Dharani
ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా ఆయన ఘాట్ వద్ద బాలయ్య ప్రవర్తన చూసిన ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. అన్న కొడుకుపై ఇంత కోపం దేనికి అని చర్చించుకుంటున్నారు. ఆ వివరాలు..
ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా ఆయన ఘాట్ వద్ద బాలయ్య ప్రవర్తన చూసిన ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. అన్న కొడుకుపై ఇంత కోపం దేనికి అని చర్చించుకుంటున్నారు. ఆ వివరాలు..
Dharani
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఎన్టీఆర్ ఘాట్ సాక్షిగా.. నందమూరి కుటుంబంలో విభేదాలు బయటపడ్డాయి. ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా గురువారం నందమూరి కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకుని నివాళులు అర్పించారు. ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు.. ఘాట్ వద్ద భారీ ఎత్తున తారక్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అంతేకాక సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. కానీ ఎన్టీఆర్ మాత్రం మౌనంగా ఉన్నారు.
ఇక ఇంతలో అక్కడకు వచ్చిన బాలయ్య.. జూనియర్ ఫ్లెక్సీలు చూసి తీవ్ర అసహనానికి గురయ్యారు. వెంటనే వాటిని తీసేయ్ అంటూ తన పక్కన ఉన్న వ్యక్తిని ఆదేశించాడు. దాంతో తారక్ ఫ్లెక్సీలను తొలగించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కాగా.. దీనిపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బాలయ్య ప్రవర్తన చూసిన వారు.. ఆశ్చర్యపోతున్నారు. సొంత అన్న కొడుకుపై బాలయ్యకు ఎందుకీ కోపం అని చర్చించుకుంటున్నారు. అయితే గత కొంత కాలంగా బాబయ్-అబ్బాయ్‌ల మధ్య గ్యాప్ ఉందనే ప్రచారం సాగుతోంది. పలు సందర్భాల్లో బాలయ్య ప్రవర్తన చూస్తే ఇది నిజమే అనిపించకమానదు. ప్రస్తుతం జూనియర్ తన ఫుల్ ఫోకస్ సినిమాల మీదనే పెట్టాడు. రాజకీయాలకు దూరంగా ఉంటున్నాడు.
తారక్ పాలిటిక్స్‌కు దూరంగా ఉంటున్నా.. ఆయన అభిమానులు మాత్రం ఊరుకోవడం లేదు. సందర్భం దొరికిన ప్రతి సారి.. జూనియర్ ఎన్టీఆర్ కాబోయే సీఎం అంటూ నినాదాలు చేస్తూ.. జెండాలు, ఫ్లెక్సీలు ప్రదర్శిస్తున్నారు. అంతేకాక కేవలం జూనియర్ అభిమానులు మాత్రమే కాక.. టీడీపీ కార్యకర్తలు కూడా తారక్ రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారు.
అయితే కేడర్ ఎంత ఆశించినా.. తారక్ రావడం వల్ల టీడీపీకీ లాభం ఉంటుందని తెలిసినా సరే చంద్రబాబు నాయుడు మాత్రం.. ఆ దిశగా ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. అసలు తారక్ టీడీపీలోకి రావడం ఆయనకు ఎంతమాత్రం ఇష్టం లేదనే టాక్ ఎప్పటి నుంచో వినిపిస్తోంది. అందుకు కారణం జూనియర్ టీడీపీలో చేరితే.. తన కుమారుడు లోకేష్‌ని వారసుడిగా చేయలేరు.
గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు లోకేష్ మంత్రిగా చేసినా.. ఇప్పుడు యువగళం పేరుతో పాదయాత్ర చేసినా.. ఇప్పటికి కూడా చాలా మంది టీడీపీ కార్యకర్తలు చంద్రబాబు వారసుడిగా లోకేష్‌ని అంగీకరించలేకపోతున్నారు. దాని బదులు తారక్‌ను పార్టీలోకి ఆహ్వానించి.. కీలక బాధ్యతలు అప్పగిస్తే.. టీడీపీకి ఎంతో మేలు జరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్‌ని పార్టీలోకి తీసుకురావాలని డిమాండ్ కూడా చేస్తున్నారు.
అయితే చంద్రబాబు, ఆయన వియ్యంకుడు బాలకృష్ణకు ఇది ఎంత మాత్రం ఇష్టం లేదు. జూనియర్ పార్టీలోకి వస్తే.. లోకేష్ కనుమరుగు కావాల్సి వస్తుంది.. లేదంటే తారక్ వెనక నిలబడాల్సి వస్తుంది అనే ఉద్దేశంతోనే వారు.. ఇలా జూనియర్‌పై అక్కసు వెళ్లగక్కుతున్నారని అంటున్నారు రాజకీయ పండితులు. లోకేష్ భవిష్యత్తు కోసం పార్టీని పణంగా పెట్టడానికి కూడా రెడీ అవుతారు తప్ప.. తారక్‌ని మాత్రం ఎదగనివ్వరు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అందుకే ఇలా సందర్భం దొరికిన ప్రతి సారి తమ అక్కసు వెళ్లగక్కుతుంటారని.. కానీ దీని వల్ల టీడీపీకే నష్టం తప్ప.. తారక్‌కు ఓరిగేది ఏం లేదని చెప్పుకొస్తున్నారు.
ఇక తారక్ మాత్రం ప్రస్తుతం తన దృష్టి అంతా సినిమాల మీదనే పెట్టాడు. రాజకీయాలకు చాలా దూరంగా ఉంటూ.. తన పనేదో తాను చేసుకుంటూ పోతున్నాడు. విజయవాడలో హెల్త్ వర్సిటీకి ఎన్టీఆర్ పేరు మార్పు, అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాలపై చంద్రబాబు కంటతడి పెట్టిన సమయంలో, చంద్రబాబు అరెస్ట్ సమయంలోనూ తారక్ స్పందించలేదు. అయితే చంద్రబాబు అరెస్ట్‌పై జూనియర్ స్పందించకపోవడంపై బాలయ్య రియాక్ట్ అవుతూ.. ఐ డోంట్ కేర్ అంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.