iDreamPost

విదేశాల్లో మొదలైన థియేటర్ల సందడి

విదేశాల్లో మొదలైన థియేటర్ల సందడి

కరోనా వైరస్ ఇండియాలో ఇంకా అదుపులోకి రాని కారణంగా సినిమా థియేటర్లను తెరిచే విషయంలో ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాయి. కఠిన నిబంధనలతో పరిమిత సీటింగ్ తో ఓపెన్ చేయించాలనే ప్రతిపాదన ఉన్నప్పటికీ సింగల్ స్క్రీన్ ఓనర్ల నుంచి విముఖత వ్యక్తమవుతోంది. ఇప్పటికే నష్టాల్లో ఉంటే మళ్ళీ సీటింగ్ మార్చుకుని శానిటైజేషన్ కోసం అదనపు భారాన్ని భరించేందుకు సిద్ధంగా లేమని చెబుతున్నారట. మల్టీ ప్లెక్సులు మాత్రం అన్ని కండీషన్లకు సై అంటున్నాయి. నిర్వహణ భారంగా మారడంతో అధిక శాతం సంస్థలు జీతాలు చెల్లించేందుకు సిద్ధంగా లేవు.

ఇదంతా సద్దుమణగడానికి ఆగస్ట్ అవుతుందా లేక దసరా దాకా వెళ్తుందా అనేది ఎవరూ చెప్పలేరు కాని మొత్తానికైతే పరిస్థితి తీవ్రంగానే ఉంది. ఇదిలా ఉండగా దుబాయ్ లో ఇటీవలే అక్షయ్ కుమార్ గుడ్ న్యూజ్ ని రీ రిలీజ్ చేస్తూ సినిమా హాళ్ళను తెరిచిన సంగాతి తెలిసిందే. ఇప్పుడు జర్మన్, ఫ్రాన్స్ కూడా అదే దారిలో ఉన్నాయి. తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన బిగిల్(తెలుగు విజిల్)ని జర్మనీలో జూన్ 22 నుంచి, ఫ్రాన్స్ లో జూన్ 30 నుంచి పునఃవిడుదల చేయబోతున్నారు. దీనికి సంబంధించిన స్క్రీన్లు, టైమింగ్స్ తో కూడిన షెడ్యూల్ ని అక్కడి డిస్ట్రిబ్యూటర్లు విడుదల చేశారు. గవర్నమెంట్ ప్రతిపాదించిన అన్ని గైడ్ లైన్స్ ని ఫాలో అవుతూ టికెట్లు అమ్ముతున్నారు.

ఇప్పుడు ఇండియాలోనూ ఇదే తరహా ఫార్ములాని ఫాలో కావడం బెటర్. సంక్రాంతికి వచ్చిన సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో, భీష్మ లాంటి సినిమాలను తాత్కాలికంగా ప్రదర్శన చేసి అంతా నార్మల్ అయ్యాక తిరిగి కొత్త వాటిని ప్లాన్ చేసుకోవచ్చు. ఇందులో కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇలా రిస్క్ చేయడం మినహా వేరే మార్గం లేదు. ఇప్పటిదాకా టాలీవుడ్ నుంచి ఒకరిద్దరు నిర్మాతలు తప్ప ఓటిటి వైపు ఎవరూ పెద్దగా వెళ్ళలేదు. త్వరలోనే అంతా సద్దుమణుగుతుందనే నమ్మకంతో ఉన్నారు. పెట్టుబడుల మీద వడ్డీ భారం ఇబ్బంది పెడుతున్నా ఏదోలా నెట్టుకొస్తున్నారు. షూటింగులకు అనుమతులు వచ్చినా ఇప్పటికీ ఏ అగ్ర నిర్మాణ సంస్థ ప్రొడక్షన్ మొదలుపెట్టలేదు. ఎన్నో బదులు తెలియని ప్రశ్నలు ఇండస్ట్రీని వేధిస్తున్నాయి. మూవీ లవర్స్ ఎదురుచూపులు ఎన్నటికి తీరేనో.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి