కడపలోని సంధ్యా సర్కిల్ వద్ద జూన్ 23న చిన్ననాగిరెడ్డి గారి శ్రీనివాసుల రెడ్డి హత్య కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడు టీడీపీ నేత పాలెంపల్లె సుబ్బారెడ్డిగా తేల్చారు. శ్రీనివాసులరెడ్డి హత్యకు ఎలా ప్రణాళిక రచించారు, ఎందుకు హత్య చేశారు అనే కీలక విషయాలను పోలీసులు వెల్లడించారు. ఏ3గా ఉన్న ల్యాబ్ శ్రీనుతో సుబ్బారెడ్డి మాట్లాడిన ఫోన్ కాల్స్, సీక్రెట్ మీటింగ్స్, గూగుల్ టేకౌట్ పరిశీలన ఇలా అన్ని కోణాల్లో విచారణ తర్వాత సుబ్బారెడ్డి ప్రధాన కుట్రదారుడిగా పోలీసులు తేల్చారు.
సుబ్బారెడ్డి కోసం పోలీసుల గాలింపు ప్రారంభించిన తర్వాత అతను ఫోన్ ఇంట్లో పడేసి హైదరాబాద్ వెళ్లినట్లు గుర్తించారు. ఆ తర్వాత జూలై 5న సుబ్బారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే ల్యాబ్ శ్రీను- సుబ్బారెడ్డిల ఒప్పందానికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ కేసులో మరో ట్విస్ట్ ఏంటంటే.. హతుడు శ్రీనివాసులరెడ్డి, సుబ్బారెడ్డి, ప్రతాప్ రెడ్డి అంతా 2020 వరకు మిత్రులే.
వీళ్లంతా కలిసి 2019 ఎన్నికల్లో టీడీపీ విజయం కోసం పని చేశారు కూడా. ఆ తర్వాత విభేదాల కారణంగా ఒక్కొక్కరిగా విడిపోయారు. అప్పటి నుంచే శ్రీనివాసుల రెడ్డి హత్యకు ప్రతాప్ రెడ్డి, ల్యాబ్ శ్రీను ప్రయత్నాలు ప్రారంభించారు. ఆ తర్వాత సుబ్బారెడ్డితో కలిసి సీక్రెట్ మీటింగ్స్ కూడా నిర్వహించారు. ల్యాబ్ శ్రీను వీడియో ఒకటి నెట్టింట వైరల్ అయ్యింది. ఈ హత్యలో ల్యాబ్ శ్రీనుకు రూ.30 లక్షలు ఇస్తాను, కోర్టు వ్యవహారం కూడా చూసుకుంటాను అంటూ సుబ్బారెడ్డి హామీ ఇచ్చాడని ల్యాబ్ శ్రీను వెల్లడించాడు.