iDreamPost
iDreamPost
తామంతా ప్రజాప్రతినిధులమని గొప్పలు చెప్పుకున్నారు. రానున్నది తమ ప్రభుత్వమేనని భావించారు. తీరా పార్టీ అధికారం చేపట్టాకా ఇక తమకు ఎదురులేదని తెగ సంబరపడిపోయారు. తాజాగా జరుగుతున్న పరిణామాలతో ఢీలా పడిపోయారు.
రాయలసీమలోని జిల్లాల్లో ఇప్పుడు నేతల పరిస్థితి అయోమయంగా ఉందంట. కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో చాలా మంది కింది స్థాయి నేతలు సర్పంచ్, ఎంపిటిసి, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటే వచ్చిన రిజర్వేషన్లు తంటాలు తెచ్చిపెట్టాయి. 2014లో పార్టీ అధికారంలో లేనప్పటికీ పార్టీకోసం కష్టపడి పనిచేశారు. 2019లో విజయం సాధించే వరకు గ్రామాల్లో మండలాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు కష్టపడ్డారు. అయితే ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినా రిజర్వేషన్లను చూసి కంగుతిన్నారు. తమ సామాజిక వర్గానికి కాకుండా ఇతరులకు రిజర్వేషన్లు రావడంతో ఏం చేయలేని దిక్కుతోచని స్తితిలో పడిపోయారంట ఇప్పుడు నేతలంతా.
అనంతపురం, కడప జిల్లాల్లో ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో ఇదే టాపిక్ నడుస్తోంది. కర్నూలు జిల్లాలో మొత్తం 54 మండలాలు, కడప జిల్లాలో 51 మండలాలు, అనంతపుతరం జిల్లాలో 63 మండలాలు ఉన్నాయి. ఈ మండలాల్లో మొత్తం గ్రామ పంచాయతీలు, ఎంపిటిసి, జెడ్పీటీల రిజర్వేషన్లలో చాలా వరకు ఊహించని విధంగా వచ్చాయి. బీసీలు ఆశించినచోట ఎస్సీలకు, ఇతరులు ఆశించిన చోట బీసీలకు రిజర్వేషన్లు వచ్చాయి. దీంతో తీవ్ర మనోవేధనకు నేతలు గురవుతున్నారు. రెడ్డి సామాజిక వర్గం పోటీ పడిన చోట బీసీలకు రిజర్వేషన్లు వచ్చాయి. ఎలాగైనా ఎంపీపీ పదవి దక్కించుకోవాలనుకున్న చోట ఎస్సీలకు రిజర్వేషన్లు వచ్చాయి. దీంతో చేసేదేమీ లేక దిగువ స్థాయి నేతలంతా తలలుపట్టుకుంటున్నారు. ఇన్నాళ్లు కష్టపడి పనిచేసిన పార్టీలో ఎవరో అధికారం చెలాయించే పరిస్థితి వచ్చిందని పెద్ద నాయకుల వద్ద ఆవేధన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. చేసేదేమీ లేక రిజర్వేషన్లప ప్రకారమే ఇప్పుడు కూడా స్థానిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు మానసికంగా సిద్ధమవుతున్నారు.