రవితేజ చేయకపోతే ఆ టైటిల్ ఎందుకు

మాస్ మహారాజా రవితేజ అభిమానులకు విక్రమార్కుడు అంటే ప్రత్యేకమైన అభిమానం. రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్ టైనర్ అయినా దాన్ని తీర్చిదిద్దిన తీరు, రవితేజ ఎనర్జీని డ్యూయల్ రోల్స్ లో పూర్తిగా వాడుకున్న విధానం దాన్ని బ్లాక్ బస్టర్ చేశాయి. అందుకే టీవీలో వచ్చినప్పుడంతా ఈ సినిమాకు మంచి రేటింగ్స్ వస్తుంటాయి హిందీలో అక్షయ్ కుమార్ హీరోగా ప్రభుదేవా దర్శకత్వంలో రీమేక్ చేస్తే అక్కడా ఘనవిజయం సాధించింది. ఇటీవలి కాలంలో దీని సీక్వెల్ కు సంబంధించిన వార్తలు గట్టిగానే చక్కర్లు కొడుతున్నాయి. జక్కన్న డైరెక్ట్ చేయకపోయినా రచయిత విజయేంద్ర ప్రసాద్ ఆల్రెడీ కథను సిద్ధం చేసి ఉంచారట. కాంబో సెట్ కావడం లేదు.

లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం ఇది సంపత్ నంది చేతికి వెళ్లొచ్చని అంటున్నారు. మెగా కాంపౌండ్ లోని హీరోతో చేసేందుకు అక్కడి నుంచి సానుకూల సంకేతాలు వచ్చినట్టుగా చెబుతున్నారు. అది మెగాస్టార్ చిరంజీవి అయినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంతర్గత వర్గాల సమాచారం. రవితేజ కాకుండా ఎవరు చేసినా టైటిల్ మార్చాల్సి ఉంటుంది. లేకపోతే ప్రేక్షకులకు కనెక్ట్ కావడంలో ఇబ్బందులు ఉంటాయి. ఒకవేళ చిరుకు కుదరకపోతే ఇంకెవరు చేస్తారో వేచి చూడాలి. రవితేజ కిక్ 2 డిజాస్టర్ తర్వాత సీక్వెల్స్ మీద పెద్దగా ఆసక్తి చూపించడం లేదట. లేనిపోని అంచనాలు పెరిగిపోయి ఫ్లాపులు చూడాల్సి వస్తుందని నో అంటున్నారని వినికిడి.

దీనికి సంబంధించిన స్పష్టత రావడానికి కొంత టైం పట్టేలా ఉంది. ఇటీవలే సీటిమార్ అందించిన సంపత్ నంది నెక్స్ట్ ఎవరితో చేయబోతున్నది ఇంకా వెల్లడించలేదు. సీటిమార్ వసూళ్లు బాగానే వచ్చినప్పటికీ థియేట్రికల్ బిజినెస్ లెక్కల్లో చూసుకుంటే జస్ట్ యావరేజ్ దగ్గరే ఆగిపోయింది. కాకపోతే గౌతమ్ నందా కంటే కాస్త బెటర్ రిజల్ట్ దక్కడం ఒకటే ఊరట. మరి విక్రమార్కుడు 2 అతనే చేస్తాడా లేక వేరే ప్లాన్ ఏమైనా ఉందా అనేది తెలియాల్సి ఉంది. ఏది ఎలా ఉన్నా దశాబ్దంన్నర తర్వాత ఒక హిట్ మూవీకి సీక్వెల్ చేయడమనే ఆలోచన బాగానే ఉంది కానీ మరో కోణంలో చూస్తే కొత్త కథల కొరత ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది

Also Read : రాజమౌళి మళ్ళీ మాట మార్చక తప్పదా

Show comments