iDreamPost
iDreamPost
నా రీఎంట్రీకి ముందు నన్ను ఎన్నెన్ని అన్నారో తెలుసు. ఆ విమర్శలకు సమాధానం ఇవ్వడం నా పని కాదు. నా ఆట, ఫిట్‌నెస్ మీదనే నా దృష్టి. ఆరు నెలల్లో ఎంతగా కష్టపడ్డానో ఎవరికీ తెలియదని స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఎమోషనల్ అయ్యాడు. ఉదయం 5 గంటలకే లేచి ప్రాక్టీస్ చేశానని, జట్టులోకి వచ్చేందుకు ఎన్నో త్యాగాలు చేశానని అన్నాడు పాండ్య.
టీ20 ప్రపంచకప్-2021 ముగిసిన తర్వాత ఐపీఎల్ 2022 వరకు హార్దిక్ పాండ్యా క్రికెట్ ఆడలేదు. బౌలింగ్ చేయడంలో సమస్యలు, ఫిటెనెస్ లేకపోవడం, ఒక నమ్ముకున్న బ్యాటింగ్ లో పెద్దగా స్కోర్లు చేయకపోవడంతో పాండ్య జట్టుకు దూరమైయ్యాడు. అంతెందుకు ముంబై కూడా అతన్ని వదులుకుంది. ఇక పాండ్యా పని అయిపోయింది అంటూ చాలామంది ఘాటు వ్యాఖ్యలు చేశారు.
పాండ్య మాత్రం బైటపడలేదు. ఫ్యామిలీతో గడిపాడు. నేషనల్ క్రికెట్ అకాడమీలో శిక్షణ తీసుకున్నాడు. నాలుగు ఓవర్లు ప్రతి మ్యాచ్ లో వేయగలిగినంత ఫిట్‌నెస్ సాధించాడు. అదేసమయంలో కొత్త ఫ్రాంఛైజీ గుజరాత్ టైటాన్స్ సంప్రదిస్తే, వస్తే కెప్టెన్ గానే ఆడతానని తేల్చిచెప్పాడు. కెప్టెన్ గా ఐదారు మ్యాచ్ ల్లో కాస్త టెంపర్ ను చూపించినా… ఆ తర్వాత సర్దుకున్నాడు. కూల్ గా కప్ ను కొట్టేశాడు. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ రెండింటిలోనూ గొప్పగా రాణించాడు. దెబ్బకు దక్షిణాఫ్రికాతో స్వదేశంలో టీ20 సిరీస్‌తో టీమిండియాలో ఎంట్రీ ఇచ్చాడు.
ఢిల్లీ మ్యాచ్‌లో బిగ్ హిట్టింగ్ ఏంటో చూపించాడు పాండ్య. 12 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 31 పరుగులుచేశాడు. కాకపోతే ఓవర్ బౌల్ చేశాడుకాని, 18 పరుగులు ఇచ్చాడు. ఇప్పుడు కటక్ లో రెండో టీ20కి రెడీ.
బీసీసీఐకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇందులో హార్దిక్ పాండ్య తన రీఎంట్రీ గురించి మనసువిప్పాడు. రోజూ 5 గంటలకే నిద్ర లేచేవాడిని. ట్రెయినింగ్ లో ఉన్నా, తగిన విశ్రాంతి తీసుకునేవాడిని. ఆ నాలుగు నెలలూ, రాత్రి తొమ్మిదిన్నరకే నిద్రపోయేవాడిని. ఎన్నెన్నో త్యాగాలు చేశా. ఐపీఎల్ కి ముందే నాతో నేను పెద్ద యుద్ధమే చేశానని చెప్పవచ్చునని అన్నాడు పాండ్య.
అందుకు తగ్గ ఫలితాలు వచ్చాయి. పూర్తి సంతృప్తిగా ఉన్నా. దీనికోసం నేను ఎంత కఠిన శ్రమపడ్డానో నాకే తెలుసు. నాకు మొదటి నుంచి కష్టపడటం అలవాటే. ఫలితాల గురించి పెద్ద ఆలోచించలేదు నిజాయితీగా నా పని చేశా. అందుకే ఈ విజయాలకు ఉప్పొంగిపోవడం లేదని అన్న పాండ్య ఏదైనా ఒక్క రోజు, ఒక్క క్షణాకి సంబంధించి కాదు, జర్నీ ఎలా కొనసాగుతుందన్నదే అసలు విషయమని ఉద్వేగానికి గురయ్యాడు. ప్రపంచకప్ జట్టులో లక్ష్యమన్న హార్దిక్ పాండ్య, తాను నిరూపించుకుంటాననని చెప్పాడు.