Pawan Kalyan: పొత్తు గురించి మాట్లాడారో ఖబడ్దార్‌.. జన సైనికులకు పవన్ వార్నింగ్

పొత్తుపై అసంతృప్తితో ఉన్న జనసేన కార్యకర్తలకు పరోక్షంగా సీరియస్‌ వార్నింగ్‌ ఇస్తూ.. బహిరంగ లేఖ రాశాడు పవన్‌ కళ్యాణ్‌. ఆ వివరాలు..

పొత్తుపై అసంతృప్తితో ఉన్న జనసేన కార్యకర్తలకు పరోక్షంగా సీరియస్‌ వార్నింగ్‌ ఇస్తూ.. బహిరంగ లేఖ రాశాడు పవన్‌ కళ్యాణ్‌. ఆ వివరాలు..

రానున్న ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల కోసం టీడీపీ, జనసేన పార్టీలు పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. రెండు పార్టీలు కూటమిగా కలిసి పోటీ చేస్తాయని ఇరు పార్టీల అధ్యక్షులు ప్రకటించారు. అయితే టీడీపీతో పొత్తును జనసేన నేతలు ముందు నుంచి వ్యతిరేకిస్తున్నారు. అవినీతి నిర్మూలన కోసం స్థాపించిన పార్టీ.. అవినీతి కేసులో అరెస్ట్‌ అయిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడం చాలా మంది ఫ్యాన్స్‌, కార్యకర్తలకు నచ్చలేదు. కొందరు బహిరంగంగా విమర్శలు చేస్తుండగా.. పొత్తు నచ్చని వాళ్లు జనసేన పార్టీ నుంచి బయటకు వచ్చేస్తున్నారు. ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్ది జనసేన కేడర్‌లో అసంతృప్తి పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు. ఈ క్రమంలో జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌.. కార్యకర్తలను ఉద్దేశిస్తూ ఓ లేఖ విడుదల చేశాడు. పొత్తులపై మాట్లాడితే ఖబడ్దార్‌ అంటూ పరోక్షంగా వార్నింగ్‌ ఇచ్చాడు.

లేఖలో పవన్‌ కళ్యాణ్‌.. ‘‘పొత్తులకు విఘాతం కలిగించే వారిని ప్రజలు గమనించకపోరు’’ అంటూ జనసేన నేతలను ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేసే ప్రయత్నం చేశారు అంటున్నారు రాజకీయ పండితులు. రాష్ట్ర ప్రయోజనాలు, సమగ్ర అభివృద్ధి, ప్రజాసంక్షేమం పొత్తుకు కారణాలంటూ పెద్ద పెద్ద పదాలు వాడిన పవన్‌కళ్యాణ్.. పొత్తులో భాగంగా తాను చంద్రబాబు నాయుడికి చేస్తోన్న బానిసత్వం గురించి ఎక్కడా ప్రశ్నించలేదు. జనసేన కార్యకర్తలు, ఫ్యాన్స్‌ పవన్‌ సీఎం కావాలని ఆశిస్తున్నా.. ఆయన మాత్రం దానిపై నోరు మెదపడం లేదు.. పైగా చంద్రబాబే సీఎం అన్న వ్యాఖ్యలని కూడా వ్యతిరేకించకపోవడం జనసేన కార్యకర్తలని తీవ్ర అసంతృప్తికి గురి చేస్తోంది.

అంతేకాక అవినీతి, అక్రమాలను ప్రశ్నించడానికే పార్టీ పెట్టానని చెప్పుకునే పవన్‌ కళ్యాణ్ తన నిర్ణయాలు, సిద్ధాంతాల గురించి సొంత పార్టీలో వారు ప్రశ్నిస్తే మాత్రం తట్టుకోలేకపోతున్నారు‌. జగన్‌ను పదేపదే నియంత అంటూ సంబోధించే పవన్ కళ్యాణ్.. తన పార్టీలో మాత్రం ఒంటెద్దు పోకడలు పోతూ, తాను చెప్పినట్టు మాత్రమే నడుచుకోవాలంటూ జనసైనికులను బానిసలుగా చూస్తున్నారని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తన నిర్ణయాలను ప్రశ్నించే వారు.. పార్టీలో ఉండాల్సిన అవసరం లేదంటూ డైరెక్ట్‌గానే చెప్పడం గమనిస్తే.. అసలు నియంత ఎవరో జనాలకు బాగా అర్థం అవుతుంది అంటున్నారు.

ఇప్పటికే మెజారిటీ జనసేన కేడర్‌ పొత్తుపై అసంతృప్తిగా ఉంది.. అలానే సీట్ల సర్దుబాటు విషయంలో టీడీపీ చేస్తోన్న రాజకీయాలు, కుట్రలను వారు జీర్ణించుకోలేకపోతున్నారు. రెండు పార్టీలు పొత్తులో వెళ్తున్న కూడా.. అనేక ప్రాంతాల్లో టీడీపీ కార్యకర్తలు జనసేన ఫాలోవర్స్‌ను పట్టించుకోవడం లేదు.. వారిని కేవలం తమ విజయానికి పని చేసే వారిగానే పరిగణిస్తున్నారు. ఈ పరిణామాలపై జనసేనలోని చిన్నా, పెద్దా నేతలు గుర్రుగా ఉన్నారు. బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎన్నికల వేళ ఇలాంటి పరిణామాలు కూటమికి దెబ్బ అని భావించిన పవన్‌కళ్యాణ్‌ దీనిపై స్పందిస్తూ.. కేడర్‌కు వార్నింగ్‌ ఇచ్చాడు.

ఇలాంటి విషయాలు ఏమైనా ఉంటే బహిరంగంగా మాట్లాడొద్దని, తన పీఏకి చెబితే.. అతనొచ్చి తనకు చెప్తాడని.. అప్పుడు ఆయన దాని గురించి ఆలోచిస్తాను అంటూ లేఖలో రాసుకొచ్చాడు పవన్‌ కళ్యాణ్‌. అంతేకాక పొత్తుల గురించి మీరు ఏం మాట్లాడినా.. ఏం చేసినా ప్రజలు గమనించి మీకు తగిన శాస్తి చేస్తారంటూ అర్థాలు వచ్చేలా ప్రెస్‌నోట్లు రిలీజ్ చేయడం.. జనసేన నాయకులను మరింత ఆగ్రహానికి గురి చేస్తుంది. ఎన్నికలు సమీపించే నాటికి ఈ అసంతృప్తులు మరింత పెరిగి.. పార్టీకి భారీ నష్టం చేకూరుస్తాయని అంటున్నారు రాజకీయ పండితులు.

Show comments