iDreamPost
android-app
ios-app

బాబు చూపిన బాటలో బీజేపీ నేతలు

బాబు చూపిన బాటలో బీజేపీ నేతలు

రాజకీయాలు మారిపోయాయి. గెలిస్తే స్వాగతించే నేతలు.. ఓడితే ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసేలా ప్రకటనలు చేసే పరిస్థితి రాజకీయాల్లో వచ్చింది. అన్ని నేనే చేశాను.. దేశంలోనే సీనియర్‌ను అని చెప్పుకునే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడే దీనికి ఆధ్యుడు. ఆయన చూపిన బాటలో ఇతర రాష్ట్రాలలోని ప్రతిపక్ష పార్టీలు కూడా నడుస్తున్నాయి. ప్రాంతీయ పార్టీలే కాదు.. వివిధ రాష్ట్రాలలో ప్రతిపక్షంలో ఉన్న జాతీయ పార్టీలు కూడా ప్రజా తీర్పును స్వీకరించే పరిస్థితిలో లేవు. తాజాగా పశ్చిమ బెంగాల్‌లో మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. అధికార తృణముల్‌ ఘనవిజయం సాధించింది. 108 మున్సిపాలిటీలకు గాను 102 పురపాలికలను కైవసం చేసుకుంది. ప్రతిపక్ష బీజేపీకి ఘోరపరాభవం ఎదురైంది.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో ప్రతిపక్ష స్థానంలో ఉంది. ప్రజాతీర్పును గౌరవించాల్సిన పశ్చిమ బెంగాల్‌ నేతలు.. ఎన్నికల ప్రక్రియను, ఓటర్‌ తీర్పును అవమానించేలా ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం టీఎంసీకి బానిసగా మారిపోయిందంటూ బీజేపీ రాష్ట్ర నేత అనిర్బాన్‌ గంగూలి తీవ్ర విమర్శలు చేశారు. కేంద్ర బలగాలను దింపితే.. టీఎంసీ ఒక్క మున్సిపాలిటీని కూడా గెలవదన్నారు అనిర్బాన్‌ గంగూలి. అంతేకాదు ఓటర్లను భయపెట్టి టీఎంసీ ఓట్లు వేయించుకుందని ఆరోపించారు.

ఈ వ్యాఖ్యలు విన్న తెలుగు వారికి టక్కున టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గుర్తుకురాకమానరు. గత ఏడాది ఆంధ్రప్రదేశ్‌(ఏపీ)లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. పంచాయతీ, పరిషత్, మున్సిపల్‌ ఎన్నికల్లో అధికార వైసీపీ ఘనవిజయం సాధించింది. మునుపెన్నడూ లేనంత ఘోర ఓటమిని టీడీపీ మూటకట్టుకుంది. పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికలు నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ సమయంలో జరగ్గా.. నీలం సాహ్ని కమిషనర్‌గా ఉన్న సమయంలో పరిషత్‌ ఎన్నికలు జరిగాయి. నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ప్రభుత్వంతో ఎడ్డంటే తెడ్డం అనేలా వ్యవహరించారు. కమిషనర్‌ కాకముందు నీలం సాహ్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేశారు.

అధికారులు ఎవరైనా.. పంచాయతీ, మున్సిపల్, పరిషత్‌ ఎన్నికల్లో ప్రజాతీర్పు మారలేదు. కానీ చంద్రబాబు అండ్‌కో.. నీలం సాహ్ని కమిషనర్‌గా ఉన్న సమయంలో.. రాష్ట్ర ఎన్నికల సంఘం వైసీపీ సర్కార్‌కు దాసోహమైందంటూ విమర్శలు చేశారు. ఎన్నికల సంఘం పక్షపాతంగా వ్యవహరిస్తోందని ఆరోపణలు చేస్తూ.. నామినేషన్‌ దాఖలు చేసిన తర్వాత కూడా ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించిన టీడీపీ.. ఎన్నికల ప్రక్రియను, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది.

ఈ తరహా తీరును ప్రప్రథమంగా ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు మొదలుపెట్టారు. ఇప్పుడు ఆ తీరును.. పశ్చిమ బెంగాల్‌లో ప్రతిపక్ష హోదాలో ఉన్న బీజేపీ ఆచరిస్తోంది. ఓడిపోయినా.. ఆయా పార్టీలకు ప్రజలు ఓట్లు వేసి ఉంటారు. గెలుపు, ఓటమికి మధ్య ఒక్క ఓటునే. అధికార పార్టీ బెదిరించి ఓట్లు వేయించుకుందని బీజేపీ నేతలు ఆరోపిస్తే.. మరి కమలం గుర్తుకు ఒక్క ఓటు కూడా రాకూడదు. కానీ ఆ పరిస్థితి ఉందా..? అంటే కమలం నేతలు ఏం సమాధానం చెబుతారు. ఇప్పుడు ఓడిపోయిన బీజేపీ రేపు విజయం సాధించవచ్చు. అప్పుడు కమలం పార్టీ నేతలు ఇలానే మాట్లాడతారా..?