iDreamPost
android-app
ios-app

పెట్రోల్, డీజిల్ ధరలు ఎందుకు తగ్గడం లేదు..?

పెట్రోల్, డీజిల్ ధరలు ఎందుకు తగ్గడం లేదు..?

అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గినా…ఇక్కడెందుకు ఇలా..?

ఆయిల్‌ ఉత్పత్తి చేసే దేశాల మధ్య నెలకొన్న స్తబ్ధత కారణంగా ప్రపంచ వ్యాప్తంగా క్రూడ్‌ ఆయిల్‌ ధరలు తగ్గుతున్నాయి. భారత్‌లో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. ఓ దశలో బ్యారల్‌ ధర మైనస్‌లోకి పడిపోయినా మనదేశంలో మాత్రం ఇంధన ధరలు ఇసుమంతైనా తగ్గలేదు.

అదీగాక, కరోనాను అరికట్టడానికి ప్రపంచదేశాలన్నీ లాక్‌డౌన్‌ను పాటిస్తున్న సమయంలో అన్ని రకాల రవాణా బంద్‌ అయినా.. పెట్రోలియం ఉత్పత్తులపై విధించే పన్నులను పెంచారు. ఫలితంగా వినియోగదారులకు క్రూడ్‌ ఆయిల్‌ ధరలు తగ్గిన ప్రయోజనం దక్కకుండా పోతున్నది.

ఈ రెండు నెలల కాలంలో పన్నుల పేరిట భారత్‌లో లీటర్‌ పెట్రోల్‌పై రూ. 13, డీజిల్‌పై రూ. 16 పెరగడమే ఇందుకు నిదర్శనం. రెండు నెలల కాలం లోనే దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌పై లీటరుకు రూ. 5 వరకు ధరలు పెరిగాయి. ఢిల్లీలో అయితే లీటర్‌ డీజిల్‌ ధర ఏకంగా పది రూపాయలు పెరిగింది.

82 రోజులుగా ఇంధన ధరల్లో మార్పులు లేక పోయినా.. ప్రపంచవ్యాప్తంగా క్రూడ్‌ ఆయిల్‌ ధరలు తగ్గుతున్నా.. భారత్‌లో మాత్రం ఎందుకు పెరుగుతున్నాయి..? లాక్‌డౌన్‌ విధించే సమయానికి దేశ రాజధానిలో లీటరు పెట్రోల్‌ రూ. 69.59, డీజిల్‌ రూ. 62.29 గా (ఏప్రిల్‌ 1 నాటి ధరలు) ఉంది.

కానీ జూన్‌ 10 నాటికి అవే ధరలు రూ. 73.40, రూ. 71.62కు చేరుకున్నా యి. అంటే లీటరు పెట్రోల్‌పై రూ. 3.80, డీజిల్‌ పై రూ. 9.33 ధర పెరిగింది. ఇక దేశ ఆర్థిక రాజధానిలో ముంబయిలో ఇదే కాలానికి గానూ లీటర్‌ పెట్రోల్‌పై రూ.5.10, డీజిల్‌పై రూ.4.71లు పెరిగింది.

రెండునెలల తర్వాత జూన్‌ 6 నుంచే దేశంలో ఇంధన ధరలను రోజూవారీగా పునరుద్దరిస్తున్నారు. కానీ ధరలు ఎకాఎకిన పెరుగుతుండటానికి కారణం చమురు ఉత్పత్తుల మీద విధించే సుంకాలు. వ్యాట్‌, ఎక్సైజ్‌ పన్నుల పేరిట మోడీ ప్రభుత్వం లాక్‌డౌన్‌లోనూ ప్రజలపై భారం వేసింది.

ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒపెక్‌ దేశాలు, రష్యా మిత్ర దేశాల మధ్య అమెరికా పెట్టిన చిచ్చుతో క్రూడ్‌ ఆయిల్‌ ధరలు తగ్గిన విషయం విదితమే. ప్రస్తుతం బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర 40 డాలర్లు (సుమారు రూ. 3 వేలు)గా ఉంది. మూడు నెలల కిందట ఇవే ధరలు ఓ దశలో మైనస్‌లోకి (-16 డాలర్లు) పడిపోయాయి.

అలాంటి సమయంలో భారత్‌లో ఇంధన ధరలు దాదాపు సగానికి తగ్గాలి. కానీ అందుకు విరుద్దంగా పెరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రయోజనాలను వినియోగదారుడికి దక్కకుండా ఉండేందుకు గానూ.. మార్చి 14, గతనెల 6న ఈ ఉత్పత్తులపై విధించే వ్యాట్‌, ఎక్సైజ్‌, రోడ్‌ ట్యాక్స్‌లను కేంద్రం భారీగా పెంచేసింది.

ఈ రెండు నెలల కాలంలోనే పెట్రోల్‌పై రూ.13, డీజిల్‌పై రూ.16 పన్నులను మోడీ సర్కారు పెంచింది. ఫలితంగా దాని ప్రభావం ఇంధన ధరల పెరుగుదలపై పడుతున్నది. సరిగ్గా ఇదే సమయంలో కరోనా విజృంభిస్తుండటంతో ఆర్థికంగా చితికిపోయిన రాష్ట్రాలు సైతం కేంద్రాన్ని అనుకరించాయి. ఈ క్రమంలో ముందుబాటలో ఉన్న ఢిల్లీ.. ‘కరోనా సెస్‌’ పేరిట గతనెల 5న పెట్రోల్‌పై 3 శాతం, డీజిల్‌పై 13.25 శాతం పన్నులను పెంచింది. దీంతో ఢిల్లీలో పెట్రో ధరలు భగ్గుమంటున్నాయి.

కేంద్ర సర్కారు వేసిన బాటలోనే ఈశాన్య రాష్ట్రాలు పయనిస్తున్నాయి. ఏప్రిల్‌ 22న అస్సాంలో పెట్రోల్‌పై విధించే ఎక్సైజ్‌ సుంకాన్ని రూ.17.63 నుంచి రూ.22.63 లకు, డీజిల్‌పై రూ. 12.45 నుంచి రూ. 17.45లకు (రూ.5) పెంచుతూ అక్కడి బిజెపి సర్కారు నిర్ణయించింది. వ్యాట్‌ పెంపుతో రాష్ట్రానికి నెలకు రూ. 50 కోట్ల అదనపు ఆదాయం సమకూరనుంది.

అస్సాం తో పాటు మేఘాలయా, నాగాలాండ్‌లూ వ్యాట్‌ను పెంచేశాయి. మేఘాలయాలో పెట్రోల్‌, డీజిల్‌ అమ్మకాల పన్నుల (సేల్స్‌ ట్యాక్స్‌)పై విధించే సర్‌చార్జీ లను పెంచుతున్నట్టు గతవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అక్కడ చమురు ధరలు మరింత ప్రియమయ్యాయి.

కేంద్ర ఖజానాకు అదనపు ఆదాయం

మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్సైజ్‌ సుంకాలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. సామాన్యులపై పన్నుల భారం మోపి నానాటికీ ఖాళీ అవుతున్న ఖజానాను నింపుకోవడానికి మోడీ సర్కారు ఆరాటపడుతున్నది.

రెండు నెలల్లో పెట్రో ఉత్పత్తులపై పెంచిన పన్నుల ద్వారా.. 2020-21 ఆర్థిక సంవత్స రంలో ప్రభుత్వానికి సుమారు రూ. 2 లక్షల కోట్ల ఆదాయం అదనంగా సమకూరనున్నట్టు ఆర్థిక వేత్తలు అంచనా వేస్తున్నారు. ఓవైపు బడా కార్పొరేట్లు, ప్రైవేట్ పెట్టుబడిదారులు బ్యాంకుల నుంచి ఎగ్గొట్టిన సొమ్మును వసూలు చేయకుండా.. అదనంగా వారికి తాయిళాల పేరిట వరాలు కురిపిస్తున్న బిజెపి ప్రభుత్వం.. సామాన్యుల నడ్డి విరవడానికి మాత్రం వెనుకాడటం లేదు.

దేశంలో పెట్రో ఉత్పత్తు ల ధరలు వరుసగా నాలుగో రోజూ పెరిగాయి. బుధవారం లీటరు పెట్రోల్‌పై రూ.40 పైసలు, డీజిల్‌పై రూ. 45 పైసలు పెంచుతూ ఆయిల్‌ కంపెనీలు ధరలను పెంచినట్టు ఆయిల్‌ కంపెనీలు ప్రకటించాయి.

తాజా పెంపుతో నాలుగు రోజుల్లోనే లీటరు పెట్రోల్‌పై రూ.2.14, డీజిల్‌పై రూ.2.23ల ధరలు పెరిగాయి. సవరించిన ధరల ప్రకారం.. ఢిల్లీలో లీటరు పెట్రోలు రూ.73.40, డీజిల్‌ రూ.71.62లకు చేరింది. ఇవే ధరలు ముంబయిలో రూ.80.40, రూ.70.35గా నమోదవ్వగా, హైదరాబాద్‌లో రూ. 76.20, రూ.70లకు చేరుకుంది.

ఈ రకంగా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. మోడీ సర్కార్ తీసుకున్న నిర్ణయాల వల్లనే అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గినా…దేశంలో మాత్రం పెట్రోల్ ఉత్పత్తుల ధరలు తగ్గటం లేదు.