చంద్రబాబు సీమ ద్రోహిగా మిగిలిపోతాడా ?

రాయలసీమ నీటి ప్రాజెక్టుల విషయంలో మద్దతివ్వకపోతే చంద్రబాబునాయుడు సీమ ద్రోహిగా మిగిలిపోవటం ఖాయమేనా ? బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రెడ్డి చెప్పిన దాని ప్రకారమైతే అందరు అలాగే అనుకోవాల్సొస్తోంది. విష్ణు మీడియాతో మాట్లాడుతూ రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో తాగు, సాగు నీరందించే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ స్కీమ్ విషయంలో చంద్రబాబు మౌనంగా ఉంటే కుదరదంటూ మండిపడ్డాడు. రాయలసీమ నీటి ప్రాజెక్టుల విషయంలో చంద్రబాబు ఎందుకు నోరు మెదపటం లేదంటూ నిలదీయటం గమనార్హం.

మొత్తం మీద చంద్రబాబుపై మూడు వైపుల నుండి ఒత్తిడి పెరిగిపోతోంది. ఒకవైపు పోతిరెడ్డిపాడు స్కీమ్ విషయంలో స్పందించాలంటూ వైసిపి రాజ్యసభ ఎంపి విజయసాయిరెడ్డి డిమాండ్ చేస్తున్న విషయం అందరూ చూస్తున్నదే. అదే సమయంలో బిజెపి నేతలు కూడా చంద్రబాబును ఇదే విధమైన డిమాండ్ చేస్తున్నారు. ఇక మొన్నటికి మొన్న ప్రెస్ మీట్లో కేసీయార్ మాట్లాడుతూ తమ రాష్ట్రంలో నిర్మించుకుంటున్న ప్రాజెక్టుల విషయంలో గతంలో చంద్రబాబు అంగీకరించాడంటూ పెద్ద బాంబే వేశాడు.

పై విధంగా మూడు వైపుల నుండి ఒత్తిడి పెరిగిపోతున్న నేపధ్యంలోనే సొంత పార్టీలో కీలక నేత అయిన ఎంఎల్సీ బిటెక్ రవి ప్రభుత్వానికి మద్దతు ప్రకటించటం అన్నింటికన్నా పెద్ద సమస్యగా మారింది. ప్రభుత్వ నిర్ణయాన్ని రాజకీయ కోణంలోనే చూస్తున్న చంద్రబాబుకు సొంతపార్టీ నేతే జగన్ కు మద్దతు పలకటంతో పెద్ద సమస్యగా మారింది. ఇటువంటి నేపధ్యంలోనే తాజాగా విష్ణు మాట్లాడుతూ సీమ ద్రోహిగా మిగిలిపోతావంటూ హెచ్చరించటం చంద్రబాబును మరింతగా ఒత్తిడిలోకి నెట్టేస్తోంది.

తాను సిఎంగా ఉన్నపుడే తెలంగాణాలో నిర్మిస్తున్న నీటి ప్రాజెక్టులను పట్టించుకోకుండా చంద్రబాబు ఏపికి తీరని అన్యాయం చేశాడంటూ మండిపోవటం విచిత్రంగా ఉంది. ఎందుకంటే 2014-19లో టిడిపి+బిజెపి దాదాపు నాలుగు సంవత్సరాలు కలిసే ఉన్నారు. అదే కాలంలో తెలంగాణాలో నిర్మితమవుతున్న ప్రాజెక్టుల విషయంలో బిజెపి కూడా ఏ రోజు నోరిప్పలేదు. అలాంటిది తెలంగాణాలో కట్టిన నీటి ప్రాజెక్టులకన్నింటికీ చంద్రబాబే కారణమని ఆరోపణలు చేయటం విచిత్రమే.

చంద్రబాబుతో పాటు పనిలో పనిగా విష్ణు కమ్యూనిస్టులపైన కూడా మండిపడ్డాడు. కృష్ణా జిల్లాలో ఓ మాట, రాయలసీమలో మరోమాట మాట్లాడుతూ కమ్యూనిస్టులు ద్వంద్వ వైఖరితో వ్యవహరిస్తున్నట్లు కామెంట్ చేయటం గమనార్హం. మొత్తం మీద ఎన్నిపార్టీలు డిమాండ్ చేస్తున్నా పోతిరెడ్డిపాడుపై చంద్రబాబు నోరిప్పటం లేదంటే ఎంత టెన్షన్లో ఉన్నాడో అర్ధమైపోతోంది. జగన్ మీద ధ్వేషంతో ప్రాజెక్టుకు మద్దతు పలకలేక, తెలంగాణాకు మద్దతుగా నిలబడలేక చంద్రబాబు నానా అవస్తలు పడుతున్నాడు.

Show comments