iDreamPost
iDreamPost
గతంలో చిన్న చిన్న పథకాలను కూడా పెద్ద మొత్తంలో అవినీతికి పాల్పడిన ఉదంతాలు ఉన్నాయి. అవినీతి లేకుండా పథకాల అమలు అసలు సాధ్యమేనా అనే సందేహాలు కనిపించేవి. కానీ ప్రస్తుతం వివిధ పథకాలలో కనిపిస్తున్న పారదర్శకత గమనిస్తే పెద్ద మార్పు ఖాయంగా కనిపిస్తోంది. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్దిదారులకు ప్రయోజనం కలిగిస్తున్న తీరు విశేషంగా మారుతోంది. అర్హులకు అందలేదని గానీ, అనర్హులకు కేటాయించారని కూడా ఇప్పటి వరకూ ఆరోపణలు రాలేదంటే ఆశ్చర్యమే. ఇప్పటికే వరుసగా వివిధ పథకాలు అమలు చేస్తున్నారు. ఏడాది దాటినా స్కీములలో స్కాములు లేకపోవడం విశేషంగానే చెప్పవచ్చు.
గతంలో ఏదయినా పథకం లబ్ది పొందాలంటే దళారుల పాత్ర చాలా ఎక్కువగా కనిపించేది. గత ప్రభుత్వ హయంలో జన్మభూమి కమిటీలను సంతృప్తి పరిస్తేనే ప్రయోజనం చేతికి దక్కేది. కానీ ప్రస్తుతం పూర్తిగా గ్రామ సచివాలయాల ద్వారా ఎంపిక చేయడం, వారి జాబితాను బహిరంగంగా ప్రకటించడం, అభ్యంతరాలు, మిగిలిపోయిన అర్హులను వెంటనే చేర్చడం వంటి చర్యలకు పూనుకుంటున్నారు. తద్వారా ప్రభుత్వ నుంచి అందుతున్న సహాయం పూర్తిగా లబ్దిదారులకు చేరేందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అంతా ఆన్ లైన్ లో బ్యాంక్ అకౌంట్ల ద్వారానే నగదు బదిలీ జరుగుతుండడంతో మధ్యవర్తులకు అవకాశం లేకుండా పోతోంది. చివరకు అమ్మ ఒడి వంటి పథకాన్ని కూడా ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలకు ఛాన్సివ్వకుండా తల్లుల ఖాతాలో సొమ్ములు వేయడం పెద్ద మార్పుగానే భావించాలి.
తాజాగా వాహన మిత్ర పథకంలో గత ఏడాది కొందరు అర్హులు వివిధ కారణాలతో ప్రయోజనం దక్కలేదని ప్రభుత్వం గుర్తించింది. ఇప్పుడు ఏడాది నిండి వారం రోజులు కూడా గడవకముందే వారికి రెండో విడత నగదు జమ చేయడం విశేషం. ఆ సందర్భంగా అదనంగా పలువురు లబ్దిదారులను చేర్చి, వారికి కూడా సహాయం అందించడం అందరినీ ఆకట్టుకుంటోంది. ఏ నాయకుడి వెంట తిరగాల్సిన అవసరం లేకుండా, ఎవరిని మెప్పించే పని లేకుండా, అర్హత ప్రతీ ఒక్కరికీ పార్టీలు, ప్రాంతాలు, ఇతర ఎటువంటి వాటితో ప్రమేయం లేకుండా లబ్ది చేకూరడంతో ప్రభుత్వ లక్ష్యాలు సామాన్యులకు చేరుతున్నట్టు కనిపిస్తోంది. వ్యవస్థలో పెద్ద మార్పునకు ఇది దోహదం చేస్తుందనే చర్చ కూడా మొదలయ్యింది. గ్రామ, నియోజకవర్గ స్థాయి నేతల పెత్తనంతో పని లేకుండా ప్రతీ పథకం నేరుగా దక్కించుకునే అవకాశం సామాన్యుడికి రావడం పెను మార్పులకు మూలం అవుతుందని నిపుణులు చెబుతున్నారు.
జగన్ ఆలోచనల నుంచి ఉద్భవించిన సచివాలయ వ్యవస్థ మరిన్ని కీలక పరిణామాలకు దోహదం చేసే దారిలో ఉండగా, పథకాల్లో అవినీతి గురించి కనీసం ప్రతిపక్షాలు ప్రస్తావించే అవకాశం కూడా లేకుండాపోతోంది. ఏడాది గడిచిన తర్వాత కూడా జగన్ ప్రభుత్వం మీద వేలెత్తి చూపడానికి విపక్షాలకు అవకాశం లేకపోవడం విశేషంగానే చెప్పాలి. ప్రతీ పథకాన్ని లబ్దిదారులకు నిజమైన మేలు చేసే దిశలో సాగుతున్న ప్రభుత్వ విధానం మరింత పగడ్బందీగా సాగితే వ్యవస్థలో అనూహ్యమైన పరిణామాలు చూడవచ్చని కూడా కొందరు అంచనా వేస్తున్నారు. ఈవిషయంలో కూడా జగన్ ప్రభుత్వం సామాన్యుడి మనసు గెలుచుకోవడంలో సక్సెస్ అయినట్టేనని చెప్పవచ్చు.