రెయిన్ అలర్ట్.. ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

తుఫాన్ ప్రభావంతో వర్షాలు కురువనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. ఏపీ, తెలంగాణలో ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురువనున్నట్లు హెచ్చరిస్తున్నారు.

తుఫాన్ ప్రభావంతో వర్షాలు కురువనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. ఏపీ, తెలంగాణలో ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురువనున్నట్లు హెచ్చరిస్తున్నారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫానుగా మారినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే వాయుగుండం ఎఫెక్ట్ తో ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. వానాకాలంలో మాదిరిగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో ఏపీ మొత్తం అతలాకుతలం అవుతోంది. ఇక ఇప్పుడు తుఫాన్ మరింత భయపెడుతున్నది. తుఫాన్ ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. వర్షాల ధాటికి ఆకస్మిక వరదలు సంభవించే ఛాన్స్ ఉన్నట్లు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

కాగా తుఫాన్ పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ శనివారం మధ్యాహ్నానికి కారైకాల్‌ (పుదుచ్చేరి), మహాబలిపురం (తమిళనాడు) మధ్యలో తీరం దాటే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. తీరం దాటే సమయంలో 90 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా ఏపీలోని చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్‌, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ఈ జిల్లాల్లో ఆకస్మికంగా వరదలు వచ్చే ప్రమాదం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. మత్య్సకారులు వేటకు వెళ్లకూడదని హెచ్చరిస్తున్నారు.

వర్షాల నేపథ్యంలో కృష్ణపట్నం పోర్టుకు మూడో నంబర్, మచిలీపట్నం, నిజాంపట్నం, విశాఖపట్నం, కాకినాడ, గంగవరం పోర్టులకు రెండో నంబర్ హెచ్చరికలు జారీ చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. తుఫాన్ ఎఫెక్ట్ తో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వర్షాల వల్ల ఎలాంటి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. తెలంగాణపై కూడా తుఫాన్ ప్రభావం ఉండనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో మూడ్రోజులపాటు వర్షాలు కురుస్తాయని తెలిపింది.

నేటి నుంచి సోమవారం వరకు రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయన్నారు. నేడు ములుగు, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, భద్రాద్రి, ఖమ్మం, హనుమకొండ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయన్నారు. ఆది, సోమవారాల్లో కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, మహబూబాబాద్, వరంగల్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్‌ మల్కాజిగిరి, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఈ జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.

Show comments