iDreamPost
android-app
ios-app

Shyam Singha Roy Review : శ్యామ్ సింగ రాయ్ రివ్యూ

  • Published Dec 24, 2021 | 8:49 AM Updated Updated Dec 24, 2021 | 8:49 AM
Shyam Singha Roy Review : శ్యామ్ సింగ రాయ్ రివ్యూ

గత రెండు సినిమాలు వి, టక్ జగదీష్ లు నేరుగా ఓటిటి రిలీజ్ ఇవ్వడం వల్ల అభిమానులతో పాటు తానూ బాధ పడిన న్యాచురల్ స్టార్ నాని కొత్త చిత్రం శ్యామ్ సింగ రాయ్ ఇవాళ భారీ అంచనాల మధ్య థియేటర్లలో అడుగు పెట్టింది. తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా ఫ్యాన్స్ కి దీని మీద ముందు నుంచి నమ్మకం ఉంది. ఉప్పెన భామ కృతి శెట్టి రెండో మూవీ కావడం, సాయి పల్లవి స్క్రీన్ ప్రెజెన్స్, కోల్కతా బ్యాక్ డ్రాప్, వీటన్నింటిని మించి నాని డ్యూయల్ రోల్ ఆసక్తిని పెంచేశాయి. టాక్సి వాలా ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించిన ఈ పీరియాడిక్ సోషల్ డ్రామాకు మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. ఎలా ఉందో రివ్యూలో చూద్దాం

కథ

షార్టు ఫిలిమ్స్ తీసే వాసు(నాని)కి దర్శకుడు కావాలని లక్ష్యం. డెమో కోసం తీసిన షూట్ తో కీర్తి(కృతి శెట్టి)పరిచయమై అది కాస్తా ప్రేమగా మారుతుంది. కోరుకున్నట్టే వాసుకి పేరొచ్చి మొదటి సినిమా ఆఫర్ వస్తుంది. రిలీజై పెద్ద హిట్టయ్యాక ఆ దానికి రాసుకున్న కథ కాపీదని కోల్కతా పోలీసులు ఇతన్ని అరెస్ట్ చేస్తారు. తర్వాత వాసుకి గత జన్మలో శ్యామ్ సింగ రాయ్(నాని)తాలూకు జ్ఞాపకాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తాయి.1969లో దేవదాసి వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన అతని గతం మొత్తం గుర్తుకు వస్తుంది. ఈ క్రమంలోనే రోసీ(సాయిపల్లవి) గురించి తెలుస్తుంది. మరి వాసుకి శ్యాం కి కనెక్షన్ ఏంటో తెలియాలంటే తెరమీదే చూడాలి

నటీనటులు

పేరుకు ద్విపాత్రాభినయం అయినప్పటికీ నానికి పెర్ఫార్మన్స్ పరంగా ఛాలెంజ్ దక్కింది మాత్రం సెకండ్ హాఫ్ లో వచ్చే శ్యామ్ సింగ రాయ్ పాత్రతోనే. చాలా బ్యాలన్స్ గా క్యారెక్టర్ డిమాండ్ మేరకు మంచి నటనతో ఆకట్టుకున్నాడు. బెంగాలీ యాక్సెంట్ ని ఒడిసిపట్టుకున్న తీరు కూడా బాగానే వచ్చింది. ఫస్ట్ హాఫ్ లో వచ్చే సినిమా దర్శకుడి పాత్ర కొత్తేమి కాదు కాబట్టి దాని గురించి ప్రత్యేకంగా చెప్పడానికి ఏమి లేదు. సాయిపల్లవి మరోసారి తాను ఏ సినిమాకైనా ఎంత పెద్ద అడ్వాంటేజో మరోసారి ఋజువు చేసింది. దేవదాసిగా ఇటు ఎక్స్ ప్రెషన్లు అటు డాన్స్ రెండూ మెచ్యూర్డ్ గా వచ్చాయి. నానికి మరోసారి మంచి జోడి అనిపించింది.

ఉప్పెన సెన్సేషన్ కృతి శెట్టి చెప్పుకోవడానికే గుర్తు పెట్టుకోవడానికి ఇందులో ఏమి లేదు. రెండు మూడు సీన్లలో నటించింది కానీ తర్వాత మొక్కుబడిగా మారిపోయింది. నానితో లిప్ లాక్ కి ఒప్పుకోవడం విశేషమే. మడోన్నా సెబాస్టియన్ లాయర్ గా కనిపించేది కాసేపే అయినా కృతి కన్నా బెటర్ గా గుర్తుండిపోతుంది. రాహుల్ రవీంద్రన్ పర్వాలేదు. మురళి శర్మది ఒక టైపు గెస్ట్ అప్పీయరెన్స్ లాంటిది. జిస్సు సేన్ గుప్తా వృధా అయ్యాడు. యాక్టింగ్ పరంగానూ మెరుపులు లేవు. కేవలం మెయిన్ ట్విస్టుకి పనికొచ్చాడు. అభినవ్ తదితరులు జస్ట్ ఓకే. కోల్కతా ఎపిసోడ్ లో ఇంకా ఆర్టిస్టులు ఉన్నారు కానీ అన్నీ కొత్త మొహాలే.

డైరెక్టర్ అండ్ టీమ్

పునర్జన్మల కాన్సెప్ట్ తో తెలుగులో ఎన్ని సినిమాలు వచ్చాయో లెక్కబెట్టడం ఒక్క రోజులో అయ్యే పని కాదు. మూగమనసులు నుంచి మగధీర దాకా కౌంట్ లెస్ అని చెప్పొచ్చు. కొన్ని ల్యాండ్ మార్క్ అయ్యాయి. కొన్ని తేడా కొట్టి కాలగర్భంలో కలిసిపోయాయి. ఒకరకంగా ఈ ఫార్ములా చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సి ఉంటుంది. లాజిక్స్ కి అవకాశం ఉండదు కాబట్టి మేజిక్ తో మేనేజ్ చేయాలి. అందుకే చేతివేళ్ళు తాకితే నాలుగు వందల ఏళ్ళు వెనక్కు వెళ్లడమనే సిల్లీ పాయింట్ గురించి రాజమౌళిని ఎవరూ ప్రశ్నించలేదు. డ్రామా తాలూకు ఇంపాక్ట్ అలాంటిది. దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ కూడా ఆ నమ్మకంతోనే ఈ కథను రాసుకున్నాడు.

రెండు జన్మలు. రెండు హీరో డ్యూయల్ రోల్ పాత్రలు. ఒకటి నార్మల్. మరొకటి సూపర్ పవర్ ఫుల్. ఈ లైన్ మీద శ్యామ్ సింగ రాయ్ నడుస్తుంది. అయితే ఫ్లాష్ బ్యాక్ ని ఎగ్జైటింగ్ గా రాసుకున్న రాహుల్ ఫస్ట్ హాఫ్ నెరేషన్ ని లైట్ తీసుకోవడం ఇంటర్వెల్ దాకా పెద్దగా ప్రభావం చూపకుండా అడ్డుపడింది. వాసు కీర్తిల మధ్య లవ్ ట్రాక్ లో ఫ్రెష్ నెస్ ఉండదు. ఏదో అలా టైం పాస్ చేయిస్తూ సాగుతుంది అంతే. మన దృష్టి శ్యామ్ సింగ రాయ్ ఎప్పుడు వస్తాడా అనే దాని మీద ఉంటుంది కాబట్టి దీని మీద సీరియస్ గా వర్క్ చేయనవవసరం లేదనుకున్నారో ఏమో గంట పాటు సహనానికి పరీక్ష జరుగుతూ ఉంటుంది. అలా అని మరీ బ్యాడ్ కాదు

నాని మొదటి సగాన్ని ఎక్కడిక్కడ కాపాడుకుంటూ వచ్చాడు కానీ వీక్ రైటింగ్ పంటి కింద రాయిగా మారింది. యూత్ ని ఇదంతా కొంత మేర ఆకట్టుకోవచ్చు కానీ నాని సినిమా నుంచి ఎంతో ఆశించే ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ వ్యవహారం అంతగా కనెక్ట్ కాదు. ఇదిలా ఉంచితే సెకండ్ హాఫ్ ప్రాణంగా నడిచిన శ్యామ్ సింగ్ రాయ్ లో సాయిపల్లవి ట్రాక్ కూడా నెమ్మదిగా సాగుతుంది. దేవదాసిలను అనుభవించే పూజారిని శ్యామ్ అందరి ముందు సింహాద్రి రేంజ్ లో హత్య చేసే దాకా కథనం నత్తనడక సాగుతుంది. నవరాత్రుల పేరుతో తొమ్మిది సన్నివేశాలను డాన్స్ సహాయంతో సెట్ చేసుకున్నారు కానీ దానికి తగినంత టెంపో లేక చప్పగానే అనిపిస్తుంది.

ఈ దేవదాసి వ్యవహారం ఇప్పటి జెనరేషన్ కు తెలియదు కాబట్టి ఈ బ్యాక్ డ్రాప్ లో ఫ్లాష్ బ్యాక్ ని సెట్ చేసుకోవడం మంచి ఆలోచన. ఎంత సీరియస్ గా చెప్పాలనుకున్నా కూడా కమర్షియల్ ఫ్లేవర్ ఏ సినిమాకైనా చాలా అవసరం. హై అనిపించే మూమెంట్స్ ఉండాలి. ఇవి సినిమా మొత్తం రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో రాకపోవడంతో ఎక్కడిక్కడ ఇంటెన్సిటీ తగ్గుతూ పోయింది. ఒక మాములు వ్యక్తిని శక్తివంతుడుగా మార్చే క్రమాన్ని లైట్ తీసుకుంటే దాని తాలూకు రీచ్ తగ్గిపోతుంది. మణిరత్నం నాయకుడులో కమల్ హాసన్ ని ప్రాపర్ గా ఎస్టాబ్లిష్ చేశారు కాబట్టే అది మాస్టర్ పీస్ గా నిలిచిపోయింది. దాన్ని స్ఫూర్తిగా తీసుకున్నా అద్భుతాలు చేయొచ్చు.

రాహుల్ సంకృత్యాన్ లో మంచి టెక్నీషియన్ ఉన్నారు. అందులో సందేహం లేదు. కోల్కతా ఎపిసోడ్ ని ఊహించుకున్న తీరు, తెరకెక్కించిన విధానం ఆకట్టుకుంది. కానీ ఇలాంటి ఎమోషనల్ రీ ఇంకార్నేషన్ డ్రామాలు పండాలంటే తగినన్ని మలుపులు ఎన్నో అవసరం. సందర్భాన్ని బట్టి అదనపు పాత్రల సహాయం తీసుకోవాలి. కానీ కేవలం శ్యాం రోసిల మీద ట్రాక్ నడిపించి అసలు విలనే లేకుండా స్టోరీ నడిపించడంతో ఇంకో కాన్ఫ్లిక్ట్ లేకుండా పోయి ఒకదశ దాటాక శ్యామ్ నిస్సహాయుడిగా మారాడు. ఇవన్నీ మైనస్సులు అని చెప్పడం కాదు ఉద్దేశం. గొప్ప కథగా ముందు ముందు చెప్పుకునే క్లాసిక్ గా నిలిచే అవకాశాన్ని శ్యామ్ పూర్తిగా వాడుకోలేదు

ఇవన్నీ పక్కనపెడితే టాక్సీ వాలా కంటే బెటర్ ప్రోడక్ట్ ఇవ్వడానికి ట్రై చేసిన రాహుల్ అందులో సగం విజయం సాధించాడు. చిన్న చిన్న లాజిక్స్ ని మిస్ అయినప్పటికీ అతని ఉన్నతమైన సాంకేతిక ఆలోచనలు ఒక వర్గం ప్రేక్షకులను శ్యామ్ సింగ రాయ్ ని మెచ్చుకునేలా చేయొచ్చు. అలా అని యునానిమస్ గా ఇది సూపర్ మూవీ అనిపించుకునే అవకాశాన్ని తగ్గించుకుంది. వి, టక్ జగదీష్ లతో పాటు గత కొన్నేళ్లలో వచ్చిన నాని సినిమాలతో పోలిస్తే శ్యామ్ సింగ రాయ్ బెటర్ అనిపించడంలో ఆశ్చర్యం లేదు. అసలు పునర్జన్మలు లేకుండా స్ట్రెయిట్ గా కోల్కతా బ్యాక్ డ్రాప్లో కంప్లీట్ శ్యామ్ సింగ రాయ్ ని చూపించినా ఇంకో లెవెల్ లో ఉండేదేమో

మిక్కీ జె మేయర్ పాటలు బ్యాక్ నేపధ్య సంగీతం పర్వాలేదు. కాకపోతే ఇలాంటి ఎలివేషన్లు ఉన్న సబ్జెక్టుకి తమన్ లాంటి వాళ్లయితేనే బెటర్ అనే అభిప్రాయం కలుగుతుంది. అఖండ టైంలో ఇతని గురించి ఎంతగా మాట్లాడుకున్నారో మర్చిపోకూడదు. సను జాన్ వర్గీస్ ఛాయాగ్రహణం మాత్రం నూటికి నూరు మార్కులు తెచ్చేసుకుంది. నవీన్ నూలి ఎడిటింగ్ కొద్దిగా నిడివిని తగ్గించి ఉంటే బాగుండేది. యాక్షన్ కొరియోగ్రఫీ బాగుంది. ఆర్ట్ వర్క్ ని ప్రత్యేకంగా మెచ్చుకోవాలి. సహజత్వాన్ని తీసుకొచ్చారు. డైలాగులు అక్కడక్కడా మెప్పించాయి. నిహారిక ఎంటర్ టైన్మెంట్స్ నిర్మాణ విలువల్లో రాజీ కనిపించలేదు.

ప్లస్ గా అనిపించేవి

శ్యామ్ సింగ రాయ్ గా నాని
సాయిపల్లవి పాత్ర
కోల్కోత ఫైట్ ఎపిసోడ్
ఛాయాగ్రహణం

మైనస్ గా తోచేవి

నెమ్మదిగా నడిచే లవ్ ట్రాక్స్
పరిమిత ఎలివేషన్లు
మలుపులు తగ్గడం

కంక్లూజన్

చాలా గ్యాప్ తర్వాత న్యాచురల్ స్టార్ నానిని తను రెగ్యులర్ గా చేసే పాత్రల స్వభావానికి భిన్నంగా శ్యామ్ సింగ రాయ్ లో చూడటం కొత్త అనుభూతినిస్తుంది. అంచనాల మాట ఎలా ఉన్నా తనవరకు అభిమానులు పూర్తిగా సంతృప్తిపడే సినిమాను ఇచ్చాడు. సగటు ప్రేక్షకుడికి మాత్రం ఆ స్థాయి ఫీలింగ్ రాకపోవడానికి పైన చెప్పిన కొన్ని కారణాలు దోహదపడ్డాయి. వాటిని పక్కనపెట్టేసి చూస్తే శ్యామ్ సింగ రాయ్ పూర్తిగా నిరాశపరిచడు. కాకపోతే మరీ ఎక్కువ ఊహించుకోకుండా ఏదో థ్రిల్లింగ్ మెస్మరైజింగ్ లాంటి ఉపమానాలు జోలికి పోకుండా చూస్తే ఓ మోస్తరుగా పర్వాలేదనిపిస్తుంది. ఇది పూర్తిగా నాని వన్ మ్యాన్ షో అంతే

ఒక్క మాటలో – ఓ లుక్కేయొచ్చు రోయ్

Also Read :  Pushpa:The Rise Review : పుష్ప ది రైజ్ పార్ట్ 1 రివ్యూ