iDreamPost
iDreamPost
ఏపీలో ప్రభుత్వానికి అడుగడుగునా అడ్డుకట్ట వేసే ప్రయత్నంలో ప్రతిపక్షం ఉంది. సహజంగా విపక్షం ప్రజా సమస్యలపై పోరాడుతుంటే, పాలకపక్షం కాలయాపన చేయాలని చూడడం అన్ని చోట్లా చూస్తుంటాం. సుదీర్ఘకాలంగా ఏపీలో అమలయినా విధానం కూడా అదే. కానీ గత ఏడాది కాలంగా సీన్ మారిపోయింది. ప్రభుత్వం పలు సమస్యల పరిష్కారానికి ప్రయత్నాలు చేస్తుంది. వాటిని అడ్డుకోవడమే లక్ష్యంగా ప్రతిపక్షం సాగుతుంది. చివరకు ఈ పరిస్థితి ఇప్పుడు దీర్ఘకాల సమస్య అయిన ఇళ్ల స్థలాల వరకూ కూడా వచ్చేసింది. పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం పట్టుదలగా ఉంటే, దానికి అడ్డుపుల్ల వేసే లక్ష్యంతో విపక్షం తలమునకలై ఉంది.
రాజధాని ప్రాంతంలో హౌసింగ్ జోన్ కోసం జగన్ ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది. అటు తాడేపల్లి, ఇటు విజయవాడ నగరాల్లో అర్హులైన పేదలకు నివాస యోగ్యం కల్పించే యత్నం చేసింది. చాలాకాలంగా పడావుగా ఉన్న అమరావతి భూముల్లో కార్యకలాపాలకు సిద్దం అయ్యింది. కానీ అనూహ్యంగా దానిని అడ్డుకున్నారు. న్యాయస్థానాల ద్వారా ఈ ప్రక్రియ ముందుకు సాగకుండా విపక్షం తరుపున వేసిన పిటీషన్లు అందరినీ ఆశ్చర్యపరిచాయి.
ఆ తర్వాత కాకినాడ మడ అడవుల పేరుతో మరో వ్యవహారం తెరమీదకు వచ్చింది. రెండేళ్ల క్రితం టీడీపీ ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు స్థలాలు ఇచ్చినప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు ప్రభుత్వం తరుపున పేదలకు ఇళ్లస్థలాలు కేటాయించడానికి వచ్చింది. దాంతో ఈ విషయాన్ని కూడా వివాదాన్ని చేశారు. దానికి మడ అడవుల పేరు అడ్డు పెట్టారు. ఏకంగా ఎన్జీటీలో కూడా ఫిర్యాదు చేశారు. వేల మంది పేదలకు నివాస యోగ్యం రాకుండా అడ్డుకున్నారనే ఆందోళనకు కారణం అయ్యారు. ఇటీవల టీడీపీ నేతలు ఆ ప్రాంతంలో పర్యటనకు వెళ్లాలని చేసిన ప్రయత్నాన్ని లబ్దిదారులే అడ్డుకునే వరకూ తెచ్చుకున్నారు.
ఆ తర్వాత రాజానగరం నియోజకవర్గంలో ఆవ భూముల విషయంలో కూడా వివాదంగా మార్చే యత్నం చేసింది. కానీ ప్రస్తుతం మచిలీపట్నంలో కూడా పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు సిద్ధం చేసిన భూములను కోర్టులకు లాగింది. బందరు భూముల విషయంలో కూడా న్యాయస్థానాల ద్వారా అడ్డుపుల్ల వేసే ప్రయత్నం చేయడం చాలామందిలో ఆగ్రహానికి కారణం అవుతోంది. మొత్తంగా ప్రభుత్వం ఓ పెద్ద కార్యక్రమానికి ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ప్రతిపక్షం దానికి విఘ్నాలు కల్పించే యత్నంలో నిండా మునగడం విశేషంగా మారింది. ప్రతిపక్ష టీడీపీ వైఖరిని పలువురు తప్పుబడుతున్నారు. తాము చేయకపోగా, ఇప్పటి ప్రభుత్వం చేస్తున్న దానికి అడ్డంకులు సృష్టించడం తగదనే అభిప్రాయం వినిపిస్తోంది.