Idream media
Idream media
వైఎస్సార్‌సీపీ తరఫున రాజ్యసభకు వెళ్లబోయే పెద్దలు ఎవర్నది నేడు తేలే అవకాశం ఉంది. ఈ మేరకు ఆ పార్టీలో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. ఈ నెల 13వ తేదీతో నామినేషన్ దాఖలు గడువు ముగుస్తోంది. ఈ నెల 26వ తేదీన జరగబోయే రాజ్యసభ సభ్యుల ఎన్నికల్లో ఏపీ నుంచి నలుగురుకి అవకాశం ఉంది. ఆ నలుగురు వైఎస్సార్‌సీపీ తరఫునే రాజ్యసభలో అడుగుపెట్టనున్నారు.
తనను నమ్ముకున్న వారికి పెద్దపీట వేస్తారని పేరున్న జగన్.. ఆ కోవలోనే ఎన్నికల్లో ఓడిపోయిన మోపీదేవీ వెంకటరమణ, పిల్లి సుభాష్‌చంద్రబోస్‌లను శాసన మండలికి పంపి మంత్రిపదవులు ఇచ్చారు. మూడురాజధానులు, సీఆర్డీఏ బిల్లుల నేపథ్యంలో జరిగిన పరిణామాలతో శాసన మండలి రద్దు ప్రతిపాదన ఏపీ ప్రభుత్వం చేసింది. ప్రస్తుతం కేంద్రం వద్ద మండలి రద్దు వ్యవహారం ఉంది. మండలి రద్దు దాదాపు ఖాయమైన నేపథ్యంలో మోపీదేవి, పిల్లి సుభాష్ చంద్రబోస్‌లు పదవులు కోల్పోనున్నారు. వీరిని రాజ్యసభకు పంపించే ఆలోచనలో సీఎం జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పిల్లికి ఎక్కువ అవకాశాలు ఇచ్చిన నేపథ్యం, తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాజ్యసభ రేసులో మోపీదేవి ఒక్కరే నిలిచే అవకాశం ఉంది.
Read Also: సీఎం జగన్‌తో సుబ్బిరామిరెడ్డి భేటీ.. రాజ్యసభ కోసమేనా..?
ఇక రెండో సీటు.. పార్టీలో ఆది నుంచి ఉన్న ఆళ్ల ఆయోధ్య రామిరెడ్డికి ఇవ్వొచ్చన్న ప్రచారం గట్టిగా సాగుతోంది. వైఎస్సార్‌సీపీ వర్గాలు కూడా అయోధ్య పేరును బలంగా చెబుతున్నాయి. గత ఎన్నికల్లో నరసారావుపేట ఎంపీ సీటును వదులుకోవడంతోపాటు తన బావమరిది మోదుగుల వేణుగోపాల్ రెడ్డిని పార్టీలోకి తీసుకువచ్చారు. గుంటూరు ఎంపీగా పోటీ చేసిన మోదుగుల కోసం పని చేశారు. ఆ ఎన్నికల్లో మోదుగుల ఆరు వేల స్వల్ప ఓట్లతో ఓడిపోయారు.
కింగ్ కన్నా కింగ్ మేకర్ గొప్పవాడనే సూత్రం అంబానిది. తన ప్రతినిధులను ప్రతి చోటా ఉంచుతారు. గతంలో ఉత్తర భారత దేశ రాష్ట్రాల నుంచి నత్వానీని రాజ్యసభకు పంపిన ముకేష్ అంబానీ ఈ సారి దక్షిణ భారతదేశం నుంచీ.. అదీ ఏపీ ద్వారా తన ప్రతినిధిని పెద్దల సభకు పంపాలని భావిస్తున్నారు. ఈ మేరకు సీఎం జగన్‌నూ కలిశారు. పరస్పర ప్రయోజనాల నేపథ్యంలో పరిమల్ నత్వానీ అభ్యర్థిత్వాన్ని తటస్తుల జాబితాలో సీఎం జగన్ దాదాపు ఖరారు చేసినట్లే.
ఇక నాలుగో స్థానంపైనే పార్టీలో చర్చ సాగుతోంది. దీనిపై క్లారిటీ వచ్చిన మరుక్షణమే జాబితాను ప్రకటించనున్నారు. నాలుగో సీటుకై ఆశానువాహుల లిస్ట్ పెద్దదిగానే ఉంది. ఇటీవల పార్టీలో చేర్చుకున్న నెల్లూరు జిల్లా నేత బీద మస్తాన్ రావు పేరును పరిశీలిస్తున్నారు. గత ఎన్నికల్లో ఒంగోలు ఎంపీ సీటును వదులుకున్న వైవీ సుబ్బారెడ్డికి రాజ్యసభ సీటు హామీ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. అయితే ఆయన టీటీడీ చైర్మన్‌గా ఉండడం, తాజా రాజకీయ పరిస్థితుల్లో ఆయన అభ్యర్థిత్వం ఎంత మేరకు పరిశీలిస్తారన్నది ప్రశ్న. ఆది నుంచీ రాజ్యసభకు మైనార్టీ నేతను పంపాలని సీఎం జగన్ యోచిస్తున్నారు. గోకరాజు గంగరాజు పార్టీలో చేరిన సమయంలో ఆయన్ను రాజ్యసభకు పంపుతారన్న ప్రచారం సాగింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యం కాకపోవచ్చు. తాజాగా టి.సుబ్బిరామిరెడ్డి సీఎం జగన్‌ను కలవడంతో నాలుగో సీటు కోసం డిమాండ్ బాగానే ఉన్నట్లు చెప్పవచ్చు.