CID కస్టడికి చంద్రబాబు.. పవన్‌ మౌనం.. అసలేం జరుగుతోంది?

ఆంధ్రప్రదేశ్‌ స్కిల్‌ డెవలపమెంట్‌ కేసులో అరెస్టైన చంద్రబాబుకు.. ఏపీ హైకోర్టులో చుక్కెదురయ్యింది. ఆయన వేసిన క్వాష్‌ పిటిషన్‌ని కొట్టేయడమే కాక.. రిమాండ్‌ పొడిగింపు.. సీఐడీ కస్టడీకి ఇవ్వడం వంటి కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. మరోవైపు ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో.. చంద్రబాబు అరెస్ట్‌పై టీడీపీ నేతలు రచ్చ చేస్తున్నారు. ఇక హిందూపూర్‌ ఎమ్మెల్యే బాలకృష్ణ అయితే.. అసెంబ్లీ అనే సోయి మరిచి.. సినిమా షూటింగ్‌లో మాదిరి.. పిచ్చి వేషాలు, వెకిలి చేష్టలకు పాల్పడుతున్నాడు. చర్చకు సిద్ధమని అధికార పార్టీ తెలిపినా సరే.. టీడీపీ నేతలు మాత్రం.. సభలో గందరగోళ సృష్టించాడానికే విశ్వ​ ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు లోకేష్‌.. ఢిల్లీ వెళ్లాడు. అక్కడ ఏం చేస్తున్నాడో కనీసం టీడీపీ పెద్దలకైనా తెలుసో లేదో అన్నది రహస్యం.

ఇదిలా ఉంటే.. చంద్రబాబు కేసులో ఇన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నా.. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ వీటి గురించి కనీసం ఇప్పటివరకు స్పందించలేదు.. పార్టీ తరఫున ఒక ప్రకటన కూడా చేయలేదు. చంద్రబాబును అరెస్ట్‌ చేసిన రోజున.. చూపినంత దూకుడు ఇప్పుడు కనిపించడం లేదు. అసలు చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ అయిన తొలి రోజున.. టీడీపీ నేతలు, కార్యకర్తల కన్నా ఎక్కువ.. జనసేన కార్యకర్తలే స్పందించారు. రోడ్ల మీదకు వచ్చి.. ఆందోళన వ్యక్తం చేశారు. నిరసనలు తెలిపారు.

ఇక పవన్‌ కళ్యాణ్‌ అయితే ఏకంగా రోడ్డు మీదనే పడుకుని మరీ నిరసన తెలిపారు. చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్‌ జైలుకి తరలించిన తర్వాత.. పవన్‌ వెళ్లి.. బాబుతో ములాఖత్‌ అయ్యారు. ఆ వెంటనే మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తు ఉంటుందని స్పష్టం చేశారు. చంద్రబాబు అరెస్ట్‌ అయిన ప్రారంభంలో దూకుడుగా వెళ్లిన జనసేన ఆ తర్వాత కామ్‌ అయిపోయింది. బాబును సీఐడీ కస్టడీకి అప్పగిస్తూ హైకోర్టు తీర్పు వెల్లడించిన తర్వాత కూడా జనసేన నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.

అందుకే తీరు మార్చుకున్నారా..

ప్రారంభంలో అంత దూకుడు ప్రదర్శించిన పవన్‌ కళ్యాణ్‌, జనసేన పార్టీ ఇప్పుడు ఎందుకు సైలెంట్‌ అయ్యారు అనే దాని గురించి ప్రస్తుతం జోరుగా చర్చ సాగుతోంది. అవినీతి కేసులో అరెస్ట్‌ అయిన బాబుకు.. పవన్‌ మద్దతు తెలపడం పట్ల జనసేన పార్టీ నుంచే వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. టీడీపీతో పొత్తు ప్రకటనతో అది మరింత పెరిగింది. పవన్‌ సైకిల్‌ ఎక్కితే మద్దతివ్వం అంటూ కాపు పెద్దలు, చిరు, పవన్‌ అభిమానులు డైరెక్ట్‌గా చెప్పారు.

పైగా అవినీతిని ప్రశ్నిస్తానంటూ రాజకీయాల్లోకి వచ్చిన పవన్‌.. అవినీతి కేసులో అరెస్ట్‌ అయిన బాబుకి మద్దతివ్వడం ఏంటి.. ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడం ఏంటంటూ పవన్‌ అభిమానులు సైతం ప్రశ్నించడం మొదలు పెట్టారు. తన చర్యల వల్ల ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తం అవుతోందని గ్రహించిన జనసేన అధ్యక్షుడు.. జనాల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయని గుర్తించి.. వెనకడుగు వేశారని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈక్రమంలోనే చంద్రబాబును.. సీఐడీ కస్టడి విధించినప్పటికి.. ఆయన స్పందించలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

అక్కడే వాళ్లిద్దరికి చెడిందా..?

దీంతో పాటు మరో వాదన కూడా వినిపిస్తోంది. బాబుతో ములాఖత్‌ సందర్భంగా.. జైల్లోనే టీడీపీ-జనసేనల మధ్య పొత్తు గురించి చర్చ జరిగిందని అందరికి తెలుసు. అయితే పొత్తుల అంశంలో.. పవన్‌కు, లోకేష్‌కి చెడిందని.. టీడీపీ యువనేత తీవ్ర అసంతృప్తితో ఉన్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. అందుకే ప్రస్తుతం పవన్‌ కళ్యాణ్‌.. చంద్రబాబు అరెస్ట్‌ అంశాన్ని పట్టించుకోవడం మానేశారనే టాక్‌ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు అరెస్ట్‌ కేసులో ఎలాంటి కీలక పరిణామాలు చోటు చేసుకున్నా.. పవన్‌ స్పందించడం లేదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అసలు పవన్‌ మనసులో ఏముందో.. తను ఏం ఆలోచిస్తున్నాడో.. ఆ పార్టీ పెద్దలకైనా తెలసో లేదో అనకుంటున్నారు సామాన్యులు. మరి పవన్‌ ఎంత కాలం మౌనంగా ఉంటారో చూడాలి.

Show comments