iDreamPost
android-app
ios-app

వైసీపీ ఎమ్మెల్యేలకు భలే ఛాన్స్‌..!

వైసీపీ ఎమ్మెల్యేలకు భలే ఛాన్స్‌..!

గత సాధారణ ఎన్నికల్లో వైసీపీ తరఫున 151 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. వీరిలో దాదాపు సగం మంది కొత్తవారే. వీరిలో అధిక శాతం మంది సీఎం వైఎస్‌ జగన్‌కు సమకాలికులే. రాబోయే 30 ఏళ్లపాటు ప్రజలకు ముఖ్యమంత్రిగా సేవలందించాలనే అభిలాషతో సీఎం వైఎస్‌ జగన్‌ ఉన్నారు. ఈ విషయాన్ని పలుమార్లు ఆయన వ్యక్తపరిచారు. అందుకు అనుగుణంగానే సీఎం జగన్‌ పాలన సాగిస్తున్నారు. ప్రజల అభిమానాన్ని చూరగొనేందుకు, నమ్మకాన్ని పొందేందుకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 90 శాతం హామీలు అమలు చేశారు. మేనిఫెస్టోనే తమకు బైబిల్, ఖురాన్, భగవద్గీత అని చెబుతున్న సీఎం వైఎస్‌ జగన్‌ మాటాలు వింటున్న ప్రజలు గత పాలకుల కన్నా సీఎం జగన్‌ ప్రత్యేకమైన వ్యక్తని విశ్వసిస్తున్నారు.

ప్రజల నమ్మకాన్ని, అభిమానాన్ని పొందుతున్న సీఎం వైఎస్‌ జగన్‌తోపాటు.. మంచి రాజకీయ భవిష్యత్‌ను పొందే అవకాశం ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యేకు దక్కబోతోంది. అయితే ఇది వారి చేతుల్లోనే ఉంది. ముఖ్యంగా నూతన ఎమ్మెల్యేలు తమ రాజకీయ జీవితానికి బంగారు బాటలు వేసుకునే అవకాశాలను సీఎం వైఎస్‌ జగన్‌ తన పాలన, నిర్ణయాల ద్వారా కల్పిస్తున్నారు. సంక్షేమ పథకాల అమలు వల్ల ప్రజల్లో వైసీపీ ప్రభుత్వంపై మంచి అభిప్రాయం ఉంది. ఎవరి ప్రమేయం లేకుండా.. నేరుగా వాలంటీర్లే వాటిని అందిస్తున్నారు. ఎమ్మెల్యేలు నిత్యం ప్రజల్లో ఉంటే.. వారి భవిష్యత్‌కు ఢోకా ఉండదు. అందుకే గత నెలలో ప్రజా సంకల్ప పాదయాత్ర 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వారం రోజుల పాటు వైసీపీ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించింది. ప్రజల్లోకి ఎమ్మెల్యేలు వెళ్లేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడింది. కొంత మంది ఎమ్మెల్యేలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగా.. మరికొన్ని చోట్ల పూర్తిస్థాయిలో వినియోగించుకోలేదు.

అయితే మళ్లీ మరో అవకాశం ఎమ్మెల్యేలకు రాబోతోంది. ఈ నెల 25వ తేదీన రాష్ట్రంలో దాదాపు 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. ఆ రోజు నుంచి 15 రోజులపాటు ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో పర్యటించేలా కార్యక్రమాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ రూపాందిస్తున్నట్లు సమాచారం. 15 రోజులపాటు నియోజకవర్గంలోని గ్రామాల్లో పర్యటిస్తూ.. ఇళ్ల పట్టాలను ఎమ్మెల్యేలు పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమం వల్ల ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యేలతో చెప్పుకునే అవకాశం వస్తుంది. అదే సమయంలో తమ ఎమ్మెల్యే తమ గ్రామానికి వచ్చారని ప్రజలు సంతోషిస్తారు.

ఎన్నికలు పూర్తయి ఏడాదిన్నర కావస్తున్నా.. ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లోని అన్ని గ్రామాలకు వెళ్లలేదు. ఇది వారికి నష్టం చేకూరుస్తోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. గడప గడపకు వైఎస్సార్‌.. ఇంటింటికి నవరత్నాలు… కార్యక్రమాలతో.. నియోజవర్గ కో ఆర్డినేటర్‌ పదవిలో ప్రస్తుత ఎమ్మెల్యేలు గ్రామ గ్రామాన తిరిగారు. గ్రామాల్లోని వీధుల్లోకి వెళ్లారు. ప్రజలతో మమేకం అయ్యారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత సదరు ఎమ్మెల్యేలు ఒక్కసారి కూడా రానీ గ్రామాల్లోని ప్రజల్లో కొంత అసంతృప్తి ఉంది. దీన్ని తొలగించేందుకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఎమ్మెల్యేలకు బాగా ఉపయోగపడనుంది. దీన్ని ఎంత మంది ఎమ్మెల్యేలు సద్వినియోగం చేసుకుంటారో వేచి చూడాలి. నిత్యం ప్రజల్లో ఉండడడం, అభివృద్ధి పనులు చేయడం వల్ల మాత్రమే ప్రజల అభిమానాన్ని ఎమ్మెల్యేలు చూరగొనే అవకాశం ఉంది. సీఎం వైఎస్‌ జగన్‌ పాలనను చూసి ప్రజలు ఓట్లు వేసినా.. వైసీపీ టిక్కెట్‌ రావాలంటే మాత్రం సదరు ఎమ్మెల్యే ప్రజల అభిమానం చూరగొనడం ఒక్కటే మార్గం.