iDreamPost
android-app
ios-app

బాబుకి కుప్పం క‌ల‌వ‌ర‌పాటు..!

  • Published Feb 25, 2020 | 4:51 AM Updated Updated Feb 25, 2020 | 4:51 AM
బాబుకి కుప్పం క‌ల‌వ‌ర‌పాటు..!

మాజీ ముఖ్య‌మంత్రికి సుదీర్ఘ‌కాలంగా తాను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న నియోజ‌క‌వ‌ర్గంలో ఇప్పుడు ప‌ట్టు స‌డ‌లుతుంద‌నే సందేహాలు వ‌స్తున్నాయా..అనేక ఆటుపోట్లు ఎదుర్కొని ముందుకు సాగిన నియోజ‌క‌వ‌ర్గంలో గట్టిపోటీ త‌ప్ప‌ద‌నే అంచ‌నాకు వ‌చ్చారా..ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లు అవ‌స‌ర‌మ‌ని భావిస్తున్నారా.. సొంత సీటుని చ‌క్క‌దిద్దుకోవ‌డానికి శ్ర‌ద్ధ‌పెడుతున్నారా..అంటే అవున‌నే స‌మాధానం వస్తోంది. 1989 నుంచి వ‌రుస‌గా తాను గెలుస్తూ వ‌స్తున్న కుప్పం నియోజ‌క‌వ‌ర్గంపై చంద్ర‌బాబు దృష్టి పెట్టిన తీరు దానికి త‌గ్గ‌ట్టుగానే ఉంది. త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే స్థానిక ఎన్నిక‌ల్లో సొంత బ‌లం చేజారిపోకుండా చూసుకోవాల‌నే ప్ర‌య‌త్నంలో ఉన్నారు. మొన్న‌టి సాధార‌ణ ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపులో ఒకానొక‌ సంద‌ర్భంలో వెనుక‌బ‌డిన చంద్రబాబు చివ‌ర‌కు గ‌ట్టెక్కారు. కానీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌రిస్థితి అదే రీతిన ఉంటుంద‌నే ధీమా క‌నిపించ‌డం లేదు. దాంతో ఆయ‌న సొంత స్థానంలో ప్ర‌చారానికి శ్రీకారం చుట్టిన‌ట్టు క‌నిపిస్తోంది.

స‌హ‌జంగా చంద్ర‌బాబు కుప్పం నియోజ‌క‌వ‌ర్గానికి వ‌చ్చేది చాలా త‌క్కువ‌. ఆయ‌న త‌రుపున టీడీపీ నేత‌లే మొత్తం వ్య‌వ‌హారాలు చ‌క్క‌దిద్దుతారు. రాష్ట్ర‌స్థాయి నేత‌గా ఆయ‌న‌కు ప‌దే ప‌దే కుప్పం రావ‌డానికి అవ‌కాశం కూడా ఉండ‌దు. అయిన‌ప్ప‌టికీ ఇటీవ‌ల మారిన రాజ‌కీయ ప‌రిణామాల‌తో చంద్ర‌బాబు సొంత‌బలాన్ని కాపాడుకోవాల‌నే య‌త్నంలో ఉన్నారు. క‌ల‌ల సౌథం అమ‌రావ‌తిలో ఆయ‌న పార్టీ ఓట‌మి, చివ‌ర‌కు మంగ‌ళ‌గిరి చిన‌బాబు ప‌రాజ‌యం కూడా ఎదుర‌యిన నేప‌థ్యంలో కుప్పం కాచుకోవాల‌నే నిర్ణ‌యానికి ఆయ‌న వ‌చ్చిన‌ట్టు క‌నిపిస్తోంది.

చంద్ర‌బాబు త‌న పాల‌నా కాలంలో ఎన్న‌డూ తీసుకోని నిర్ణ‌యాన్ని తాజాగా జ‌గ‌న్ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. కుప్పం పంచాయితీగా మునిసిప‌ల్ హోదా క‌ట్ట‌బెట్టింది. దాంతో కౌన్సిల‌ర్లు, చైర్మ‌న్ ప‌ద‌వుల‌కు పోటీ జ‌ర‌గ‌బోతోంది. ఏప్రిల్ గానీ మే నెల‌లో గానీ స్థానిక స‌మ‌రం ఖాయంగా క‌నిపిస్తున్నాయి. దాంతో లోక‌ల్ ఎన్నిక‌ల్లో ప‌ట్టు చేజారితే ఆ త‌ర్వాత కుప్పం కాపాడుకోవ‌డం చంద్ర‌బాబుకి అంత సులువు కాదు. అది సుదీర్ఘ అనుభ‌వం ఉన్న చంద్ర‌బాబుకి బాగా తెలుసు. అందుకే ఆయ‌న ఇప్ప‌టి నుంచి జాగ్ర‌త్త‌లు ప‌డుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఇటీవ‌ల టీడీపీ ప్ర‌ధాన కార్యాల‌యంలో రెండు మార్లు కుప్పం నేత‌ల‌తో భేటీ అయ్యారు. ప‌లు జాగ్ర‌త్త‌లు సూచించారు. చ‌రిత్ర‌లో తొలిసారిగా తీవ్ర ప్ర‌తిఘ‌ట‌న ఎదుర‌వుతున్న త‌రుణంలో ప‌చ్చ‌జెండా రెప‌రెప‌లు కొన‌సాగించ‌డానికి త‌గ్గ‌ట్టుగా శ్రేణుల‌ను స‌మాయ‌త్తం చేసేందుకు స్వ‌యంగా రంగంలో దిగారు. అందుకు త‌గ్గ‌ట్టుగానే కుప్పం ప‌ర్య‌ట‌న‌లో ఆయ‌న దాదాపుగా ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించారు. రోడ్ షోలు, సుదీర్ఘ ప్ర‌సంగాల‌తో సాగారు. త‌న హ‌యంలో చేప‌ట్టిన అభివృద్ధిని చెప్పుకోవ‌డానికి ప్రాధాన్య‌త‌నిచ్చారు.

కుప్పం మునిసిప‌ల్ హోదా క‌ట్ట‌బెట్టిన వైఎస్సార్సీపీకి జ‌నం మొగ్గు చూపే ప్ర‌మాదం పొంచి ఉన్న త‌రుణంలో చంద్ర‌బాబు శ‌త‌విధాలా ప్ర‌య‌త్నించాల్సి వ‌స్తోంది. గ‌తంలో సులువుగా కుప్పం కాజేసిన టీడీపీకి ఈసారి కొత్త క‌ష్టాలు ఎదుర‌వుతున్నాయి. మ‌రి ఈ ప‌రీక్ష‌లో గ‌ట్టెక్కేందుకు బాబు చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఎలాంటి ఫ‌లితాలు ఇస్తాయో చూడాలి.