Dharani
Dharani
ఎన్నికల ముందు తెలంగాణ బీజేపీలో ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా కాషాయ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు బయటకు వస్తున్నాయి. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తీరుపై మిగతా నేతలు అసంతృప్తిగా ఉన్న సంగతి తెలిసిందే. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు బండి సంజయ్‌పై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా తెలంగాణ బీజేపీలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో బండి సంజయ్ ఢిల్లీకి వెళ్లారు. మంగళవారం ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో భేటీ అయ్యారు. అనంతరం బీజేపీ అధ్యక్ష పదవికి తను రాజీనామా చేసినట్లు బండి సంజయ్ ప్రకటించారు. తదుపరి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని నియమించారు. బండి సంజయ్‌కు ఇతర బాధ్యతలు అప్పగిస్తామని హామీ ఇచ్చారు.
బండి సంజయ్ 2020లో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నారు. బండి సంజయ్ ఆధ్వర్యంలోనే కాషాయ పార్టీ.. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో విజయం సాధించింది. అలానే మునుగోడు ఉప ఎన్నికలో కూడా బీజేపీ.. బీఆర్ఎస్‌కు గట్టి పోటీ ఇచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కూడా బండి సంజయ్ నాయకత్వంలోనే ముందుకెళ్లారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కూడా బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది. అయితే గత కొద్ది రోజులుగా బీజేపీలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. బండి సంజయ్‌పై పలువురు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తోన్న సంగతి తెలిసిందే.
దీనిపై విస్త్రృతంగా చర్చించిన తర్వాత అధిష్టానం.. అందరికీ అమోదయోగ్యంగా ఉండే కిషన్ రెడ్డి వైపు మొగ్గుచూపినట్టు తెలుస్తోంది. సుదీర్ఘ కాలం పాటు రాజకీయాల్లో ఉన్న కిషన్ రెడ్డి.. ఉమ్మడి రాష్ట్రంలో కూడా బీజేపీ అధ్యక్షుడిగా వ్యవహరించారు. దాంతో ప్రస్తుత పరిస్థితిలో.. కిషన్‌రెడ్డికి పగ్గాలు అప్పగించి ఈ సంక్షోభం నుంచి బయటపడాలని పార్టీ భావిస్తోంది. ఎన్నికలు సమిస్తోన్న తరుణం కనుక.. కేడర్‌ని సిద్దం చేసే బాధ్యతను కూడా కిషన్ రెడ్డికి అప్పగించనున్నారు పార్టీ పెద్దలు.
అంతేకాక గత కొన్ని రోజులుగా రఘునందన్ రావు, ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి సీనియర్ నేతలు.. పార్టీ కార్యకలాపాల్లో సరిగా పాల్గొనకపోవడం మాత్రమే కాక.. ఢిల్లీకి వెళ్లి కేంద్ర పెద్దలకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.బండి సంజయ్‌ని త్వరలో కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉంది.అటు ఏపీలో కూడా బీజేపీ అనూహ్య నిర్ణయం తీసుకుంటోంది. ప్రస్తుత అధ్యక్షుడు సోము వీర్రాజును మార్చాలని చాలాకాలంగా ఫిర్యాదులున్నాయి. గతంలో అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణను మార్చి.. సోమును అధ్యక్షుడిగా నియమించారు.
అయితే సోము వైసీపీకి దగ్గరగా ఉంటూ ప్రభుత్వ వ్యతిరేకతను బలంగా జనాల్లోకి తీసుకెళ్లడం లేదన్న బావన కేడర్‌లో ఉంది. దాంతో ఆధిష్టానం ఆయనను మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా వీర్రాజు మాట్లాడుతూ.. ‘‘మీ టర్మ్ అయిపోయింది.. మిమ్మల్ని తప్పిస్తున్నాం.. రాజీనామా చేయాలి’’ అని నడ్డా తనకు సూచించినట్లు వీర్రాజు స్వయంగా తెలిపారు. సోము వీర్రాజు 2020 జులై 27 నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.