iDreamPost
iDreamPost
ఛలో బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత చెప్పుకోదగ్గ కౌంట్ లో సినిమాలు చేసినప్పటికీ విజయం అందని ద్రాక్షగా మారిపోయిన హీరో నాగ శౌర్య కొత్త సినిమా లక్ష్య ఇవాళ థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సుబ్రమణ్యపురంతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సంతోష్ జాగర్లపూడి రెండో చిత్రమిది. లాక్ డౌన్ వల్ల వాయిదా పడుతూ వచ్చిన ఈ స్పోర్ట్స్ డ్రామా కోసం శౌర్య చాలా కష్టపడ్డాడు. ప్రత్యేకంగా సిక్స్ ప్యాక్ చేసి ఒళ్లును హూనం చేసుకున్న పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయ్టి. ముగ్గురు నిర్మాతల భాగస్వామ్యంలో రూపొందిన ఈ ఎమోషనల్ ఎంటర్ టైనర్ ప్రేక్షకులను మెప్పించేలా సాగిందో లేదో రివ్యూలో చూద్దాం
కథ
చిన్నప్పుడే తండ్రిని కోల్పోయిన పార్ధు(నాగ శౌర్య)ను అతని తాతయ్యే(సచిన్ కెడ్కర్) పెంచి పెద్ద చేస్తాడు. ఆర్చరీ(విలువిద్య)లో గొప్ప నైపుణ్యం కలిగి ఇంటర్ నేషనల్ ఒలంపిక్స్ లో పతాకం సాధించాలనుకున్న కొడుకు లక్ష్యాన్ని మనవడి ద్వారా నెరవేర్చుకోవడం కోసం ఉన్న ఊరు వదిలేసి హైదరాబాద్ తీసుకొస్తాడు. వయసొచ్చాక లక్షలు ఖర్చు పెట్టి అకాడెమిలో చేర్పిస్తాడు. అనుకోకుండా గుండెపోటుతో తాత మరణిస్తాడు. కోచింగ్ క్యాంప్ లో ప్రత్యర్థులు పన్నిన కుట్రలో ఇరుక్కుని డ్రగ్స్ కు ముందుకు బానిసగా మారి పార్థు కెరీర్ ని నాశనం చేసుకుంటాడు. మరి ఇతని జీవితం ఏ మలుపులు తిరిగింది అనేది తెరమీదే చూసి తెలుసుకోవాలి
నటీనటులు
నాగశౌర్య కథను నమ్మాడో లేక ఆరు పలకల దేహం మిగిలిన సినిమాలకు కూడా పనికొస్తుందనుకున్నాడో తెలియదు కానీ మొత్తానికి ఇతని డెడికేషన్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. యాక్టింగ్ పరంగా మరీ గొప్ప మెరుపులు లేవు కానీ ఉన్నంతలో పార్ధుగా మంచి అవుట్ ఫుట్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. హెవీ ఎమోషన్స్ ఉన్న సీన్స్ లో కొంత తడబాటు కనిపిస్తుంది. అయితే ఓవరాల్ గా పాత్ర డిమాండ్ చేసిన హార్డ్ వర్క్ ఇచ్చాడు. హీరోయిన్ కేతిక శర్మ ఫస్ట్ హాఫ్ లో ఉనికి గుర్తించేలా కనిపించినా తర్వాత అక్కడక్కడా మాత్రమే దర్శనమిస్తుంది. నటన గురించి చెప్పడానికి ఏమి లేదు. ఇలాంటి క్యారెక్టర్స్ లో స్కోప్ ఉండదు కూడా.
జగపతిబాబుకి మరో సారి రొటీన్ లకే రొటీన్ పాత్ర దక్కింది. జనాలు అలా ఫీలవుతారనేమో చిన్న లోపం పెట్టారు కానీ ఒకదశలో ఆయన దాన్ని మర్చిపోయి రెగ్యులర్ గా చేసుకుంటూ పోయారు. సచిన్ కెడ్కర్ ఉన్నంతలో డీసెంట్ గా అనిపించారు. కమెడియన్ ని సత్యని వాడుకోలేదు. ఒక సెల్ ఫోన్ ఇచ్చి మమ అనిపించారు. ఊహించని విధంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ శత్రుకి మేకోవర్ చేసి వెరైటీగా చూపించారు కానీ అంతగా సెట్ అవ్వలేదనిపిస్తుంది. హీరోయిన్ తల్లితండ్రులు, అకాడెమి హెడ్, ఇతర చిన్నా చితకా ఆర్టిస్టులు సోసో అనిపించారు
డైరెక్టర్ అండ్ టీమ్
స్పోర్ట్స్ డ్రామా అంటే సుదీర్ఘమైన సంభాషణలు, ఒక క్రీడ చుట్టూ పదే పదే తిప్పే సన్నివేశాల కలబోత కాదు. అందులోనూ మనకు అంతగా అలవాటు లేని ఆర్చరీ లాంటి గేమ్ ని తీసుకున్నప్పుడు దర్శకుడు చాలా హోమ్ వర్క్ చేయాలి. కానీ సంతోష్ జాగర్లపూడి టేకింగ్ లో అలాంటిదేమీ ఫీల్ కాము. ఏదో నాని జెర్సీని జనాలు ఆదరించారు కదాని అందులో లాగే నాలుగైదు బరువైన సీన్లు, హీరోని ఓడిపోయి జీవితంలో దెబ్బ తిని మళ్ళీ గెలిచినవాడిగా చూపించాలనే తాపత్రయం స్పష్టంగా కనిపిస్తుంది. కేవలం ఈ రెండు మూడు పాయింట్ల మీదే జెర్సీ ఆడలేదు. బలమైన భావోద్వేగాలను అక్కడ గౌతమ్ తిన్ననూరి చక్కగా ఆవిష్కరించారు.
లక్ష్యలో ఇది పూర్తిగా మిస్ అయ్యింది. తాతయ్య కలను తీర్చడం కోసం ఓ యువకుడి పోరాటాన్ని పాయింట్ గా తీసుకోవడం వరకు బాగానే ఉంది. కానీ సరైన పద్ధతిలో ఇంటరెస్టింగ్ స్క్రీన్ ప్లే గా మార్చి ప్రెజెంట్ చేయడంలో సంతోష్ తడబడ్డారు. సినిమా మొదలైన అయిదు నిమిషాల నుంచే ఈజీగా ఊహించగలిగే డ్రామాతో లక్ష్య అనాసక్తిగా సాగుతుంది. కనీస వ్యక్తిత్వం లేకుండా పార్ధు ప్రవర్తించే తీరు, తన కోసం సర్వసం త్యాగం చేసిన తాతయ్యను మర్చిపోయి వట్టి తాగుబోతుగా మారే వైనం ఏ మాత్రం కన్విన్సింగ్ గా ఉండవు. పైగా సీరియల్ తరహా నెరేషన్ విసుగు పుట్టిస్తుంది. అబ్బ ఈ సీన్ భలే ఉందే అనే అవకాశం ఎక్కడా ఇవ్వలేదు.
క్రికెట్, కబడ్డీ, ఫుట్ బాల్ లాగా ఆర్చరీ ఆట గ్రౌండ్ లో పరస్పరం తలపడేది కాదు. ఒకరి తర్వాత ఒకరు టార్గెట్ ని గురి చూసి బాణం వదిలి బుల్స్ ఐని హిట్ చేయాలి. చెప్పుకోవడానికి సింపుల్ గా ఉన్నా ప్రాక్టికల్ గా ఆడేటప్పుడు ఇది చాలా కష్టం. కానీ ఆడియన్స్ ఎగ్జైట్ చేసేందుకు కావాల్సిన ట్విస్టులు ఇందులో చూపించలేం. అలాంటప్పుడు ఎంటర్ టైన్మెంట్, మ్యూజిక్, ఫ్యామిలీ ఎలిమెంట్స్ లాంటి ఇతర అంశాలను సబ్ ప్లాట్స్ ని తీసుకుని ఉంటే లక్ష్య కనీసం ఓ వర్గాన్ని అయినా మెప్పించే అవకాశం దక్కేది. ఎంతసేపూ ఇల్లు, గ్రౌండ్ తప్ప మరో లొకేషన్ లేకుండా సాగిన లక్ష్య నీరసంగా సాగడానికి ప్రధాన కారణం ఇదే.
మనం కష్టపడ్డామని జాలి చూపించడానికి ప్రేక్షకుడు టికెట్ కొనడు. అదసలు కారణం కూడా కాదు. నాగ శౌర్య కష్టపడి సిక్స్ ప్యాక్ చేశాడు. నిజమే. అందులో ఎలాంటి అనుమానం లేదు. అలా అని ఆ బాడీని చూపించడానికి బలవంతంగా సీన్లను రాసుకుంటే అక్కడ శబాష్ అనే బదులు అయ్యో వృధా అయిపోయిందే అనే సింపతీనే ఎక్కువ కలుగుతుంది. దీనివల్ల కలిగే ప్రయోజనం కన్నా డ్యామేజ్ ఎక్కువ. లక్ష్యలో జరిగింది ఇదే. హీరో వ్యక్తిత్వాన్ని మరీ దిగార్చేసి ముప్పాతిక సినిమా దాకా పోన్లే అని అనుకునే ఛాన్స్ కూడా ఇవ్వకుండా డిజైన్ చేయడంతో క్లైమాక్స్ లో రావాల్సిన మినిమిమ్ ఎమోషన్ కూడా జీరో అయిపోయింది.
ఇకపై ఇలాంటి క్రీడలను ఆధారంగా చేసుకుని తీసే సినిమాలను ఒప్పుకునేటప్పుడు హీరోలు ఇది కూడా బాగా వాడేసిన ఫార్ములాగా మారిపోయిందన్న విషయాన్ని గుర్తించుకోవాలి. ఎవరూ చూపించలేదు కదాని కథని పాతదే తీసుకుని కేవలం గేమ్ ని మాత్రమే కొత్తగా చూపిస్తే సరిపోదు. సపోర్టింగ్ ఎలిమెంట్స్ బలంగా ఉండాలి. అంతే తప్ప ఒక చిన్న సెంటిమెంట్ థ్రెడ్ ని పట్టుకుని రెండున్నర గంటలు ఇలా పైపై మెరుగులుతో కవర్ చేస్తే ఫైనల్ అవుట్ ఫుట్ నిరాశ పరిచే విధంగానే ఉంటుంది. లక్ష్య నాగ శౌర్య కెరీర్ లో బాగా కష్టపడిన సినిమాగా గుర్తుండిపోవచ్చు కానీ ల్యాండ్ మార్క్ అని చెప్పుకునే ఛాన్స్ మాత్రం మిస్ అయ్యింది
సంగీత దర్శకుడు కాలభైరవ తన నేపధ్య సంగీతంతో వీక్ సీన్స్ ని నిలబెట్టే ప్రయత్నం గట్టిగా చేశాడు. ఉప్పు కారం అసలే లేని విందు భోజనంలో ఎంత నెయ్యి పోసినా ప్రయోజనం ఉండదు. పాటలు ఎక్కువ లేకపోయినా ఉన్నవి కూడా రిపీట్ మోడ్ ఆన్ అనే అవకాశం ఇవ్వలేదు. సృజనమణి సంభాషణల్లో ఎలాంటి ప్రత్యేకత లేదు. చాలా మాములుగా ఉన్నాయి. రామ్ ఛాయాగ్రహణం బాగుంది. బడ్జెట్ కట్టుదిట్టాల మధ్య కూడా క్వాలిటీ ఇచ్చేనందుకు ట్రై చేశాడు. జునైద్ సిద్ధిక్ ఎడిటింగ్ ఒకటే ల్యాగ్ కి కారణం కాదు. ముగ్గురు ప్రొడ్యూసర్లు ఉన్నారే కానీ బడ్జెట్ లో చాలా రాజీ పడ్డారు. స్టేడియం సీన్స్ విఎఫ్ఎక్స్ లో కనీస నాణ్యత ఉండదు
ప్లస్ గా అనిపించేవి
నాగశౌర్య కష్టం
నేపధ్య సంగీతం
ఛాయాగ్రహణం
మైనస్ గా తోచేవి
టేకింగ్
బోరింగ్ స్క్రీన్ ప్లే
జీరో ఎమోషన్
ఆసక్తి కలిగించని స్పోర్ట్
కంక్లూజన్
ఎమోషన్ లేని స్పోర్ట్స్ డ్రామాలో హీరో సిక్స్ ప్యాక్ చేసినా, ఫిఫ్టీ ఫీట్ నుంచి జంప్ చేసినా ప్రయోజనం ఉండదు. లక్ష్య అందుకే లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. ఓడిపోయి గెలిచిన విజేత కథను తెరమీద చూపించడం అంత ఈజీ కాదు. రెండు మూడు మలుపులు, నాలుగైదు కన్నీళ్లు, స్పీచులతో జనం ఆహా ఓహో అనరు. అందులోనూ క్రికెట్ తప్ప మరో ఆట మీద పెద్దగా ఆసక్తి లేని మన ప్రేక్షకులను మెప్పించాలంటే చాలా కష్టపడాలి. ఓటిటి ఎంటర్ టైన్మెంట్ స్టాండర్డ్ రోజురోజుకి పెరిగిపోతున్న తరుణంలో పైపై మెరుగులతో థియేటర్ సినిమాలు తీసి పాస్ అవ్వలేమని నేర్చుకోవడానికి లక్ష్య లాంటి పాఠాలు ఖచ్చితంగా ఉపయోగపడతాయి
ఒక్క మాటలో – టార్గెట్ మిస్
Also Read : Skylab Review : స్కైల్యాబ్ రివ్యూ