iDreamPost
iDreamPost
ఏపీలో నాలుగు రాజ్యసభ సీట్లకు వచ్చే నెల 26న ఎన్నికలు జరగబోతున్నాయి. తాజాగా నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఈసారి ఏపీ నుంచి నాలుగు సీట్లు ఖాళీ అవుతుండడంతో వారి స్థానంలో కొత్త వారిని ఎంపిక చేసుకునేందుకు ప్రక్రియ పూర్తవుతోంది. అధికార పార్టీ వైఎస్సార్సీపీకే నాలుగు సీట్లు ఖాయంగా చెప్పవచ్చు. ఏపీ నుంచి ప్రస్తుతం రాజ్యసభ సభ్యులుగా ఉన్న వారిలో టీడీపీ ఎంపీ తోట సీతామహాలక్ష్మి, కాంగ్రెస్ ఎంపీలు టీ సుబ్బిరామిరెడ్డి, ఎం ఏ ఖాన్, టీఆర్ఎస్ ఎంపీ కే కేశవ రావు రిటైర్ అవుతున్నారు. తెలంగాణా, ఏపీ విభజన సమయంలో రాష్ట్రాల కేటాయింపులో భాగంగా కేశవరావు వంటి వారు ఏపీ కోటాలకు వచ్చారు.
మార్చిలో దేశవ్యాప్తంగా ఖాళీ స్థానాలకు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించింది. 17 రాష్ట్రాల్లోని 55 సీట్లకు ఎన్నికలు జరుగుతాయి. అందులో తెలంగాణాలో రెండు సీట్లు, ఏపీలో నాలుగు సీట్లు ఉన్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ ఈ ఎన్నికలు ఏకగ్రీవం అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఏపీ అసెంబ్లీలో 151 మంది ఎమ్మెల్యేలతో పాటుగా టీడీపీ, జనసేన నుంచి మరికొందరు మద్ధతు ఉన్న వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయం. దాంతో ఈసారి ఎవరికి అవకాశం దక్కుతుందనే దానిపై కొంతకాలంగా చర్చ ప్రారంభమయ్యింది. పలువురు ఆశావాహుల పేర్లు తెరమీదకు వస్తున్నాయి.
గత ఎన్నికల్లో అవకాశం దక్కని నేతలు కొందరైతే, పార్టీ కోసం చాలాకాలంగా పనిచేస్తున్న నేతలతో పాటుగా త్వరలో శాసనమండలి రద్దవబోతున్న నేపథ్యంలో ఇప్పుడే తమకు రాజ్యసభ సీటు కావాలని ఆశిస్తున్న వారి పేర్లు కూడా ఉన్నాయి. పార్లమెంట్ లో అడుగుపెట్టాలని ఆశిస్తున్న కొందరు పారిశ్రామికవేత్తలు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా వివిధ వర్గాల నుంచి ఆశావాహులు అత్యధికంగా ఉండడంతో జగన్ కి పెద్ద పరీక్ష కాబోతోంది. ఎవరికి మొగ్గు చూపుతారన్నది ఆసక్తిగా మారబోతోంది.
ఇప్పటికే పలు పేర్లు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అందులో ఏకంగా జగన్ సోదరి వైఎస్ షర్మిళ పేరు కూడా ప్రస్తావించడం విశేషమే. అయితే అలాంటి అవకాశం లేదని వైఎస్సార్సీపీకి చెందిన కీలక నేతలు తోసిపుచ్చుతున్నారు. అయోధ్య రామిరెడ్డి పేరు దాదాపు ఖాయమనే వాదన బలంగా ఉంది. ఆయన తో పాటు ఇంకా కొందరు ఆశిస్తున్నప్పటికీ సామాజిక సమీకరణాలు కూడా కీలకంగా మారబోతున్నాయి. ఇటీవల టీడీపీ నుంచి వైసీపీ తీర్థంపుచ్చుకున్న బీదా మస్తాన్ రావు పేరు కూడా వినిపిస్తోంది. అయితే ఇప్పటికే ఇద్దరు రాజ్యసభ్యులు నెల్లూరుకి చెందిన వారే వైఎస్సార్సీపీ తరుపున ఉన్నారు. ఇప్పుడు మూడో నేతలకు కూడా అవకాశం ఇస్తారా అన్నది చర్చనీయాంశం.
ఎస్సీ, మైనార్టీ కోటాలో కూడా కొందరు ఆశావాహుల పేర్లు వినిపిస్తున్నాయి. జగన్ ని కలిసి వ్యక్తిగతంగా ప్రతిపాదనలు ఇవ్వడమే తప్ప వైఎస్సార్సీపీలో రాజ్యసభ సీటు కోసం పెద్దగా లాబీయింగ్ పనిచేయదనే వాదన కూడా ఉంది. దాంతో అధినేత ఆశీస్సులు ఎవరికి దక్కుతాయోననే ఆసక్తి ఆపార్టీ నేతల్లో పెరుగుతోంది. ఇప్పటికే పలువురు అమరావతిలో తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్న నేపథ్యంలో ఎవరికి అవకాశం దక్కేనో వేచి చూడాలి.