విశాఖకు పవన్ వెళతాడా? వీడియో సందేశంతోనే సరా ?

జనం కోసం నేను పార్టీ పెట్టానని, మార్పు తేవటం కోసమే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పుకునే జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఏమైంది ? విశాఖపట్నం సమీపంలోని ఆర్ఆర్ వెంకటాపురం ఎల్జీ పాలిమర్స్ ఫ్యాక్టరీలో గ్యాస్ ప్రమాదం జరిగి నాలుగు రోజులైనా పవన్ ఇంకా వెళ్ళక పోవటం ఆశ్చర్యంగా ఉంది. చంద్రబాబునాయుడు వెళ్ళలేదంటే ప్రధానమంత్రి కార్యాలయం నుండి అనుమతి రాలేదు కాబట్టి వెళ్ళలేదు. ఇదే సమయంలో బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, వామపక్ష పార్టీల కార్యదర్శులు కూడా డిజిపి అనుమతి తీసుకున్నారు. కానీ పవన్ ఇంకా అటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లు లేదు.

గ్యాస్ ప్రమాదం గురించి తెలియగానే మధ్యాహ్నానికి జగన్మోహన్ రెడ్డి వైజాగ్ వెళ్ళి బాధితులను, కుటుంబసభ్యులను పరామర్శించారు. సరే జగన్ అంటే ముఖ్యమంత్రి కాబట్టి అనేక సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. ప్రతిపపక్ష నేతలు మరుసటి రోజన్నా ప్రమాధం జరిగిన ప్రాంతానికి వెళ్ళాలి కదా ? ప్రమాధం జరిగిన సాయంత్రం ఏదో మొక్కుబడిగా ఓ బాధితుల కుటుంబ సభ్యులను ఓదారుస్తు ఓ వీడియో సందేశం మాత్రం పవన్ రిలీజ్ చేశాడు.

కానీ పవన్ నుండి అభిమానులు లేకపోతే బాధితులు ఆశిస్తున్నది మొక్కుబడి వీడియో సందేశాలు కావు. బాధితులను నేరుగా కలిసి ఓదార్చాలని అభిమానులు కోరుకుంటున్నారు. పైగా మిగిలిన ప్రతిపక్షాల అధినేతల కన్నా పవన్ పై ఎక్కువ బాధ్యతుంది. ఎలాగంటే మొన్నటి ఎన్నికల్లో విశాఖపట్నం జిల్లాలోని గాజువాక నుండే పవన్ పోటి చేశాడు. ఓడినా గెలిచినా ఇక్కడే ఉంటానని ఎన్నికల సమయంలో పవన్ బహిరంగంగా జనాలకు హామీ ఇచ్చాడు. మరి కష్టకాలంలో ఉన్నపుడు బాధితుల దగ్గరకు వెళ్ళి పరామర్శించకపోవటం ఏమీ బావోలేదు.

ఘటనా స్ధలానికి వెళ్ళటానికి, బాధితులను కలవటానికి కన్నా, వామపక్షాల నేతలకు అనుమతిచ్చినపుడు పవన్ కు ఎందుకు ఇవ్వకుండా ఉంటారు పోలీసులు. చంద్రబాబునాయుడు అంటే ప్రతి విషయంలోను రాజకీయాలే చేస్తాడు. అక్కడ రాజకీయానికి తావులేదు కాబట్టి, వెళ్ళినా ఉపయోగం లేదనుకుని కేంద్రం మీద నెపాన్ని తోసేసి హైదరాబాద్ ఇంట్లోనే కూర్చున్నాడనే ఆరోపణలున్నాయి.

మరి పవన్ కు ఏమైందని హైదరాబాద్ లోని ఇంట్లోనే కూర్చున్నాడు ? పైగా కరోనా వైరస్ దెబ్బకు సినిమా షూటింగులు కూడా ఏమీ లేవు. అంటే పవన్ ఖాళీగానే ఉన్నాడని అర్ధమవుతోంది. వైజాగ్ వెళ్ళాలని అనుకుంటే పెద్ద కష్టం కూడా కాదు. అంటే వైజాగ్ వెళ్ళి బాధితులను కలిసే ఉద్దేశ్యం లేదు కాబట్టే వీడియో సందేశం రిలీజ్ చేసి చేతులు దులిపేసుకున్నాడని అనుకోవాలా ?

Show comments