగరాల్లో ఇప్పటికే సీట్ల కుదింపుని కొన్ని యాజమాన్యాలు చేపట్టాయి . అయితే అనుకున్నంత సులువుగా గేట్లు తెరుచుకునే ఛాన్స్ లేదంటున్నారు పరిశీలకులు. దానికి కారణం ఉంది. విడుదల కావాల్సిన సినిమాల క్యూలో దాదాపు అధిక శాతం ఎక్కువ బడ్జెట్ తో రూపొందినవి ఉన్నాయి. ఎంతలేదన్నా ఒక్కొక్కటి కనీసం 20 నుంచి 30 కోట్ల మధ్యలో బిజినెస్ జరగాల్సినవి.

ఇప్పుడు రూల్స్ పేరిట సగం సీట్లకు కోత వేస్తే వసూళ్ళ లెక్కలో చాలా తేడా వచ్చేస్తుంది. దీంతో ఇలా అయితే భారీ నష్టం తప్పదని నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్లు సైతం అభిప్రాయపడుతున్నారు. అలాంటప్పుడు థియేటర్లు తెరిచినా లాభం లేదని ఏ ఉద్దేశంతో ఓటిటికి అమ్మకుండా సహనంతో ఉన్నామో అది ఇలాంటి చర్యల వల్ల పూర్తిగా నీరుగారిపోతుందని ప్రొడ్యూసర్లు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి ప్రభుత్వాలు అనుమతి ఇచ్చినా ఫుల్ కెపాసిటీకి పర్మిషన్ ఉంటేనే తమ సినిమా డేట్లను ప్రకటించాలని కొందరు నిర్మాతలు డిసైడ్ అయినట్టుగా ఇన్ సైడ్ టాక్. ఇప్పుడు బాల్ కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది. మహారాష్ట్రలో కరోనా విశ్వరూపం చూస్తుంటే గైడ్ లైన్స్ లేకుండా దేశవ్యాప్తంగా థియేటర్లకు అనుమతి ఇచ్చే అవకాశం కనిపించడం లేదు.

ఎయిర్ పోర్ట్, రైల్వే స్టేషన్ లాగా థియేటర్ కు వచ్చే ప్రతి ప్రేక్షకుడి వివరాలు సేకరించడం జరగని పని. షోకు కేవలం పది నిమిషాల ముందు వచ్చే వాళ్ళు లక్షలు కొట్లలో ఉంటారు. వీళ్ళను లోపలికి వెళ్ళకుండా ఆపేసి డేటా తీసుకోవడం సాధ్యం కాదు. అలా అని ఆన్ లైన్లోనే అన్ని టికెట్లు అమ్ముదామా అంటే బిసి సెంటర్స్ లో మాస్ ఆడియన్స్ కి దాని మీద అవగాహన ఉండదు. కేవలం సినిమా కోసం కొత్తగా నేర్చుకునే ప్రయత్నం చేయరు. ఈ లెక్కన థియేటర్ల నిర్వాహకులకు ఇంకొంత గడ్డు కాలం తప్పేలా లేదు. డిజిటల్ సంస్థలు మాత్రం ఎప్పటికప్పుడు ఊరించే ఆఫర్లతో నిర్మాతలను సంప్రదిస్తునే ఉన్నాయి. ఇలాంటి సందిగ్ద స్థితి ఎవరూ ఊహించనిది కాబట్టి ఏ నిర్ణయామూ ఎవరూ చెప్పలేకపోతున్నారు. పెద్ద తెరపై సినిమా చూడాలనే మూవీ లవర్స్ కోరిక మాత్రం ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు .

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి