ఇప్పుడు జగన్ కు ఆ అవకాశం వచ్చింది

రెండేళ్ళ క్రితం తన చారిత్రాత్మక పాదయాత్ర ముగించి ఎన్నికల రణరంగానికి సిద్ధమవుతూ వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఒక ప్రకటన చేశారు. ఈ 2019 ఎన్నికల్లో కేంద్రంలో ఏ కూటమికి కూడా ఆధిక్యత రాకుండా, ప్రభుత్వ ఏర్పాటుకు తన పార్టీ మద్దతు కీలకం అయితే అప్పుడు తాను రాష్ట్ర అవసరాలకోసం గట్టిగ వత్తిడి చేయగలుగుతాను అన్నారు. నాకు 25 పార్లమెంటు స్థానాలు ఇవ్వండి, కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తాను అని కూడా అన్నారు.

అయితే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 22 పార్లమెంటు స్థానాలు ఇచ్చారు ప్రజలు. మరోవైపు ఎన్డీయేకు ఆధిక్యత ఇచ్చి అందులో బీజేపీకే 302 స్థానాలు ఇచ్చారు. దీంతో కేంద్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అవసరం బీజేపీకి లేకుండాపోయింది. ఈ పరిస్థితిపై పరిస్థితిపై కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పుడు చేయగలిగింది చాలా స్వల్పం. కేంద్రంలో మన అవసరం తక్కువ అన్నారు. అందుకే కేంద్రాన్ని ఒత్తిడి చేయలేమని, కేవలం విజ్ఞప్తులు మాత్రమే చేయగలమన్నారు.

ఎన్నికలు పూర్తయి యేడాది తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆశించిన పరిస్థితి ఇప్పుడు ఆయన ముంగిటకు వచ్చింది. కేంద్రంలో రాజకీయ సమీకరణలు మారిపోయాయి. మహారాష్ట్రలో బలమైన సుదీర్ఘకాల మిత్రపక్షం అయిన శివసేన ఎన్డీయే వదిలేసింది. అలాగే పంజాబ్ నుండి శిరోమణి అకాలీదళ్ కూడా ఎన్డీయేని వదిలేసింది. ఈ రెండు పార్టీలు కూటమి నుండి తొలగిపోవడం వల్ల బీజేపీకి కానీ, ఎన్డీయేకి కానీ ఇప్పటికిప్పుడు వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. కానీ ఈ రెండు పార్టీల నష్టం రాజ్యసభలో కాస్త ఎక్కువగానే ఉంది.

రాజ్యసభలో 245 సభ్యుల్లో ఎన్డీయేకి 113 మంది సభ్యులే ఉన్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష యూపీఏ కూటమి 130 స్థానాలతో ఆధిక్యంలో ఉండి అధికార బీజేపీకి, ఎన్డీయే కూటమికి ముచ్చెమటలు పట్టిస్తోంది. ఏ బిల్లూ రాజ్యసభలో గట్టెక్కే పరిస్థితి లేదు. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం ఇతరుల జాబితాలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అవసరం బీజేపీకి ఉంది. రాజ్యసభలో ఆరుగురు సభ్యులున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు బిల్లుల ఆమోదంలో కేంద్రానికి అవసరం.

ఎన్డీయే 113, యూపీఏ 130 స్థానాలతో పాటు తటస్తంగా ఉన్న 70 స్థానాలు బిజెపి నెగ్గేందుకు చాలా కీలకం. ఈ 70 స్థానాల్లో పశ్చిమ బెంగాల్ నుండి మమతా బెనెర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ కు 13 స్థానాలు, ఒడిశా లోని బిజూ జనతాదళ్ కు 9 స్థానాలు, ఉత్తర ప్రదేశ్ లోని సమాజ్ వాది పార్టీకి 8, తెలంగాణ రాష్ట్ర సమితికి 7 స్థానాలు, వైఎస్సార్ కాంగ్రెస్ కు 6 స్థానాలు కీలకం. ఇందులో తృణమూల్ కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్ర సమితి బీజేపీకి మద్దతిచ్చే పరిస్థితి లేదు. అందువల్ల వైఎస్సార్ కాంగ్రెస్ అత్యంత కీలకం అయింది. ఈ కీలక మద్దత్తు పరిస్థితినే జగన్మోహన్ రెడ్డి ఆశించారు. అయితే ఈ పరిస్థితిని ఆయన లోక్ సభలో ఆశించారు.

అయినా ఇప్పుడు రాజ్యసభలో బిజెపి ఒక్క అడుగు ముందుకు వేయాలన్నా వైఎస్సార్ కాంగ్రెస్ మద్దతు కీలకం. ఈ పరిస్థితి దృష్ట్యానే ఇప్పుడు బిజెపి నాయకత్వం జగన్మోహన్ రెడ్డితో సంప్రదింపులు జరుపుతోంది. పైగా జూన్ 2022 నాటికి వైఎస్సార్ కాంగ్రెస్ బలం మరో మూడు పెరిగి మొత్తం 9 స్థానాలకు చేరుకుంటుంది. మరోవైపు బీజేపీ బలం ఒక్క ఆంధ్ర ప్రదేశ్ నుండి మూడు తగ్గిపోతుంది. ఇప్పుడు బీజేపీ సభ్యులుగా ఉన్న సురేష్ ప్రభు, సుజనా చౌదరి, టి జి వెంకటేష్ 2022 జూన్ లో పదవీవిరమణ చేయనున్నారు. ఈ దృష్ట్యా బీజేపికి వైఎస్సార్ కాంగ్రెస్ అవసరం ఇప్పుడు కీలకం. అందువల్లనే పక్షం రోజుల తేడాతో జగన్మోహన్ రెడ్డితో హోమ్ మంత్రి అమిత్ షా, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చర్చలు జరుపుతున్నారు.

ఇప్పుడు బంతి జగన్మోహన్ రెడ్డి కోర్టులో ఉంది. రెండేళ్ళక్రితం కేంద్రంలో ఎలాంటి పరిస్థితిని ఆయన ఆశించారో ఆ పరిస్థితి ఇప్పుడు వచ్చింది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి తన మద్దతు కీలకం అయింది. ఈ అవకాశం కోసమే ఆయన ఎదురు చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితి ఉంటేనే కేంద్రం నుంచి రాష్ట్రానికి కావలసిన పనులు చేయించుకోగలమని ఆశిస్తూ వచ్చారు. ఇప్పుడు ఆ పరిస్థితి, ఆ అవకాశం వచ్చింది. ఇప్పుడు పావులు కదపాల్సింది జగన్మోహన్ రెడ్డి మాత్రమే. ఎలా పావులు కదుపుతారో చూడాల్సి ఉంది.

Show comments