కొత్త చీఫ్‌ సెలెక్టర్‌గా అగార్కర్‌! ఇతను సాధించిన రికార్డులేంటి?

చేతన్‌ శర్మ రాజీనామా తర్వాత బీసీసీఐ కొత్త సెలెక్టర్‌ను నియమించింది. ఈ పోస్టు కోసం చాలా మంది దరఖాస్తు చేసుకున్నా.. చివరికి టీమిండియా మాజీ క్రికెటర్‌ అజిత్‌ అగార్కర్‌ను టీమిండియా కొత్త సెలెక్టర్‌గా అపాయింట్‌ చేసింది. అగార్కర్ రాకతో టీమిండియాలో భారీ మార్పులు జరిగి, జట్టు గాడిలో పడే అవకాశం ఉందని క్రికెటర్‌ అభిమానులు అంచనాలు పెట్టుకుంటున్నారు. అయితే టీమిండియా సెలెక్టర్‌ పని కత్తి మీద సాము లాంటిదే. మరి ఇలాంటి క్రిటికల్‌ జాబ్‌ను అగార్కర్‌ సమర్థవంతంగా నిర్వర్తిస్తాడా? లేదా అనే అనుమానులు కూడా కొందరిలో ఉన్నాయి.

అలాగే చాలా మంది ఈ పోస్టు కోసం దరఖాస్తు చేసుకున్నా.. అగార్కర్‌నే ఎందుకు చీఫ్‌ సెలెక్టర్‌గా ఎంపిక చేశారనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ఇలాంటి వారు అగార్కర్‌ గురించి తప్పక తెలుసుకోవాలి. అతను టీమిండియా కోసం ఏం చేశాడు? ఎలాంటి అద్భుతమైన రికార్డులు సాధించాడు? అసలు అతను ఎలాంటి ఆటగాడో తెలుసుకుంటే.. వారి ప్రశ్నలకు సమాధానం దొరికినట్లే. 1998 నుంచి 2007 వరకు టీమిండియా తరఫున ఆడిన అగార్కర్‌ ప్రపంచ క్రికెట్‌పై తనదైన ముద్ర వేశాడు. జవగళ్‌ శ్రీనాథ్‌కు మంచి జోడీగా ఉంటూనే.. వెంకటేశ్‌ ప్రసాద్‌, ఆశిష్‌ నెహ్రా, జహీర్‌ ఖాన్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌ లాంటి బౌలర్లతో పోటీ పడి మరీ సుదీర్ఘకాలం కెరీర్‌ను కొనసాగించాడు.

జట్టులో కేవలం ఒక బౌలర్‌గా మాత్రమే కాకుండా అప్పుడప్పుడు ఆల్‌ రౌండర్‌గా తన సత్తా చాటాడు. భారత క్రికెట్‌ చరిత్రలో అత్యుత్తమ పేసర్లలో అజిత్‌ అగార్కర్‌ కూడా ఒకడు. మూడు ఫార్మాట్లలో కలిపి 200పైగా మ్యాచ్‌లు ఆడాడు. 1999, 2003, 2007 వన్డే వరల్డ్‌ కప్పుల్లో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు. అలాగే భారత్‌ సాధించిన తొలి టీ20 వరల్డ్‌ కప్‌ జట్టులోనూ అగార్కర్ సభ్యుడు. వన్డేల్లో అత్యధిక వికెట్లు(288) తీసిన మూడో బౌలర్‌గా అగార్కర్‌ నిలిచాడు. టీమిండియా తరఫున వన్డేల్లో ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ(21 బంతుల్లో) చేసిన ప్లేయర్‌గా అతనే. ఇప్పటికీ ఆ రికార్డు బద్ధలుకాలేదు. సచిన్‌, కోహ్లీ, యువరాజ్‌, రోహిత్‌ లాంటి హేమాహేమీ బ్యాటర్లు కూడా అగార్కర్‌ రికార్డును కొట్టలేకపోయారు. కేవలం 23 మ్యాచుల్లోనే 50 వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా కూడా అగార్కర్‌ అప్పట్లో రికార్డు సృష్టించాడు. ఆ రికార్డు దాదాపు పదేళ్ల పాటు పదిలంగా నిలిచింది. వన్డేల్లో 1000 పరుగులతో పాటు 100 వికెట్ల ఉన్న అతి కొద్ది మంది ఆటగాళ్లలో అగార్కర్‌ ఒకడు.

1998లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో ఎంట్రీ ఇచ్చిన అగార్కర్‌. తన కెరీర్‌లో మొత్తం 191 వన్డేలు, 26 టెస్టులు, 4 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. అలాగే 110 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు, 270 లిస్ట్‌ ఏ మ్యాచ్‌లు సైతం ఆడాడు. టెస్టుల్లో 58 వికెట్లు, 571 పరుగులు, వన్డేల్లో 288 వికెట్లు, 1269 పరుగులు సాధించాడు. ఐపీఎల్‌లోను అగార్కర్‌ తన సత్తా చాటాడు. డిల్లీ, ​కోల్‌కత్తా తరఫున బరిలోకి దిగి మంచి ప్రదర్శన కనబర్చాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత ముంబై చీఫ్‌ సెలెక్టర్‌గా, వ్యాఖ్యాతగా చేసిన అగార్కర్‌.. ఇప్పుడు టీమిండియా చీఫ్‌ సెలెక్టర్‌గా ఎంపికయ్యాడు. మరి ఈ బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించేందుకు అతనికున్న అనుభవం ఎంతో పనికొస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అగార్కర్‌ కెరీర్‌, రికార్డులు, చీఫ్‌ సెలెక్టర్‌గా ఎంపిక చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజే​యండి.

Show comments