iDreamPost
iDreamPost
దేశం ఇప్పుడు కరోనా కష్టాల కన్నా వలస జీవుల వెతలు చూసి ఎక్కువగా కలత చెందుతోంది. నిత్యం జాతీయ రహదారులు, రైల్వే లైన్ల వెంబడి నడుస్తూ సాగుతున్న వారి కష్టాలతో కన్నీరు పెడుతోంది. చంటిబిడ్డలను చంకనెత్తుకుని , వేల కిలోమీటర్ల మేర పయనంలో అడుగులేస్తున్న అభాగ్యులు అర్థాంతరంగా తనువు చాలిస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి. ఇప్పటికే వందల మంది ప్రాణాలు కోల్పోయారు. అయినప్పటికీ ప్రభుత్వంలో చలనం కనిపించడం లేదనే విమర్శలు వెల్లువెత్తాయి. వలస కూలీల కష్టాలతో కల్లోలపడిన మనసులు కొందరు స్వచ్ఛందంగా సాయం అందిస్తున్నప్పటికీ పాలకుల నుంచి చేయూత దక్కకోవడం దయనీయంగా మారింది.
ఈ నేపథ్యంలో పదే పదే ప్రధాని, ఇతర పెద్దలు మీడియాతో మాట్లాడిన సమయంలో వలస కూలీల విషయాన్ని పెద్దగా ప్రస్తావించకపోవడాన్ని అనేక మంది తప్పుబట్టారు. ఉద్దీపన ప్యాకేజీలు వెలువడుతున్నా వాళ్లనెందుకు విస్మరిస్తున్నారనే వ్యాఖ్యానాలు కూడా వచ్చాయి. దాతో ఎట్టకేలకు పీఎం కేర్స్ ఫండ్ నుంచి సహాయం ప్రకటించారు. దేశఃలో వలస కూలీల సమస్యల పరిష్కారానికి వెయ్యి కోట్ల నిధులు కేటాయిస్తున్నట్టు పీఎం కేర్స్ ఫండ్ ప్రకటించింది. తద్వారా కొంత వరకూ ఉపశమనం దక్కవచ్చుననే అభిప్రాయం వినిపిస్తోంది. కానీ అతి పెద్ద సమస్యకు అది అంత మాత్రం అనే ప్రశ్న కూడా ఉదయిస్తోంది.
సుమారుగా 40 కోట్ల మంది వలస కూలీలు అనేక కారణాలతో సొంత ప్రాంతాలకు తిరిగివెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. శ్రామిక్ రైళ్లను ఏర్పాటు చేసిన సమయంలో పెద్ద సంఖ్యలో పోటెత్తుతున్నారు. వారి నుంచి కూడా ఛార్జీల రూపంలో వసూలు చేసిన వైనంపై విమర్శల వెల్లువ కనిపించింది. ఇక ఇప్పటికే వారిలో 10 శాతం మంది వివిధ మార్గాల్లో సొంతూళ్లకు చేరుకున్నట్టు అంచనా. మరో 40 నుంచి 50 శాతం మంది సమస్యలను అధిగమించడానికే మొగ్గు చూపుతూ, ఉన్న ఊళ్లలోనే ఉంటారని భావిస్తున్నారు. ఇక మిగిలిన వారిని తరలించడానికే పెద్ద మొత్తంలో ఖర్చయ్యే అవకాశం ఉంది. లాక్ డౌన్ కొనసాగించినా, లేక ప్రయాణాలకు అనుమతించినా వలసలు మరింతగా ఊపందుకుంటాయనే అభిప్రాయం సర్వత్రా ఉన్న సమయంలో వెయ్యికోట్ల కేటాయింపు ఏమూలకు అన్నదే ఓ వాదన.
అదే సమయంలో వలస కూలీలు మళ్లీ పల్లెబాట పడుతున్న తరుణంలో గ్రామాల్లో ఉపాధికి అవకాశాలు కల్పించాల్సి ఉంటుంది. పట్టణాల్లో పనులకు ప్రత్యామ్నాయంగా శ్రామిక వర్గాన్ని సమకూర్చుకోవాల్సి ఉంటుంది. లేకుంటా కీలకమైన నిర్మాణ పనులు, ఇతర రంగాల్లో కొరత కనిపించవచ్చు. ఇలాంటి ఓ అతిపెద్ద సమస్య ఎదురుకాబోతున్న సమయంలో కేంద్రం ఉదారంగా వ్యవహరించాల్సి ఉంటుంది. వారిని ఆదుకునేందుకు అనుగుణంగా సమగ్ర చర్యలతో ప్రణాళికాబద్ధంగా సాగాల్సి ఉంటుంది. ప్రస్తుతం ప్రకటిస్తున్న 20లక్షల కోట్ల ప్యాకేజీలో అలాంటి ఉపశమన మార్గాలు ఉంటాయనే ఆశాబావం చాలామందిలో ఉంది.