iDreamPost

మరేటి సేత్తాం.. ఇరుకున పడిపోనాం..

మరేటి సేత్తాం.. ఇరుకున పడిపోనాం..

అటెల్లేం… ఇటు రాలేం….

మరేటి సేత్తాం.. ఇరుకున పడిపోనాం

టీడీపీ నేతల అంతర్మథనం

అవును మరి వదలమంటే పాముకు కోపం.. కరవమంటే కప్పకు కోపం.. ముందుకెళ్తే నుయ్యి.. వెనక్కొస్తే గొయ్యి.. ఇలాగైపోయిందేంటిరయ్యా మన పరిస్థితి.. జగనేమో… ఇశాపట్నంలో రాజధాని పెట్టాలంతాడు..మన నాయకుడు చంద్రబాబేమో అన్నీ అమరావతిలోనే పెట్టాలంతాడు..మన పక్కన రాజధాని వస్తే మనకు లాభం కదా.. పొద్దున్న పది రూపాయల పాసింజర్ టిక్కెట్ కొనీసి ఇశాపట్నం ఎల్లి అధికారులను కలిసీసి మళ్ళా బీచ్ రోడ్లో పది రూపాయల మొక్కజొన్న పొత్తో, జాంకాయో కొనుక్కుని బస్సెక్కితే అవి తినీసే లోపే మళ్ళా మన ఇజీనారం వచ్చెత్తాం కదా.. ఇది మనకు మన కుర్రోళ్లకు మంచిదే కదా… ఇంకా కొన్ని ఐటీ కంపెనీలు గట్రా వస్తే కొత్త ఉజ్జోగాలు వత్తాయి కదా.. మరి మనం ఈ ఇశాఖ రాజధానికి జై కొడితే బాగుణ్ణు కానీ చంద్రబాబు వద్దంతున్నాడు.. ఏటి సేద్దుమురా దేవుడా… ! అటెల్లేం.. ఇటు రాలేం.. అని విజయనగరం, సిక్కోలు టీడీపీ నేతలు మథన పడుతున్నారు..మనసులో ఇటువైపు మొగ్గున్నా… అధినేత నిర్ణయానికి ఎదురీదలేని దుస్థితి..

ఈ మేరకు ఇటీవల టీడీపీ నాయకులు ఎమ్మెల్సీలు గుమ్మడి సంధ్యారాణి, డి. జగదీశ్, పార్టీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు ఎం.చిన్నంనాయుడు తదితరులు ప్రెస్ మీట్ పెట్టి మరీ ఈ విశాఖ రాజధాని అణా విషయాన్ని ఖండించారు. ఇంకా అశోక్ గణపతి రాజు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశారు. విశాఖలో అయితే జగన్ నిర్ణయానికి టీడీపీ నుండి సంపూర్ణ మద్దతు లభించింది.. టీడీపీ నుండి ఎంపీగా పోటీచేసిన గీతం అధినేత శ్రీ భరత్ తో బాటు గెలిచిన ఎమ్మెల్యే గంటా,గణబాబు తదితరులంతా విశాఖ రాజధానికి జైకొట్టారు. ఇది అభివృద్ధికి దిక్చూచి అవుతుందన్నారు.

అయితే విజయనగరం శ్రీకాకుళంలో మాత్రం నాయకుల మనసుల్లో ఎలా ఉన్నా బయటకు మాత్రం కక్కలేక మింగలేక అన్నట్లుగా ఉంటున్నారు. అచ్చెన్నాయుడు,ఎంపీ రామ్మోహన్ నాయుడు సైతం కిమ్మనలేని పరిస్థితి ఉంది.అలాగని చంద్రబాబు నిర్ణయాన్ని గట్టిగా సమర్ధించి విశాఖను కాదందామంటే హత్తెరికి తొత్తికొడకా.. మన పక్కనే రాజధాని వస్తే కాదంటారా.. ఈపాలి మీకు చురకలు వేస్తాం అని జనం ఎక్కడ తిడతారోనని బయటకు చెప్పుకోలేకపోతున్నారు. కానీ ప్రైవేటుగా మాట్లాడినప్పుడు మాత్రం ‘మన దగ్గిర్లో రాజధాని వస్తే బాగుంటాది కదా గురూ..!! అమరావతితో మనకేటి సంబంధం.. మన దగ్గిర్లోని ఊరు, మన ఇశాపట్నం రాష్ట్రానికి రాజధాని అయితే మనకు బాగోదేటి.. అయినాగానీ మా పార్టీ మాత్రం అమరావతే… అమరావతే అంతన్నారు.. మీము మరేటి సేయలేక పల్లకున్నాం.. వత్తాను… మళ్ళీ కలుద్దాం.. అంటూ మెల్లగా జారుకుంటున్నారు..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి