iDreamPost
iDreamPost
స్థానిక సమరం వేడెక్కింది. పార్టీలన్నీ తలమునకలై ఉన్నాయి. క్షేత్రస్థాయిలో పట్టుకోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ విషయంలో అధికార పార్టీ ముందంజలో ఉన్నట్టు కనిపిస్తోంది. ఓవైపు పాలకపగ్గాలు , దానికితోడు ముందస్తుగా చేసిన సన్నాహాలు కూడా కలిసి వస్తున్నాయి. ఇక సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల్లో మరింత ఆదరణ పెరిగిందని భావిస్తున్న వైఎస్సార్సీపీ నేతలు ఉత్సాహం గా కదులుతున్నారు. అనేక చోట్ల ఎంపీటీసీ, సర్పంచ్ పదవులను ఏకగ్రీవంగా కైవసం చేసుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఇక కీలకమైన జిల్లా పరిషత్ పీఠాలను సంపూర్ణంగా దక్కించుకోవాలనే సంకల్పంతో ఉన్నట్టు కనిపిస్తోంది. దానికి తగ్గట్టుగానే ఇప్పటికే వివిధ జిల్లాల్లో పార్టీ విజయం సాధిస్తే ఎవరికి అవకాశం ఇవ్వాలనేది అధినేత దాదాపుగా ఖాయం చేసినట్టు చెబుతున్నారు.
పరోక్ష పద్దతిలో జరుగుతున్న ఎన్నికల్లో ఫలితాల తర్వాత మేయర్, జెడ్పీ చైర్మన్ విషయం తేలుద్దామని జగన్ ఇప్పటికే స్పష్టం చేశారు. కానీ ఆయా జిల్లాల్లో ఉన్న పరిస్థితుల రీత్యా ఇప్పటికే ఈ విషయంలో అధిష్టానం స్పష్టతకు వచ్చినట్టు కనిపిస్తోంది. ఫలితాలు వచ్చిన వెంటనే చైర్ పర్సన్ ఎంపిక చేయాల్సి ఉండడంతో ఆలశ్యం జరగకుండా ముందుగానే ఆయా రిజర్వేషన్ల ఆధారంగా తగిన నేతలను ఎంపిక చేయాలని జగన్ ఆదేశించినట్టు తెలుస్తోంది. దాంతో జోన్ల వారీగా ఇన్ఛార్జులుగా ఉన్న నేతలు చేసిన సూచనలతో జెడ్పీ పీఠాలు ఖరారయినట్టు ప్రచారం సాగుతోంది. జాప్యం చేయకుండా నిర్ణయాలు తీసుకునే లక్షణం ఉన్న నేతగా గుర్తింపు ఉన్న జగన్ ఈసారి జెడ్పీ విషయంలో కూడా అలాంటి వైఖరి తీసుకోవడంతో ఊహాగానాలకు పెద్దగా అవకాశం లేని పరిస్థితి ఏర్పడుతోంది.
పార్టీగా క్షేత్రస్థాయి నిర్మాణం పై పెద్దగా శ్రద్ధపెట్టని జగన్, ఈ స్థానిక సంస్థల ఫలితాల ద్వారా అలాంటి లోటుని పూడ్చుకునే పనిలో ఉన్నట్టు కనిపిస్తోంది. స్థానిక ప్రజా ప్రతినిధులే ఆ తర్వాత పార్టీకి పెద్ద దిక్కుగా చేసుకుని ముందుకు సాగే యోచనలో ఉన్నట్టు కనిపిస్తోంది. అందుకు అనుగుణంగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక అంచనాల ప్రకారం ఈ రేసులో ముందున్న వారి వివరాలిలా ఉన్నాయి.
కడప సీఎం సొంత జిల్లా కావడంతో పాటుగా పార్టీకి బలమైన పునాదులున్న ఈ జెడ్పీ పీఠం దాదాపుగా వైఎస్సార్సీపీకే ఖాయం. మొన్నటి ఎన్నికల్లో రాజంపేట ఎమ్మెల్యే టికెట్ త్యాగం చేసిన ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డిని దాదాపుగా జెడ్పీ చైర్మన్ రేసులో ముందున్నారు
టీడీపీ కి రాజీనామా చేసిన పులివెందుల సతీష్ రెడ్డి నేడు వైసీపీలో చేరుతాడని ప్రచారం జరుగుతుంది. సతీష్ రెడ్డి కి కడప జిల్లా పరిషత్ చైర్మన్ పదవి ఇస్తారని ఊహాగానాలు ఉన్నాయి.
అమర్నాథ్ రెడ్డి,సతీష్ రెడ్డిలతో ఒకరికి జడ్పీ చైర్మన్ ఖాయం.
కర్నూల్ జెడ్పీ పీఠంపై కూడా అధికార పార్టీ కన్నేసింది. దాదాపుగా విజయం ఖాయమనే ధీమాతో ఉంది. జెడ్పీ చైర్మన్ గా ఎర్రబోతుల వెంకటరెడ్డి కి లైన్ క్లియర్ గా కనిపిస్తోంది. ఆది నుంచి పార్టీలో ఉన్న వెంకటరెడ్డి రెండు దఫాలుగా ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నించారు. సమీకరణాల కారణంగా అవకాశం రాకపోయినా నిరాశ చెందకుండా పార్టీని అంటిపెట్టుకొని ఉండటంతో ఛైర్మన్ పదవి వరించబోతోంది.
మొదటి జనరల్ మహిళా కు రిజర్వ్ కావటంతో ఎస్వీ మోహన్ రెడ్డి తన శ్రీమతి విజయమానోహరి కోసం ప్రయత్నం చేశారు. జగన్ కూడా అంగీకరించినట్లు ప్రచారం జరిగింది. రిజర్వేషన్ ఇప్పుడు జనరల్ కు మారటంతో ఎమ్మెల్యే గా పనిచేసిన తానూ జడ్పీ చైర్మన్ గా పోటీపడటం లేదని ఎస్వీ మోహన్ రెడ్డి తన అనుచరులవద్ద చెప్పబుతున్నారు.
అనంతపురం బీసీ మహిళ కు రిజర్వ్ అయ్యింది. ఇక్కడ అవకాశం కదిరి ఎమ్మెల్యే సీటు ఆశించి భంగపడిన జక్కల ఆదిశేషు కుటుంబానికేనని చెబుతున్నారు. పారిశ్రామికవేత్త కూడా అయిన ఆదిశేషు విషయంలో జగన్ సానుకూలంగా ఉండడంతో ఆయన సతీమణికి జెడ్పీ పీఠం కట్టబెట్టబోతున్నట్టు చెబుతున్నారు.
చిత్తూరు జెడ్పీ చైర్మన్ గిరీని బీసీలకు కట్టబెట్టే యోచనలో జగన్ ఉన్నట్టు చెబుతున్నారు. పార్టీ పరంగా 34 శాతం సీట్లు కట్టబెడతామని చెప్పిన మాటకు అనుగుణంగా కీలకమైన ఈ జెడ్పీ పీఠం జనరల్ అయినప్పటికీ బీసీలకే అవకాశం అంటున్నారు. అదే జరిగితే పలమనేరు నియోజకవర్గానికి చెందిన , గౌడ సామాజిక వర్గం నేత శ్రీనివాసులు అలియాస్ వాసు కు లైన్ క్లియర్ కానుంది. ఈ జెడ్పీ పీఠంపై ధనుంజయరెడ్డి కూడా ఆశ పెట్టుకున్నప్పటికీ పార్టీలో మొదటి నుంచి ఉండడం, బీసీలకు అవకాశం ఇవ్వాలనే కోణంలో వాసుకి ఛాన్సివ్వబోతున్నట్టు సమాచారం.
నెల్లూరు జడ్పీ చైర్మన్ గా ఆనం విజయ్ కుమార్ రెడ్డి కుటుంబానికి అవకాశం కట్టబెట్టడం ఖాయంగా చెప్పవచ్చు . సొంత బ్రదర్స్ అంతా జగన్ కి వ్యతిరేకంగా ఉన్న సమయంలో వారిని ధిక్కరించి జగన్ వెంట నడిచిన విజయ్ కుమార్ రెడ్డికి ఎమ్మెల్సీ గా అవకాశం ఇస్తానని జగన్ ప్రకటించారు. కానీ ప్రస్తుతం అలాంటి అవకాశం లేకపోవడంతో జెడ్పీ పీఠం కట్టబెట్టి మాట నిలబెట్టుకునే యోచనలో ఉన్నట్టు స్పష్టం అవుతోంది. ఇక్కడ మాజీ జెడ్పీ చైర్మన్ గా కూడా అనుభవం ఉన్న కాకాణి గోవర్థన్ రెడ్డి కుటుంబం నుంచి గట్టి పోటీ ఉంది. ఎమ్మెల్యేగా ఉన్న కాకాణి కుటుంబానికి కాకుండా ఆనం విజయ్ కుమార్ రెడ్డి కుటుంబం నుంచి జిల్లా పరిషత్ పీఠం దక్కించుకోవడం అనివార్యం అని చెబుతున్నారు.
ప్రకాశం జిల్లా వ్యవహారం స్పష్టంగా కనిపిస్తోంది. జడ్పీ చైర్ పర్సన్ సీటుని బూచేపల్లి కుటుంబానికి కట్టబెట్టడానికి అంతా సిద్ధమయ్యింది. వైఎస్సార్సీపీ విజయం ఖాయంగా ఉంది. దాంతో దర్శి మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి తల్లి బూచేపల్లి వెంకాయమ్మ కి అవకాశం ఇవ్వబోతున్నట్టు ఇప్పటికే పార్టీ వర్గాలు తేల్చిచెబుతున్నాయి. జెడ్పీ పీఠం జనరల్ అయితే శివకు అవకాశం ఉంటుందని అంచనా వేసినప్పటికీ జనరల్ మహిళ కావడంతో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేనందుకు ప్రతిఫలంగా జగన్ ఆయన కుటుంబానికి జెడ్పీ పీఠం అందించేందుకు సముఖత వ్యక్తం చేసినట్టు కనిపిస్తోంది.
గుంటూరు జడ్పీ పీఠం ఎస్సీ మహిళకి రిజర్వ్ అయ్యింది. ఈ జిల్లాలో పోటీ తీవ్రంగా ఉంటుందని భావిస్తున్నారు. అధికార పార్టీ ప్రస్తుతానికి ముందంజలో ఉంది. జెడ్పీ అవకాశం వస్తే తాడికొండ నుండి ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డ క్రిస్టినాకు ఛాన్స్ ఖాయంగా కనిపిస్తోంది. పోటీ ఉన్నప్పటికీ అధినేత ఆశీస్సులు పుష్కలంగా ఉండడంతో క్రిస్టినా దానికి అనుగుణంగా సన్నాహాలు చేసుకుంటున్నారు.
నిన్న వైసీపీ లో చేరిన డొక్కా మాణిక్య వరప్రసాద్ కూతురికి కూడా అవకాశాలు ఉన్నాయి.
కృష్ణా జిల్లాలో కూడా జనరల్ ఉమెన్ రిజర్వుడు సీటులో బీసీ మహిళకు అవకాశం ఇచ్చేందుకు సన్నద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది. అదే జరిగితే పెడన టికెట్ ఆశించిన ఉప్పాల రాం ప్రసాద్ కుటుంబానికి దక్కవచ్చని భావిస్తున్నారు. జనరల్ ఉమెన్ కి కేటాయించాలని నిర్ణయిస్తే మాత్రం కాపు సామాజికవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే దుట్టా రామచంద్రరావు కుమార్తెకి అవకాశం ఉంటుందని అంచనా. ఇందులో దుట్టా కుమార్తె , ప్రస్తుతం వైఎస్సార్సీపీ డాక్టర్స్ వింగ్ అధ్యక్షుడిగా ఉన్న డాక్టర్ గోసుల శివభరత్ రెడ్డి భార్య కావడంతో ఆమెకు కలిసి వచ్చే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. ఒకవేళ బీసీ ఉమెన్ కి చైర్ పర్సన్ ఇస్తే దుట్టా కుటుంబానికి వైస్ చైర్మన్ షిప్ అయినా ఖాయంగా కనిపిస్తోంది.
పశ్చిమ గోదావరి జెడ్పీ చైర్మన్ బీసీ జనరల్ రిజర్వ్ అయ్యింది. ఇక్కడ రేసులో కవురు శ్రీనివాస్ ముందున్నారు. ఆయనకు ఇప్పటికే డీసీసీబీ పీఠం దక్కింది. అయినప్పటికీ గతంలో ఆచంట టికెట్ ఆశించిన కవురు శ్రీనివాస్ ప్రస్తుతం యలమంచిలి నుంచి జెడ్పీటీసీగా బరిలో ఉన్నారు. ఆయనకు చైర్మన్ పదవి ఖాయంగా చెబుతున్నారు. జగన్ ఆయనకు లైన్ క్లియర్ చేసినట్టు ప్రచారం సాగుతోంది.
తూర్పు గోదావరి ఛైర్మన్ రేసు చర్చనీయాంశం అవుతోంది. ఎస్సీ రిజర్వుడు కోటాలో ముగ్గురు ప్రయత్నాల్లో ఉన్నారు. వారిలో ఒకరు ఇరిగేషన్ మాజీ ఈఈ విప్పర్తి వేణుగోపాల్. పి గన్నవరం నుంచి 2014లో బరిలో దిగిన ఆయన 2019లో ఛాన్స్ దక్కించుకోలేకపోయారు. ఆయనకు జెడ్పీ పీఠం ఇవ్వాలనే ఆలోచన ఉంది. అయితే మాజీ ఎంపీ పండుల రవీంద్రబాబు పేరు ప్రతిపాదనలోకి వచ్చినప్పటికీ ఆయన సుముఖంగా లేరని సమాచారం. ఇక మంత్రి పినిపే విశ్వరూప్ తనయుడు కృష్ణారెడ్డి కూడా అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు.
విశాఖ జడ్పీ పీఠం ఖాయం అయిపోయింది. దానికి అనుగుణంగానే మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు వైఎస్సార్సీపీ కండువా కూడా కప్పుకున్నారు. ఎస్టీ మహిళ రిజర్వ్ అయిన ఈ స్థానంలో ఆయన కుమార్తెకి అవకాశం ఇవ్వబోతున్నారు.
విజయనగరం జనరల్ కు కేటాయించారు. అయినప్పటికీ బీసీలకే అవకాశం దక్కబోతోంది. దాంతో మంత్రి బొత్సా మాటకే ప్రాధాన్యత ఉంటుందని సమాచారం. అదే జరిగితే మంత్రి సమీప బంధువు చిన్న శ్రీను జెడ్పీ ఛైర్మన్ కావడం ఖాయంగా కనిపిస్తోంది .
శ్రీకాకుళం జెడ్పీ పీఠం జనరల్ మహిళకు రిజర్వ్ అయ్యింది. దాంతో చాలాకాలంగా పార్టీలో ఉన్న వరుదు కళ్యాణి ప్రయత్నాల్లో ఉన్నారు. అదే సమయంలో మొన్నటి సాధారణ ఎన్నికల్లో ఎంపీగా ఓటమి పాలయిన దువ్వాడ శ్రీనివాస్ సతీమణికి ఛాన్స్ ఇవ్వబోతున్నట్టు ప్రచారం సాగుతోంది. దాంతో ఈ ఇద్దరిలో ఒకరికి అవకాశం ఖాయంగా చెప్పవచ్చు.
మొత్తంగా జెడ్పీ పీఠాలపై జగన్ ఇప్పటికే స్పష్టతకు వచ్చేసిన తరుణంలో పెద్దగా రాయబారాలకు అవకాశం లేనట్టేనని చెబుతున్నారు. 13కి 13 గెలుచుకోవాలనే పట్టుదలతో ఉన్న పార్టీ సామాజిక సమీకరణాలకు తగ్గట్టుగా వ్యవహరిస్తుండడంతో వ్యవహారం ఆసక్తిగా మారుతోంది.