చంద్రబాబుకి IT నోటీసులపై సుజనా చౌదరి సుద్దపూస కబుర్లు!

ఏపీలో ఎన్నికల వేడి ముందుగానే కనిపిస్తోంది. అధికార విపక్ష పార్టీల మధ్య విమర్శలు ప్రతివిమర్శలతో రాజకీయ ప్రకంపనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆదాయ పన్ను శాఖ నోటీసులు ఇచ్చిందనే ప్రచారం సాగుతోంది. లెక్కలు చూపని రూ. 118 కోట్లకు సంబందించిన ఆదాయంపై నోటీసులు ఇచ్చినట్లు ప్రచారం. దీనిని అస్త్రంగా మలుచుకున్న వైసీపీ మంత్రులు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపిస్తున్నారు. అమరావతి నిర్మాణాల్లో అవినీతికి పాల్పడి సొమ్ము పోగేసుకున్నారని విమర్శిస్తున్నారు. అయితే ఇదే అంశంపై బీజేపీ నేత షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఎన్టీఆర్‌ జిల్లాలో ‘‘నా భూమి –నా దేశం’’ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి చంద్రబాబుకు ఐటీ నోటీసులపై సంచలన కామెంట్స్ చేశారు. చంద్రబాబుకు నోటీసులు ఇచ్చిన విషయం తనకు తెలియదని, ఆ విషయం ఆయననే అడగాలని తెలిపారు. నేను కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు నోటీసులు రాలేదు కదా అని వెల్లడించారు. చంద్ర బాబుకు అనుకూలంగా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పనిచేస్తుందంటూ వచ్చిన ప్రచారాన్ని సుజనా చౌదరి ఖండించారు.

అయతే ఈ ఐటీ నోటీసుల వ్యవహారంపై కొందరు మాట్లాడుతూ.. ఇవే ఐటీ నోటీసులు జగన్ కు ఇచ్చుంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మౌనంగా ఉండేవారా? సీఎం జగన్ పై ప్రతి సారి ఏవో విమర్శలు చేసే పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు ఐటీ నోటీసుల విషయంపై ఎందుకు పెదవి విప్పడం లేదంటూ చర్చించుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని దెబ్బతీసే విధంగా కుట్రలు పన్నుతున్నారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ, జనసేన పొత్తుల వ్యవహారంపై సుజనా చౌదరి దాటవేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Show comments