iDreamPost
android-app
ios-app

జగన్‌ సర్కార్‌ దూకుడు

జగన్‌ సర్కార్‌ దూకుడు

ప్రజా సంక్షేమంలో ఏపీలో జగన్‌ సర్కార్‌ దూసుకెళుతోంది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచీ నెలకో కొత్త పథకం, కార్యక్రమంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. ప్రజల సొమ్మును ప్రజలకే చేరుస్తూ దేశానికే ఆదర్శంగా నిలిస్తున్నారు. రైతులకు వైఎస్సార్‌ రైతు భరోసా, విద్యార్థుల తల్లులకు అమ్మ ఒడి, చేనేత కార్మికులకు వైఎస్సార్‌ నేతన్న హస్తం అందించిన జగన్‌ సర్కార్‌ ఈ నెలలో మరో కొత్త పథకం అమలుకు రంగం సిద్ధం చేస్తోంది.

ఎన్నికల మెనిఫెస్టోలో కాపులకు ఇచ్చిన హామీని అమలు చేసేందుకు జగన్‌ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. కాపుల సంక్షేమానికి ఏడాదికి రెండు వేల కోట్ల రూపాయలు చొప్పున ఐదేళ్లలో పదివేల కోట్లు ఇస్తామని జగన్‌ ఎన్నికల సభల్లో హామీ ఇచ్చారు. ఈ హామీ అమలులో భాగంగా కాపు కార్పొరేషన్‌ ద్వారా కాపు మహిళలకు ఆర్థిక సహాయం అందిచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కాపుల్లో 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు గల మహిళలకు ఏడాదికి 15 వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం ఇచ్చేందుకు ‘‘ వైఎస్సార్‌ కాపు నేస్తం’’ అనే పథకాన్ని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పథకంలో భాగంగా వైఎస్సార్‌ నవ శకం సర్వేలో లబ్ధిదారుల నుంచి వాలంటీర్లు దరఖాస్తులు స్వీకరించారు.

అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందించేందుకు ప్రభుత్వం వాలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను సమర్థంగా ఉపయోగిస్తోంది. రాష్ట్రంలో పేద, మధ్య తరగతి కాపులు (రేషన్‌ కార్డు ఉన్న వారు) దాదాపు 6 లక్షల మంది మహిళలకు కాపునేస్తం కింద ఆర్థిక సహాయం చేయాలని జగన్‌ సర్కార్‌ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే నవ శకం ద్వారా దాదాపు 2.30 లక్షల దరఖాస్తులు వచ్చాయి. అర్హత ఉన్న వారు ఎవరైనా దరఖాస్తు చేసుకోకపోతే గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం సూచించింది. వీరందరికీ ఈ నెలలో కాపు నేస్తం పథకం కింద ఒక్కొకరి ఖాతాలో 15 వేల రూపాయలు జమ చేయనుంది. ఇలా ఐదేళ్ల పాటు 75 వేల రూపాయలు వారికి అందించనుంది.