iDreamPost
iDreamPost
ప్రస్తుతం జరగబోయే స్థానిక ఎన్నికల కోసం అన్ని పార్టీలు సమాయత్తమయ్యాయి. మంత్రాంగాలతో యంత్రాంగాలను కదలించే పనిలో పడ్డాయి. అదే క్రమంలో అధికార వైఎస్సార్సీపీ వ్యూహాత్మకంగా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. దానికి తగ్గట్టుగా జెడ్పీ,మునిసిపల్ ఎన్నికలకు సంబంధించిన తన మనసులో మాటను ఇప్పటికే జగన్ పార్టీ నేతలకు తెలిపారు. క్యాబినెట్ సమావేశంలో కూడా ఆయన ప్రస్తావించినట్టుగా ఫలితాల తర్వాత తగిన నేతలను మేయర్, జెడ్పీ పీఠాలకు ఎంపిక చేసేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. ప్రాంతీయంగా వివిధ నేతలకు బాధ్యతలు అప్పగించినప్పటికీ కీలకమైన పదవుల విషయంలో జగన్ ఆమోదం తప్పని సరి అనడంలో సందేహం లేదు. దానికి తగ్గట్టుగానే జగన్ ఫలితాలను బట్టి ప్రాధాన్యత ఉంటుందని చెప్పడం ద్వారా నేతలను కార్యక్షేత్రానికి సన్నద్ధం చేసినట్టుగా భావిస్తున్నారు.
పరోక్ష పద్ధతిలోనే స్థానిక ఎన్నికలు జరగబోతున్నాయి. మండలాల వారీగా జెడ్పీ స్థానాలకు జరిగే ఎన్నికల్లో మెజార్టీ సాధించిన వారికే జెడ్పీ పీఠం దక్కుతుంది. దాంతో ఏ నాయకుడు పరిధిలో ఎక్కువ సీట్లు దక్కుతాయన్నది పరిగణలోకి తీసుకున్న తర్వా రిజర్వేషన్లకు అనుగుణంగా చైర్ పర్సన్ పోస్టుల కేటాయింపు ఉంటుందని జగన్ సంకేతాలు ఇచ్చేశారు. దాంతో ఆయా జిల్లాల్లో రాజకీయంగా పట్టు నిలుపుకునే ప్రయత్నంలో ఉన్న నేతలు జెడ్పీటీసీ స్థానాలపై గురిపెట్టాయి. తమ వర్గీయులను ఎక్కువ మందిని గెలిపించుకోవడం ద్వారా జెడ్పీ పీఠంపై పాగా వేయాలనే యత్నంలో ఉన్నట్టు కనిపిస్తోంది. దాంతో ఈ పరిస్థితి ఆసక్తికరం అవుతుంది. ఫలితాల తర్వాత చైర్మన్లను ఎంపిక చేసేందుకు వైఎస్సార్సీపీ తీసుకున్న నిర్ణయం ఎలాంటి పలితాన్నిస్తుందన్నది కూడా చూడాల్సి ఉంది.
నగర పాలక సంస్థల్లో కూడా ఇదే పద్ధతిలో కార్పోరేటర్ల సంఖ్యను బట్టి మేయర్ పీఠం దక్కబోతోంది. దాంతో మేయర్ అభ్యర్థుల విషయంలో ఫలితాల తర్వాత చూద్దామని సీఎం చెప్పేశారు. కానీ జెడ్పీ పీఠం ఎలా ఉన్నప్పటికీ మేయర్ ఖరారయితే ఎన్నికల్లో కొంత కలిసి వస్తుందనే అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో ఉంది. ఎన్నికల వ్యవహారాల్లో కూడా ఆయా మేయర్ క్యాండిడేట్స్ కొంత కీలకంగా మారేందుకు దోహదం చేస్తుందని అభిప్రాయం పడుతున్నారు. అయినప్పటికీ సీఎం మాత్రం కన్ఫర్మ్ చేసేందుకు సిద్ధపడకపోవడం విశేషం. మేయర్ సీటు ఆశిస్తున్న వర్గీయులను ఎన్నికలకు ముందే నిరాశ పరచకుండా, ఫలితాల తర్వాత అందరి సంతృప్తి పరిచే నిర్ణయం తీసుకోవాలనే లక్ష్యంతో జగన్ ఉన్నట్టు కనిపిస్తోంది
గతానికి భిన్నంగా జగన్ తనదైన వ్యూహంతో సాగుతున్న నేపథ్యంలో ఈ ఎన్నికల్లో అధికార పార్టీకి ఏమేరకు మేలు జరుగుతుందన్నది చర్చకు దారితీస్తోంది. పార్టీ నేతల్లోనే భిన్నవాదనలున్నప్పటికీ అధిష్టానం పెట్టిన స్థానిక ఎన్నికల పరీక్షలో తమ సత్తా చాటాలనే సంకల్పంతో నేతలంతా సాగుతున్నారు. పట్టుసడలితే అధినేత సీరియస్ అయ్యే ప్రమాదం పొంచి ఉన్న తరుణంలో అందరి దృష్టి వారి వారి వర్గీయులను గెలిపించుకోవడంపైనే ఉంది. ఆ తర్వాత ఫలితాలను బట్టి జగన్ ఆశీస్సులు దక్కితే మేయర్, జెడ్పీ పీఠాలను కైవసం చేసుకోవడం కష్టం కాదనే అభిప్రాయంతో వారు ముందుకు సాగుతున్నారు. చివరకు ఓటరు ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి.