iDreamPost

ఆ ఇద్దరికీ దక్కిన అదృష్టం – Nostalgia

ఆ ఇద్దరికీ దక్కిన అదృష్టం – Nostalgia

ఆల్ ఇండియా మెగాస్టార్ గా పిలివబడే బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో కలిసి నటించే అవకాశం లేదా దర్శకత్వం వహించే ఛాన్స్ కన్నా ఎవరైనా కోరుకునేది ఏముంటుంది. అందుకే తన ముప్పై ఏళ్ళ సినిమా కెరీర్ తర్వాత చిరంజీవి ఏరికోరి మరీ సైరా రూపంలో ఆ ముచ్ఛట తీర్చుకున్నారు. నాగార్జునకు ఖుదాగవా రూపంలో తీరింది కానీ బాలకృష్ణ, వెంకటేష్ లకు మాత్రం ఇంకా ఆ ఛాన్స్ దక్కలేదు. నటి సౌందర్యకు ఆ అదృష్టం 1999లో దొరికింది. అమితాబ్ హీరోగా సూర్యవంశం రీమేక్ గా రూపొందిన సినిమాలో ఆవిడ కొడుకు పాత్రకు జోడిగా నటించారు. మరో విశేషం ఏంటంటే ఈవివి సత్యనారాయణ గారు దీనికి దర్శకత్వం వహించడం.

తెలుగు దర్శకులతో అమితాబ్ 80వ దశకంలోనే చిత్రాలు చేశారు కానీ ఈవివి హయాంలో మాత్రం ఎవరికీ ఆ భాగ్యం కలగలేదు. అప్పటికే సూర్యవంశం తమిళ్, తెలుగులో పెద్ద బ్లాక్ బస్టర్. విక్టరీ వెంకటేష్ ని కొత్త యాంగిల్ లో చూపించిన తీరు వసూళ్ల వర్షం కురిపించింది. అందుకే సౌత్ డైరెక్టర్ దీన్ని సరిగ్గా డీల్ చేయగలరని గుర్తించిన నిర్మాతలు ఆ బాధ్యతను ఈవివికి ఇచ్చారు. రీమేక్స్ చేయడం అంతగా ఇష్టపడని ఈవివి ఇది అమితాబ్ ఆఫర్ కావడంతో ఛాలెంజ్ గా తీసుకున్నారు. ఇది తెలుగు యాక్టర్స్ కు మంచి జ్ఞాపకంగా మిగిలిపోవాలని పెద్ద బచ్చన్ కు జోడిగా జయసుధ గారిని ఎంపిక చేసుకుని కొన్ని సపోర్టింగ్ రోల్స్ కు బ్రహ్మానందం, ఆహుతి ప్రసాద్, కళ్ళు చిదంబరంలకు భాగం కల్పించి ఈ మెగా ప్రాజెక్ట్ లో భాగం చేశారు.

ఒరిజినల్ వెర్షన్ లోని ఫీల్ ని తగ్గించకుండా సూర్యవంశంను చక్కగా తెరకెక్కించారు. ఫలితం సూపర్ హిట్. భారీ వసూళ్లు దక్కాయి. అప్పటిదాకా కొన్నేళ్ల నుంచి యావరేజ్ సినిమాల తో నెట్టుకొస్తున్న అమితాబ్ బచ్చన్ కు చాలా గ్యాప్ తర్వాత ఘన విజయం సొంతమైంది. మరో విశేషం ఏంటంటే ఈ సూర్యవంశం చాలా ఏళ్ళు టీవీ రేటింగ్స్ లో టాప్ లో నిలిచింది. ఇప్పటికీ టెలికాస్ట్ అయిన ప్రతిసారి ఇతర కార్యక్రమాలకు గట్టి పోటీ ఇస్తూనే ఉంటుంది. అంతగా సూర్యవంశంని ఈవివి గారు మెప్పించేలా తీయగలిగారు. ఆ తర్వాత కొంతకాలానికి సౌందర్య, ఆపై ఈవివి సత్యనారాయణ గారు స్వర్గస్థులు కావడం సినిమా ప్రేమికులను తీవ్రంగా కలవరపరిచిన అంశం. అందుకే ఈ లోకంలో లేకపోయినా వాళ్ళిద్దరికీ సూర్యవంశం ఒక బెస్ట్ ఎక్స్ పీరియన్స్ గా నిలిచిపోయింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి