iDreamPost

చంద్రబాబు ముందు జాగ్రత్త

చంద్రబాబు ముందు జాగ్రత్త

ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఘంటికలు మోగుతున్నాయి. చైనాలో పుట్టిన కరోనా మహ్మమరి ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 150 దేశాలకు పాకింది. యూరప్, పశ్చిమ ఆసియా, ఉత్తర అమెరికా దేశాల కన్నా మన దేశంలో దీని ప్రభావం తక్కువగా ఉందని చెప్పవచ్చు. ఇప్పటి వరకు మన దేశంలో 135 మందికి కరోనా సోకగా… ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో అయితే ఇప్పటి వరకు ఒక పాజిటివ్‌ కేసు మాత్రమే నమోదైంది. నెల్లూరు నగర యువకుడు ఆ మహమ్మరి నుంచి బయటపడ్డారు.

ప్రభావం పెద్దగా లేకున్నా ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. టీడీపీ కార్యాలయంలో థర్మల్‌ స్క్రీనింగ్‌ ఏర్పాటు చేశారు. కార్యాలయంలోకి ప్రవేశించే ప్రతి ఒక్కరిని స్కీనింగ్‌ చేసిన తర్వాత లోపలికి అనుమతిస్తున్నారు. ఈ రోజు నుంచి థర్మల్‌ స్క్రినింగ్‌ చంద్రబాబుతో ప్రారంభమైంది. థర్మల్‌ స్క్రీనింగ్‌ చేసుకుంచున్న తర్వాత చంద్రబాబు కార్యాలయంలోకి వెళ్లారు.

కరోనా ప్రభావంతో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని ప్రతిపక్ష పార్టీలు స్వాగతించగా.. అధికార పార్టీ అగ్గిమీద గుగ్గిలం అయింది. కరోనా వైరస్‌ కాదు.. కమ్మ వైరస్‌ వల్ల ఎన్నికలు వాయిదా పడ్డాయని ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఎస్‌ఈసీ చంద్రబాబుకు తొత్తుగా వ్యవహరించారంటూ అధికార పార్టీ మంత్రులు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కరోనా ప్రభావం లేకపోయినా.. ఎన్నికలను వాయిదా వేశారని మండిపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ కార్యాలయంలో థర్మల్‌ స్క్రీనింగ్‌ ఏర్పాటు చేయడం, చంద్రబాబు స్క్రీనింగ్‌ చేయించుకోవడం గమనార్హం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి