Pushpa:The Rise Review : పుష్ప ది రైజ్ పార్ట్ 1 రివ్యూ

By Ravindra Siraj Dec. 17, 2021, 01:52 pm IST
Pushpa:The Rise Review :  పుష్ప ది రైజ్ పార్ట్ 1 రివ్యూ

2020 సంక్రాంతికి అల వైకుంఠపురములో ఇండస్ట్రీ హిట్ తర్వాత కరోనా తదితర కారణాల వల్ల సుమారు రెండేళ్ల తర్వాత అల్లు అర్జున్ సినిమా వచ్చింది. స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా బిరుదు మార్చుకున్న బన్నీ ఇందులో చాలా కొత్తగా మేకోవర్ చేసుకోవడం ముందు నుంచి ఆకర్షిస్తూనే వచ్చింది. ఆర్యతో కెరీర్ లో మొదటి బ్రేక్ ఇచ్చిన దర్శకుడు సుకుమార్ మీద నమ్మకంతో అల్లు అర్జున్ దీని కోసం చాలా కష్టపడ్డాడు. విడుదల తేదీ చివరి వరకు తీవ్రమైన ఒత్తిడిని ఎదురుకున్న సుక్కు టీమ్ ఫైనల్ గా సినిమాను థియేటర్లలోకి తీసుకొచ్చింది. మరి భారీ అంచనాలతో వచ్చిన పుష్ప పార్ట్ 1 ఎలా ఉందో రివ్యూలో చూద్దాం

కథ

శేషాచలం అడవుల్లో ఎర్రచందనం చెట్లు కోసే కూలీ పుష్ప( అల్లు అర్జున్). కొండా రెడ్డి(అజయ్ ఘోష్) ఆధ్వర్యంలో ఇదంతా జరుగుతూ ఉంటుంది. అయితే ఓ సందర్భంలో కొండారెడ్డి ప్రోద్బలంతో ఈ దందాకు అసలు నాయకుడు మంగళం శీను(సునీల్) వల్ల తాము అన్యాయానికి గురవుతున్నామని గుర్తించిన పుష్ప అతనికి ఎదురు తిరిగి వార్నింగ్ ఇస్తాడు. ఊహించని పరిణామాల తర్వాత పుష్పరాజ్ స్మగ్లింగ్ సిండికేట్ కి రాజుగా మారతాడు. అప్పుడు ఎంట్రీ ఇస్తాడు ఎస్పి భన్వర్ సింగ్ షేఖావత్(ఫహద్ ఫాసిల్). పుష్పకు ఇతనికి మధ్య యుద్ధం మొదలవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది తెర మీదే చూడాలి

నటీనటులు

గంగోత్రితో మొదలుపెట్టి ఎప్పటికప్పుడు తనలో నటనకు సవాల్ విసిరే పాత్రలను ఎంచుకుంటున్న అల్లు అర్జున్ పుష్పతో మరో పది మెట్లు ఎక్కేశాడు. పక్కా చిత్తూరు యాసలో పుష్ప రాజ్ గా చెలరేగిపోయాడు. ముఖ్యంగా డాన్ గా మారడానికి ముందు వచ్చే ఎపిసోడ్స్ లో బెస్ట్ ఇచ్చేశాడు. భాషను ఒడిసిపట్టుకుని నేర్చుకున్న తీరు బాగా ఉపయోగపడింది. తగ్గేదేలే మ్యానరిజం తో పాటు ఒకవైపు సన్నని గూనితో నడుస్తూ ఉండే బాడీ లాంగ్వేజ్ తో బన్నీ యాక్టింగ్ అభిమానులకు కొత్త అనుభూతినిస్తుంది. డాన్సుల పరంగా స్కోప్ తక్కువగానే ఉన్నప్పటికీ మాస్ ఎక్స్ పెక్టేషన్స్ కి తగ్గట్టు చేయించిన కంపోజింగ్ పర్వాలేదనిపిస్తుంది

రష్మిక మందన్నది డీ గ్లామర్ టచ్ ఉన్న క్యారెక్టర్. సహజత్వం కోసం అందం తగ్గించారు కానీ ఉపయోగపడింది ఏమి లేదు. సునీల్ విభిన్నంగా కనిపించినప్పటికీ మేకప్ మరీ కృతకంగా మారిందేమో అనిపిస్తుంది. బహుశా ఏళ్ళ తరబడి తనను ఒకరకమైన పాత్రల్లో చూడటం వల్ల కలిగిన ఫీలింగ్ కావొచ్చు. ద్రాక్షాయణిగా అనసూయకు, ఎంపిగా రావు రమేష్ కు మొక్కుబడిగా మూడు సీన్లకు దక్కాయి. ఫహద్ ఫాసిల్ ని రెండో భాగంలో వాడుకోవడం కోసం ఇందులో స్కోప్ ని తగ్గించారు. అయినా ఉనికిని చాటుకున్నాడు. కన్నడ నటుడు ధనుంజయ్, అజయ్ ఘోష్, రావు రమేష్, అజయ్ తదితరులు సహజత్వంతో ఆకట్టుకున్నారు. పుష్ప స్నేహితుడిగా నటించిన జగదీష్ కు ఎక్కువ స్క్రీన్ స్పేస్ దక్కింది. సింపుల్ గా అనిపించే నటనతో ఆకట్టుకున్నాడు.

డైరెక్టర్ అండ్ టీమ్

ఒకప్పుడు సగటు ప్రేక్షకులకు అంత సులభంగా అర్థం కాని క్యాలికులేషన్లతో నాన్నకు ప్రేమతో, 1 నేనొక్కడినే లాంటి సినిమాల్లో జనాల మేధస్సుకు పరీక్ష పెట్టిన సుకుమార్ రంగస్థలంతో తన రూటుని పూర్తిగా మార్చుకున్నారు. రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో అన్నట్టు ఈయన కనక కమర్షియల్ రూటు పడితే అది ఇంకో లెవెల్ లో ఉంటుందని చెప్పిన మాట మళ్ళీ నిజం చేయాలనే తపన పుష్పలోనూ కనిపిస్తుంది. ఓ మాములు రోజువారీ కూలి అడవిని శాశించే స్థాయికి ఎలా చేరుకున్నాడనే పాయింట్ తీసుకోవడం వరకు బాగానే ఉంది. దానికి తగ్గ హోమ్ వర్క్ రీసెర్చ్ కూడా సుకుమార్ టీమ్ చేసినట్టు ఉన్నారు. కానీ ఇది సరిపోలేదు.

పుష్పరాజ్ క్యారెక్టర్ ని డిజైన్ చేయడంలో పెట్టిన శ్రద్ధ, ఎలివేషన్లు ఇవ్వడానికి కావలసిన సరంజామా అంతా పర్ఫెక్ట్ గా సెట్ చేసుకున్న సుకుమార్ మిగిలిన పాత్రలను ఎందుకు తేలికగా తీసుకున్నారో అర్థం కాదు. క్యాస్టింగ్ కూడా కొంత మిస్ ఫైర్ అయ్యింది. మంగళం శీనుకి కావాల్సిన ఇంటెన్సిటిని సునీల్ పూర్తి స్థాయిలో పండించలేకపోయాడు. పోనీ అనసూయ లాంటివాళ్లను సరిగా వాడుకున్నారా అంటే అదీ జరగలేదు. ఎక్కడిక్కడ క్యారెక్టర్లు సడన్ గా మాయమవుతాయి. మళ్ళీ ఎక్కడో ప్రత్యక్షమవుతాయి. ఎంతసేపూ పుష్ప తప్ప ఫ్రేమ్ లో ఇంకో నటీనటులు ఎక్కువ సేపు కనిపించరు. ఇది కథపరంగా రాసుకున్నదే అయినా ఒకరకంగా లోపమే.

సుకుమార్ రంగస్థలం హ్యాంగోవర్ నుంచి బయటికి రాలేదు. అదే తరహా నేపథ్యం పాత్రల ప్రవర్తన ఇందులోనూ కనిపిస్తుంది. కానీ అక్కడ పండిన డ్రామా, ఎమోషన్ ఇందులో సరిగా పేలలేదు. పైగా తల్లి సెంటిమెంట్ ని బలంగా రిజిస్టర్ చేయాలని చూసిన సుక్కు మొదలుపెట్టడం సరిగానే చేశారు కానీ దళపతిలో రజినీకాంత్ ని మణిరత్నం చూపించిన రేంజ్ లో పుష్పని కనెక్ట్ చేయాలని విశ్వ ప్రయత్నం చేశారు. అయితే అంత బరువైన తల్లి క్యారెక్టర్ ని ,మోసే నటిని సెట్ చేసుకోకపోవడం కూడా మైనస్సే. శాండల్ వుడ్ లో మంచి పేరున్న ధనుంజయ్ ఇందులో సగటు మాములు రౌడీగా కనిపించడం క్యారెక్టరైజేషన్ల లోపమే.

అసలు పుష్పని ముందు అనుకున్నట్టు ఒక భాగానికి పరిమితం చేసినా బాగుండేది. కెజిఎఫ్ తో స్ఫూర్తి చెందారు కాబోలు ఫస్ట్ పార్ట్ ని ఎలివేషన్లకు వాడుకుని ఫహద్ ఫాసిల్ దొరికాడు కాబట్టి రెండో భాగంలో అతనికి బన్నీకి క్యాట్ అండ్ మౌస్ గేమ్ పెట్టేస్తే సరిపోతుందనుకున్నారు. కానీ సుకుమార్ సెట్ చేసిన బేస్ సీక్వెల్ మీద విపరీతమైన ఆసక్తి కలిగించేలా నడవలేదు. బాహుబలి 2 మీద అంత హైప్ రావడానికి కారణం కేవలం గ్రాఫిక్స్ కాదు. ఎందుకు కొనసాగింపు చూడాలనే దానికి రాజమౌళి చాలా బలమైన సమాధానాలు టెర్రిఫిక్ ఎపిసోడ్స్ రూపంలో చూపించారు కాబట్టి. కానీ పుష్పలో అంత బలమైన మెటీరియల్ లేదు.

ఇదంతా సుకుమార్ ని తక్కువ చేయడానికో లేదా అయన సినిమా సరిగా తీయలేదని చెప్పడానికో కాదు. సుక్కు బన్నీ కాంబినేషన్ అంటే సగటు ప్రేక్షకులకు ఖచ్చితంగా అంచనాలు ఉంటాయి. వాటికి లోబడితేనే వందల కోట్ల వసూళ్లు కురుస్తాయి. రంగస్థలం - అల వైకుంఠపురములో తర్వాత ఆయా దర్శకుడు హీరో నుంచి వస్తున్న సినిమా కాబట్టి పుష్ప నుంచి ఫ్యాన్స్ మాత్రమే కాదు జనాలు కూడా ఎంతో ఆశించారు. ఫస్ట్ హాఫ్ మొత్తం పర్వాలేదనిపించినా అసలు సమస్య సెకండ్ హాఫ్ తో స్టార్ట్ అవుతుంది. పోనీ ఫహద్ ఎంట్రీ ఇచ్చాకైనా ఏదైనా థ్రిల్లింగ్ గా ఉంటుందా అంటే అదీ లేదు. ఈ తతంగం కూడా హడావిడిగానే సాగుతుంది.

ఇక ప్లస్సుల విషయానికి వస్తే సుకుమార్ లో ఉన్న గొప్ప టెక్నీషియన్ ఇందులోనూ కనిపిస్తారు. పుష్పని ఎస్టాబ్లిష్ చేసిన తీరు, అడవిలో సెటప్ తదితరాలు ఆకట్టుకుంటాయి. ఇంటర్వెల్ బ్లాక్ లో వచ్చే ఫైట్ కూడా మాస్ లో సూపర్ గా పేలింది. ధనుంజయ్ ఒళ్ళు హూనం చేసే సన్నివేశం పండింది. వీటిదగ్గర గ్రాఫ్ లేచినట్టే లేచి మళ్ళీ డౌన్ అయిపోవడం ఇబ్బంది పెట్టింది. బాగున్నాయి అనిపించే సీన్లు ఉన్నాయి కానీ గూస్ బంప్స్ వచ్చాయి అని అభిమానులు ఫీలవ్వడం తప్ప కామన్ ఆడియన్స్ కి దొరికిన మూమెంట్స్ తక్కువే. సుకుమార్ టిపికల్ స్టైల్ లో లేకుండా వీలైనంత మాసీగా తీయడం ఓ వర్గం ప్రేక్షకులకు నచ్చే అవకాశాలు ఉన్నాయేమో

సమయం లేకనో మరే ఇతర కారణమో దేవిశ్రీ ప్రసాద్ స్థాయి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇందులో మిస్ అయ్యింది. చాలా చోట్ల మంచి సీన్లు కూడా ఈ కారణంగానే వీక్ అయ్యాయంటే ఆశ్చర్యం కలగక మానదు. పాటలు ఆల్రెడీ బాగా ఎక్కేశాయి కాబట్టి విజువల్ గానూ బోర్ కొట్టకుండా వెళ్లిపోయాయి. మిరోస్లా కుబా బ్రోజెక్ ఛాయాగ్రహణం మాత్రం హై స్టాండర్డ్ లో సాగింది. మంచి విఎఫ్ఎక్స్ తోడయ్యి ఉంటే రేంజ్ పెరిగేది. శ్రీకాంత్ విస్సా టీమ్ సంభాషణలు సీమ యాసను బాగా వినిపించడమే కాదు గట్టి పంచులు కూడా పడ్డాయి. రామకృష్ణ మౌనికల ఆర్ట్ వర్క్ ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇన్ని కోట్లు ఖర్చు పెట్టిన మైత్రి కొన్ని విభాగాల్లో ఎందుకు రాజీ పడ్డారో

ప్లస్ గా అనిపించేవి

అల్లు అర్జున్ పెర్ఫార్మన్స్
అటవీ నేపథ్యం
ఛాయాగ్రహణం
ఫస్ట్ హాఫ్

మైనస్ గా తోచేవి

క్యారెక్టరైజేషన్లు
రెండో సగం
క్యాస్టింగ్ ని వాడుకోకపోవడం
నేపధ్య సంగీతం

కంక్లూజన్

సుకుమార్ అనే బ్రాండ్ కి ఇండస్ట్రీలోనే కాదు సామాన్య ప్రేక్షకుల్లోనూ ప్రత్యేకమైన అభిమానం గౌరవం ఉన్నాయి. ఉంటాయి కూడా. కానీ కమర్షియల్ సూత్రాలకు కట్టుబడి తన స్టైల్ లో ఒక ఫారెస్ట్ గ్యాంగ్ స్టర్ కథని అబ్బురపరిచేలా తీయాలనుకున్న ఈ లెక్కల మాస్టారి గురి ఈసారి సరిగా కుదరలేదు. అందుకే ఇది ఒక మాములు రౌడీ కథగా మారిపోయింది. సీనియర్ మోస్ట్ క్యాస్టింగ్ ఉన్నా కథాకథనాల లోపాల వల్ల ఎవరూ పూర్తిగా ఉపయోగపడలేదు. కానీ ఇన్నేళ్ల కెరీర్ లో బన్నీ ఎన్నడూ చేయని ఊర మాస్ పవర్ ఫుల్ పెర్ఫార్మన్స్ నూటికి నూరు శాతం ఈ కథకు న్యాయం చేసింది. ఈ ఒక్క కారణం చాలనుకుంటే పుష్ప ది రైజ్ చూసేయండి

ఒక్క మాటలో - ఫైర్ తగ్గింది పుష్పా

Also Read : Lakshya Review : లక్ష్య రివ్యూ

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp